logo

మ్యాట్రిమోనీ వేదిక.. పెళ్లి మాటున వంచన

జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. నిత్య పెళ్లి కొడుకులా మారాడు. మ్యాట్రిమోనీ వేదికల ద్వారా యువతుల్ని మోసం చేస్తున్నాడు. ఓ యువతికి దగ్గరై రూ.70 లక్షలు కొట్టేశాడు.

Updated : 24 Mar 2024 09:24 IST

రాజేశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. నిత్య పెళ్లి కొడుకులా మారాడు. మ్యాట్రిమోనీ వేదికల ద్వారా యువతుల్ని మోసం చేస్తున్నాడు. ఓ యువతికి దగ్గరై రూ.70 లక్షలు కొట్టేశాడు. అప్పులు చేయడంతోపాటు బ్యాంకు రుణం, బంగారం తాకట్టుపెట్టి మరీ ఈ సొమ్ము అప్పగించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ రవీంద్రరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ శనివారం ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు.

అప్పులు చేయించి సొమ్ము స్వాహా

ఏపీ లోని కృష్ణా జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేశ్‌(40) ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసేవాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై.. తేలిగ్గా డబ్బు కొట్టేయడానికి మ్యాట్రిమోనీ వేదికల ద్వారా యువతుల్ని మోసగించాలని నిర్ణయించుకుని.. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పెళ్లి సంబంధాల కోసం సంప్రదించేవాడు. ఎవరైనా సంప్రదిస్తే మాట కలిపి కొన్నాళ్లు స్నేహం చేశాక మోసం మొదలుపెడతాడు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. ఈ కష్టాలు తొలగిపోతే పెళ్లికి చేసుకుంటానని వంచిస్తాడు. నమ్మిన యువతులు బాధితుడికి డబ్బు చెల్లించి మోసపోతారు. నగరానికి చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించాడు. నిందితుడు తాను ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నానని.. పెళ్లికి ముందు సాయం కావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన యువతి గతేడాది ఏప్రిల్‌లో రూ.2 లక్షలు ఇచ్చింది. తర్వాత ఆమెను నేరుగా కలిసి డబ్బు సాయం చేస్తే అంతా చక్కదిద్దుకుని పెళ్లి చేసుకుంటానని.. అప్పు తర్వాత చెల్లిస్తానని కట్టుకథలు చెప్పాడు. నిజమేనని భావించి అప్పు చేసి కొంత మొత్తం ఇచ్చింది. అవి చాలవని చెప్పడంతో ఆమె పేరుతో బ్యాంకు నుంచి ఇంటి రుణం, బంగారు నగల్ని తాకట్టుపెట్టి, ప్రైవేటు రుణ సంస్థల నుంచి వ్యక్తిగత రుణం తీసుకుని మొత్తం రూ.70 లక్షలు ఇచ్చింది. ఈ సొమ్మంతా వసూలు చేసిన నిందితుడు.. తర్వాత తాను పెళ్లి చేసుకోలేనని, అందంగా లేవంటూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని చెప్పినా పట్టించుకోలేదు. బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని