logo

ఉపాధి పూర్తి చేస్తేనే.. అనుమతి

గ్రామాల్లో వలసలను నివారించి సొంతూరులోనే పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం’ అమలు చేస్తోంది. కూలీలకు ఉపాధితో పాటు అన్నదాతలకు చేయూత అందించేందుకు వివిధ కార్యక్రమాలు

Updated : 15 Aug 2022 04:33 IST

ఆగిన పనులు కొలిక్కితెచ్చేందుకు కొత్త మార్గదర్శకాలు
న్యూస్‌టుడే, బొంరాస్‌పేట, కొడంగల్‌ గ్రామీణం

క్షేత్ర స్థాయిలో కూలీలు

గ్రామాల్లో వలసలను నివారించి సొంతూరులోనే పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం’ అమలు చేస్తోంది. కూలీలకు ఉపాధితో పాటు అన్నదాతలకు చేయూత అందించేందుకు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవటం, ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోవటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. నిధులు మంజూరైన తర్వాత చేపట్టిన పనులు పూర్తి చేయకుంటే కొత్తవి మంజూరు చేయరని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం  

ఇదీ పరిస్థితి: జిల్లాలో 19 మండలాల్లో 2,00,593 జాబ్‌కార్డులు ఉండగా 2.70 లక్షల మంది కూలీలు ఉపాధి పథకంలో పనులు చేస్తున్నారు. చెరువుల పూడిక తీత, పంట పొలాలను చదును చేయటం, విద్యాలయాల్లో వంటగదులు, శౌచాలయాలు, ఇంకుడు గుంతలు ఇలా 260 రకాల పనులు చేసుకునేందుకు అవకాశాలు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు 5,894 పనులు మంజూరు చేశారు. అందులో 4,401 పనులు వ్యవసాయ అనుబంధం, 1,720 నీటి వనరుల అభివృద్ధికి కేటాయించారు. కొన్ని గ్రామాల్లో చేపట్టిన పనులు పూర్తి చేయకుండానే కొత్తగా మరొకటి ప్రారంభిస్తున్నారు. దీంతో అసంపూర్తివి అందుబాటులోకి రాకుండా పోతున్నాయి. ఇక నుంచి ఈ సమస్య ఉండదు. గ్రామానికి మంజూరు చేసిన పనులు పూర్తి చేసిన తర్వాతనే కొత్తవి ఇవ్వాలని నిబంధనలు అమలు చేయనున్నారు.

గ్రామ పంచాయతీకి 20 చొప్పున...
ఇక నుంచి గ్రామ పంచాయతీకి 20 చొప్పున ఉపాధి పనులు చేపట్టేందుకు అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల నుంచి అమలు చేసేలా నిర్దేశించారు. పూర్తయిన వాటికి సంబంధించిన వివరాలను పూర్తిగా నమోదు చేసిన తర్వాతే మరోదాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. నూతనంగా విడుదల చేసిన ఆదేశాలు అభివృద్ధికి దోహదం చేసేలా ఉన్నాయని పనులు పక్కాగా సాగేందుకు అవకాశాలున్నట్లు పథకం అమలు అధికారులు భావిస్తున్నారు. ఉపాధి పనుల్లో పారదర్శకత కోసం ఇప్పటికే ‘నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) విధానాన్ని తీసుకొచ్చారు. కూలీల వివరాలు క్షేత్రస్థాయిలో చరవాణిలో ఫొటో తీసి వారి పేరు, హాజరు నమోదు చేయాలి. ఒకరి పేరుతో మరొకరు పనులు చేసుకునేందుకు అవకాశాలు లేకుండా లెక్క పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.


ఎంతో ప్రయోజనం కలుగుతుంది
- కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, వికారాబాద్‌

అసంపూర్తి పనులతో ఉపయోగం ఉండదని ప్రభుత్వం గుర్తించింది. పంచాయతీ కార్యదర్శులకు తోడుగా క్షేత్రసహాయకులు విధుల్లో చేరటంతో పనుల్లో వేగం పెరుగుతుంది. ప్లాంటేషన్‌ పనులు నిరంతరం కొనసాగే ప్రక్రియ కావటంతో ఇందుకు మినహాయింపు ఇచ్చారు. గుర్తించే సమయంలోనే ప్రాముఖ్యతను గమనించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు