logo

విధుల నుంచి తొలగించారని..స్వీపర్‌ ఆత్మహత్యా యత్నం..

అన్యాయంగా తనను విధుల నుంచి తొలగించారని ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది

Published : 07 Dec 2022 03:58 IST

ప్రిన్సిపల్‌ వేధింపులే కారణమని ఆరోపణ  

బాధితురాలిని పరామర్శిస్తున్న ప్రజా ప్రతినిధులు

కుల్కచర్ల గ్రామీణ, కుల్కచర్ల, న్యూస్‌టుడే: అన్యాయంగా తనను విధుల నుంచి తొలగించారని ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. కుల్కచర్ల ఎస్‌ఐ గిరి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూర్‌ మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన చింతకింది సుజాత (36) అనే మహిళ నాలుగు సంవత్సరాలుగా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో కాంటాక్ట్‌ పద్ధతిన స్వీపర్‌గా పని చేస్తోంది. పాఠశాల ఆవరణలోని క్వార్టర్స్‌ గదిలో తన భర్తతో కలిసి ఉంటోంది. నాలుగు నెలల క్రితం పాఠశాలలో కలుషిత నీటిని తాగడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంలో సుజాతను విధుల నుంచి తొలగించారు.

కార్యాలయాల చుట్టూ తిరిగినా...

తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నాటి నుంచి జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగ సాగింది. మూడు నెలలు గడుస్తున్నా ఏ అధికారి పట్టించుకోలేదు. తమ కుటుంబం బీదరికంలో ఉందని తనను విధుల్లోకి తీసుకునేలా చూడాలని పాఠశాల ప్రిన్సిపల్‌కు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మహిళ మనస్తాపానికి గురైంది. పాఠశాల ఆవరణలో ఉన్న క్వార్టర్స్‌ గదిలో మంగళవారం ఉదయం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. అక్కడే ఉన్న భర్త సుందర్‌ ఆమెను కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాధితురాలి భర్త సుందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు