logo

ఆటో నగర్‌ ఏర్పాటుకు అడుగులు..

జిల్లాలో వ్యాపార వాణిజ్య పరంగా పేరున్న తాండూరులో వ్యవసాయ విపణి విస్తరణ, ఆటోనగర్‌ ఏర్పాటు, పట్టణంలో అడ్డదిడ్డంగా ఉన్న షాబాద్‌ బండలు (నాపరాళ్ల) పాలిషింగ్‌ యూనిట్లను ఒకే చోటకు తరలించేందుకు సంబంధించిన అంతర్గత ప్రక్రియ

Published : 13 Aug 2022 02:02 IST

న్యూస్‌టుడే, తాండూరు

జిల్లాలో వ్యాపార వాణిజ్య పరంగా పేరున్న తాండూరులో వ్యవసాయ విపణి విస్తరణ, ఆటోనగర్‌ ఏర్పాటు, పట్టణంలో అడ్డదిడ్డంగా ఉన్న షాబాద్‌ బండలు (నాపరాళ్ల) పాలిషింగ్‌ యూనిట్లను ఒకే చోటకు తరలించేందుకు సంబంధించిన అంతర్గత ప్రక్రియ ప్రారంభమైంది. గడచిన జులై నెల చివరి వారంలో ఈ మూడింటికి సంబంధించి అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో భూముల కేటాయింపునకు సంబంధించి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

విపణి విస్తరణకు...

తాండూరులో విపణి విస్త్తరణకు అవసరమైన భూమిని రెవెన్యూ శాఖ వ్యవసాయ విపణికి అప్పగించింది. తాండూరులో 1969 జులై 6న వ్యవసాయ విపణి ఏర్పాటైంది. మూడెకరాల స్థలంలోనే విపణి కార్యాలయం, నాలుగు భారీ షెడ్లు ఏర్పాటయ్యాయి. ఏటా రూ.300 కోట్ల విలువ చేసే ఉత్పత్తుల విక్రయాలు ఇరుకుగా ఉన్న ప్రదేశంలోనే క్రయ, విక్రయాలు జరగడం అటు వ్యాపారులకు ఇటు రైతులకు ఇబ్బందిగా మారింది. వచ్చి పోయే వాహనాలకు కూడా క్లిష్ట పరిస్థితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో విపణిని విస్తరించాలనే ప్రతిపాదన మూడు దశాబ్దాల కిందటే వచ్చింది. అప్పటి నుంచి కొనసాగుతున్న ప్రయత్నాలకు ప్రభుత్వం భూమి కేటాయించడంతో శాశ్వత పరిష్కారానికి అడుగులు పడ్డాయి.

ఇక ఒకేచోట నాపరాళ్ల యూనిట్లు

తాండూరులో క్రమపద్ధతి లేకుండా ఎక్కడంటే అక్కడ ఏర్పాటైన నాపరాళ్ల పాలిష్‌ యూనిట్లు ఇక మీదట యుద్ధ ప్రాతిపదికన తాండూరు మండలం జిన్‌గుర్తిలోని 45 ఎకరాల ప్రభత్వ భూమిలోకి మారనున్నాయి. తాండూరు మండలం ఓగిపూరు, కరణ్‌కోట, మల్కాపూరు, కోటబాస్పల్లి, బషీరాబాద్‌ మండలం క్యాద్గిర, ఎక్మయి, నవాంద్గిలో వందల కొద్ది నాపరాళ్ల గనులు ఉన్నాయి. ఇక్కడ వెలికి తీసిన ముడి నాపరాయిని వ్యాపారులు నునుపుగా మార్చేందుకు తాండూరులోని 800 యూనిట్లకు తరలిస్తారు. పద్ధతి లేకుండా ఏర్పాటైన యూనిట్ల కారణంగా సంవత్సరాల తరబడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అన్ని యూనిట్లను ఒకే దగ్గరకు తరలించడం వల్ల పట్టణ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశ్కారమౌతాయి. ఉపాధి అవకాశాలు మెరుగౌతాయనే ఉద్దేశంతో జిన్‌గుర్తిలోని 45 ఎకరాల భూమిని కేటాయించింది.

15 ఎకరాలు కేటాయింపు

జిల్లాలో అతిపెద్ద పట్టణంగా పేరున్న తాండూరులో ఆటో నగర్‌కు ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలోని సర్వే సంఖ్య 58లోని 15 ఎకరాల భూమిని ఇప్పటికే హద్దులు నిర్ణయించిన రెవిన్యూ శాఖ రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పనా కార్పోరేషన్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. అంతా సవ్యంగా జరిగితే పట్టణంలోని ఎక్కడ బడితే అక్కడ ఉన్న వాహన విడిబాగాల విక్రయ దుకాణాలు, సర్వీసింగ్‌ సెంటర్లు, దుకాణాలు ఆటో నగర్‌ ప్రదేశానికి చేరకుంటాయి.

నమూనాలు రూపొందుతున్నాయి: రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు

తాండూరులో విస్తరణ జరిగే వ్యవసాయ విపణి, ఆటోనగర్‌, నాపరాళ్ల యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన దుకాణాలు, ఇతర మౌళిక వసతులు ఎలా ఉండాలనే విషయంలో సంబంధిత అధికారులు నమూనాలను రూపొందించే పనులు చేపడుతున్నారు. వీటికి తుది రూపం రాగానే నిర్మాణ పనులను బట్టి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. ఇవే నిధుల ఆధారంగా పనులు జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని