logo

ప్రవేశాలు తడబడి..!

సర్కారీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు తగ్గాయి. గతేడాదితో పోల్చితే సగం మేరే ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులు పెద్దసంఖ్యలో ముందుకొస్తారని విద్యాశాఖాధికారులు భావించినా..

Published : 07 Aug 2022 02:16 IST

ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువే

గతేడాదితో పోల్చితే 40 శాతం తగ్గుదల


నాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ప్రవేశాల కోసం వచ్చిన తల్లిదండ్రులు

ఈనాడు, హైదరాబాద్‌: సర్కారీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు తగ్గాయి. గతేడాదితో పోల్చితే సగం మేరే ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులు పెద్దసంఖ్యలో ముందుకొస్తారని విద్యాశాఖాధికారులు భావించినా.. సాధారణ స్థాయిలోనే ప్రవేశాలున్నాయి.

* హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, రెసిడెన్షియల్‌, కేజీబీవీ, మోడల్‌ విభాగాల్లో 2508 పాఠశాలలున్నాయి. జూన్‌ 1 నుంచే ప్రవేశాలు ప్రారంభించారు. ఇప్పటివరకు 35,544 మంది విద్యార్థులే ప్రవేశాలు తీసుకున్నారు. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 15,656 మంది చేరారు.

ఎందుకీ పరిస్థితి?.. గతేడాది కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపించారు. కరోనా మూడో దశ భయంతో పాఠశాలలు ఎన్నిరోజులు జరుగుతాయోనన్న సందేహం నెలకొంది. ప్రైవేటులో భారీగా ఫీజులు కట్టాల్సి ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అంతిమంగా గతేడాది ప్రవేశాలు భారీగా జరిగాయి.

* ఏకంగా మూడు జిల్లాల్లో 57 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య 35 వేలకే పరిమితమైంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు కాస్త కుదుటపడటంతో ప్రైవేటువైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం 1-8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టింది. రెండు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. అయినా ప్రవేశాలు పెరగలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

బడిబాట నామమాత్రమే!

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు జూన్‌ 1 నుంచి ప్రభుత్వం బడిబాట నిర్వహించింది. అదే సమయంలో పదోతరగతి మూల్యాంకనం జరిగింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వెరసి బడిబాట తూతూమంత్రంగా సాగింది. ఈసారి ప్రవేశాలపై ఉపాధ్యాయులు పెద్దగా దృష్టిపెట్టలేదు. క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన దాఖలాలు తక్కువే. అంతిమంగా ప్రవేశాలపై ప్రభావం చూపించాయి.

ప్రైవేటు నుంచి తక్కువగానే..!

గతేడాదితో పోల్చితే ఈసారి ప్రైవేటులో మానేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 11,327గా ఉంది. గతేడాది 25 వేల మంది ప్రైవేటును విడిచి సర్కారు పాఠశాలలకు మొగ్గు చూపారు. ఈసారి ప్రైవేటు పాఠశాలలు ప్రవేశాల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాయి. ఉపాధ్యాయులకు లక్ష్యాలు విధించాయి. గతేడాది ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక తరగతులు పూర్తిగా ప్రారంభించలేదు. ఈసారి నర్సరీ, ఎల్‌కేజీ నుంచి ప్రవేశాలు జరిగాయి. ఆ ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తగ్గారని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.

* హైదరాబాద్‌ జిల్లాలో 4047 మంది, మేడ్చల్‌ జిల్లాలో 7928, రంగారెడ్డి జిల్లాలో 3,399 మంది విద్యార్థులే 2 నుంచి 10వ తరగతి మధ్య ప్రైవేటు పాఠశాలలను విడిచి సర్కారీ పాఠశాలల్లో చేరారు.

మూడు జిల్లాల్లో కొత్తగా ప్రవొేశాలు ఇలా..

హైదరాబాద్‌ 11,219

మేడ్చల్‌ 15,656

రంగారెడ్డి 8,669

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని