logo

అవి చెల్లని చీటీలే

గతేడాది మార్చి నుంచి డిసెంబరు మధ్య జారీ అయిన 31,454 ధ్రువపత్రాలను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. అందులో 27,328 జనన, 4126 మరణ ధ్రువపత్రాలు ఉన్నాయి.

Updated : 07 Mar 2023 05:59 IST

ఏళ్లనాటి తేదీలతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు
31వేల పత్రాలు రద్దు చేసిన జీహెచ్‌ఎంసీ
ఈనాడు, హైదరాబాద్‌

గతేడాది మార్చి నుంచి డిసెంబరు మధ్య జారీ అయిన 31,454 ధ్రువపత్రాలను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. అందులో 27,328 జనన, 4126 మరణ ధ్రువపత్రాలు ఉన్నాయి. వాటన్నింటి వివరాలను సర్వర్‌ నుంచి బల్దియా తొలగించింది. ఫిబ్రవరి 13, 2023న ‘చావు.. పుట్టుకలు.. వారి చేతుల్లోనే’ అనే శీర్షికతో ‘ఈనాడు’ ప్రచురించిన కథనానికి స్పందనగా జీహెచ్‌ఎంసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. గతేడాది ప్రారంభంలో బల్దియా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ సేవల్లో లోపాలతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు వేలాదిగా మంజూరయ్యాయనే కథనంతో.. కేంద్ర కార్యాలయం సర్కిళ్లవారీగా మంజూరైన ధ్రువపత్రాల సమాచారం సేకరించి, వాటిని రికార్డుల్లోంచి తొలగించింది.

ఏం జరిగిందంటే..?

అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో.. 2022 ప్రారంభంలో జనన, మరణ ధ్రువపత్రాలకు దరఖాస్తు, ధ్రువపత్రాల ముద్రణ సేవలను జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ‘మీ సేవ’ కేంద్రాలకు బదలాయించింది. లోపభూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు తలెత్తాయి. అవగాహన లేని ఉన్నతాధికారులు ‘ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌’ పేరుతో ప్రవేశపెట్టిన డిజిటల్‌ సేవలు.. నకిలీలకు తావిచ్చాయి. వివరాలు నమోదుచేసి, సరైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తే, సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి సర్టిఫికెట్‌ మంజూరుచేయాలి. అలాంటిదేమీ లేకుండా.. నచ్చిన పేరుతో, నచ్చిన తేదీలో జనన, మరణ ధ్రువపత్రాన్ని తీసుకునే వెసులుబాటును కల్పించడంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. నాన్‌ అవెలబులిటీ సర్టిఫికెట్‌, ఆర్డీవో ఉత్తర్వులు, ఇతరత్రా ధ్రువీకరణ ప్రతాలకు బదులు తెల్లకాగితాలు, చిత్తు పేపర్లను సమర్పించి.. పాత తేదీలతో జనన, మరణ ధ్రువపత్రాలను సృష్టించారు. అవకాశం ఎప్పుడు చేజారుతుందోనని.. ముషీరాబాద్‌, చార్మినార్‌, మెహిదీపట్నం, ఇతరత్రా ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు మీసేవ కేంద్రాలవారు. రేయింబవళ్లు ఆయా కేంద్రాలను నడిపించారంటే పరిస్థితి ఎంత దారుణానికి దారితీసిందో అర్థం చేసుకోవచ్చు. 40, 50 ఏళ్ల కిందటి తేదీలతోనూ జనన ధ్రువపత్రాలు ఇచ్చారు.

అసలైనవీ పోయినట్టేనా..

మీసేవ కేంద్రాల్లో జారీ అయిన ధ్రువపత్రాలన్నీ నకిలీవి కాదు. ఈ దందా నడుస్తున్న సమయంలో.. వచ్చిన దరఖాస్తులన్నింటినీ నిర్వాహకులు అడ్డదారిలోనే పూర్తి చేశారు. సరైన పత్రాల్లేవంటూ రద్దు చేసిన వాటిలో సిసలైన ధ్రువపత్రాలూ కొట్టుకుపోయాయి. వారంతా లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారంపై కమిషనర్‌ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని