logo

సమస్యల పరిష్కారానికే ధరణి హెల్ప్‌డెస్క్‌లు: కలెక్టర్‌

జిల్లాలో పేరుకు పోయిన ధరణి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు.

Published : 08 Feb 2023 02:47 IST

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పేరుకు పోయిన ధరణి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం నుంచి వీటికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. 

* ప్రతి తహసీల్దారు కార్యాలయంలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రంలో రెవెన్యూ, ధరణి పోర్టల్‌పైన అవగాహన కలిగిన ఉద్యోగి ఉంటారు. వీరు దరఖాస్తుదారునికి ధరణి సందేహాలను నివృత్తి చేసి అతని సమస్యను పరిష్కరించదగినదా లేదా సివిల్‌ తగాదా కిందకు వస్తుందా అనే విషయాన్ని వివరించాలి.

* పరిష్కరించదగిన సమస్య అయితే ధరణి పోర్టల్‌లోని వివిధ మాడ్యూల్స్‌లో కావాల్సిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా సూచనలు ఇవ్వాలి. సివిల్‌ దావా కిందకు వచ్చే సమస్యలను ఆయా సివిల్‌ కోర్టులో పరిష్కరించుకునే విధంగా చూడాలి. మండల తహసీల్దార్లు మీడియా ప్రకటన ద్వారా ధరణి హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేయాలి. అంతేకాకుండా సోషల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా బహుళ ప్రచారం పొందేలా చూడాలి.

మీసేవ కేంద్రాల్లోనూ...

జిల్లాలోని ప్రతి మీ సేవ కేంద్రాల్లోనూ ధరణి హెల్ప్‌డెస్క్‌లను తహసీల్దార్లు ఏర్పాటు చేయించాలి. ధరణి పోర్టల్‌పైన అవగాహన ఉన్న ఆపరేటర్‌ ఈ కేంద్రం యజమాని నియమించుకునేలా చూడాలి. తహసీల్దార్లు వీరికి అవగాహన కల్పించాలి.

13 నుంచి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రజావాణి: ఈనెల 13 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తహసీల్దారు కార్యాలయంలో ధరణి ఫిర్యాదులపై ‘ప్రజావాణి’ని ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజావాణిలో తహసీల్దారు స్వయంగా ఉండి దరఖాస్తులను స్వీకరించాలి. ధరణి పోర్టల్‌లో ప్రస్తుత స్థితిని గమనించి సరైన మాడ్యూల్స్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా చేసి వెంటనే నివేదికను కలెక్టర్‌ కార్యాలయానికి పంపించాలి. రైతు సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని