logo

Engineering: ‘ఇంజినీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ ఒక్కటే కాదు’

‘‘ఇంజినీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే కాదు.. సివిల్‌, మెకానికల్‌ కోర్సులు కూడా. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో అవకాశాలొస్తున్నాయి... రూ.లక్షల్లో వేతనాలు లభిస్తున్నాయన్న అభిప్రాయంతో తల్లిదండ్రులు కంప్యూటర్‌సైన్స్‌ చదివించేందుకు రూ.లక్షలు ఖర్చుపెట్టేందుకు వెనుకాడ్డం లేదు.

Updated : 25 Jan 2024 10:16 IST

ఆస్ట్రేలియా లా ట్రోబ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ హోసం అబ్యుయేల్‌ నాగ 

ఈనాడు, హైదరాబాద్‌ : ‘‘ఇంజినీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే కాదు.. సివిల్‌, మెకానికల్‌ కోర్సులు కూడా. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో అవకాశాలొస్తున్నాయి... రూ.లక్షల్లో వేతనాలు లభిస్తున్నాయన్న అభిప్రాయంతో తల్లిదండ్రులు కంప్యూటర్‌సైన్స్‌ చదివించేందుకు రూ.లక్షలు ఖర్చుపెట్టేందుకు వెనుకాడ్డం లేదు. వాస్తవానికి సివిల్‌, మెకానికల్‌ కోర్సులకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది’’ అని ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్‌ విశ్వవిద్యాలయం సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫ్రొపెసర్‌ హోసం అబ్యుయేల్‌ నాగ అన్నారు. హైదరాబాద్‌లోని మహీంద్ర విశ్వవిద్యాలయంతో సివిల్‌ ఇంజినీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సు ఒప్పందం కుదుర్చుకునేందుకు మంగళవారం ఇక్కడికి వచ్చిన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆస్ట్రేలియాలో సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు అక్కడి పరిశ్రమలు ఉద్యోగాలిస్తున్నాయని, ఎంఎస్‌ పూర్తిచేసిన వారికి కొద్దినెలలు శిక్షణ ఇచ్చి వృత్తి నిపుణులుగా తీసుకుంటున్నారని వివరించారు. అమెరికాలో ఇంజినీరింగ్‌, ఎంఎస్‌ చదువుకునేందుకు భారత కరెన్సీలో ఒక విద్యార్థికి నాలుగేళ్లకు రూ.1.20 కోట్లు ఖర్చవుతుంది. ఆస్ట్రేలియాలోని టాప్‌టెన్‌ విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్‌ చదువుకునేందుకు వెళితే... నాలుగేళ్లలో నలభై లక్షలు మాత్రమే ఖర్చవుతుందని తెలిపారు.  

భారతీయ విద్యార్థులకు ప్రోత్సాహమిచ్చేందుకు..

ఆస్ట్రేలియాలో ప్రముఖ వర్సిటీలు భారతీయ విద్యార్థులను ఇంజినీరింగ్‌, పీజీ కోర్సుల్లో చేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అందుకే ఒకట్రెండేళ్ల నుంచి దిగ్గజ వర్సిటీలు ది మెల్‌బోర్న్‌, ది పెర్త్‌, సిడ్నీ, క్వీన్స్‌ల్యాండ్‌, న్యూ సౌత్‌వేల్స్‌ వంటివి దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలతో డ్యూయల్‌ డిగ్రీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. డ్యూయల్‌ డిగ్రీలో భాగంగా ఆస్ట్రేలియా విద్యార్థులు ఇక్కడికి వచ్చి విశ్వవిద్యాలయాల్లో చదువుకోనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్‌, ఎంఎస్‌ చదివేందుకు విద్యార్థులకు జాయింట్‌ వీసా ఉపకరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని