logo

మున్సిపల్‌ సిబ్బందిపై రాళ్లతో దాడి

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ప్రదాన రహదారిపై కొబ్బరిబొండాలను విక్రయించేవారు మున్సిపల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.

Published : 30 Mar 2024 02:13 IST

దాడికి పాల్పడుతున్న కొబ్బరి బొండాల వ్యాపారి కుటుంబ సభ్యులు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ప్రదాన రహదారిపై కొబ్బరిబొండాలను విక్రయించేవారు మున్సిపల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సులేమాన్‌నగర్‌ సమీపంలో ప్రధాన రహదారిపై కొబ్బరిబొండాలను విక్రయించడంపై స్థానికులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై చర్యలు తీసుకోవాలని ఆయన సర్కిల్‌ అధికారులను ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనంతో పొరుగు సేవల సిబ్బంది సురేష్‌, అరుణ్‌, ఓంప్రకాష్‌ తదితరులు శుక్రవారం దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ వ్యాపారులు లేకపోవడంతో కొబ్బరిబొండాలను తమ వాహనంలో వేస్తుండటం గమనించిన వ్యాపారి కుటుంబసభ్యులు ముగ్గురు వారిపై రాళ్లతో, కర్రలతో దాడిచేశారు. దీంతో సురేష్‌, ఓంప్రకాష్‌కు గాయాలైనట్లు మున్సిపల్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై వరుస దాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికుల సంఘ రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి ఆరోపించారు.


నగ్న వీడియోలు తీసిన నకిలీ ఆర్‌ఎంపీ వైద్యుడి అరెస్టు

అహ్మద్‌

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: తాండూరు పట్టణంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా చెలామణి అవుతూ, ఓ మహిళను నగ్నంగా వీడియోలు తీసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన అహ్మద్‌ ఆర్‌ఎంపీ వైద్యుడిగా క్లీనిక్‌ నిర్వహిస్తున్నాడు. అక్కడికి  వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇదే క్రమంలో ఓ మహిళతోనూ ఇలాగే వ్యవహరించి, ఆమెను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. దీంతో బాధితురాలు ఈ నెల 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అహ్మద్‌ పట్టణాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, ఎట్టకేలకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఉద్దండాపూరు వద్ద శుక్రవారం పట్టుకున్నారు. అతని వద్ద ఆర్‌ఎంపీగా గుర్తించే ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవని డీఎస్పీ చెప్పారు. అత్యాచారం కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, ప్రివెంటు యాక్ట్‌, చీటింగ్‌ కేసులు నమోదు చేశామని వివరించారు.


తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి విద్యార్థి దుర్మరణం

సుదీప్‌ పట్నాయక్‌

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. పటాన్‌చెరు ఠాణా పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరు సీతారామపురం కాలనీలో ఉంటున్న సుదీప్‌ పట్నాయక్‌(15)  పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వార్షిక పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బాలుడి తల్లికి పంటినొప్పి రావడంతో మాత్రలు తెచ్చేందుకు ద్విచక్ర వాహనం తీసుకొని బయల్దేరాడు. శాంతినగర్‌లో స్నేహితుడు జస్వంత్‌ను ఎక్కించుకుని జాతీయ రహదారిపైకి వస్తున్నాడు. పెట్రోల్‌ తక్కువగా ఉందని నోవాపాన్‌ కూడలికి సమీపంలో ఉన్న బంక్‌కు వెళ్లి పెట్రోల్‌ పోయించుకుని తిరిగి వసున్నారు. ఆ సమయంలో వాల్యూజోన్‌ మార్ట్‌ సమీపంలో  ముందు వెళుతున్న వాహనాన్ని బలంగా  ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. సుదీప్‌ పట్నాయక్‌ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు.  జస్వంత్‌కు గాయాలు కాగా.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


40 పాత ద్విచక్ర వాహనాలు దగ్ధం

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆసిఫ్‌నగర్‌ పాత పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.  నిజాం హయాంలోని ఈ ఠాణాను కూల్చివేయడంతో   ప్రస్తుతం ఖాళీగా ఉంది. కొన్నేళ్ల క్రితం వివిధ కేసుల కిందË స్వాధీనం చేసుకున్న వాహనాలను అక్కడ ఉంచారు. ప్రమాదంలో దాదాపు 40 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఖాళీ స్థలంలో పొదలు దట్టంగా పెరిగాయని, ఎండాకాలం కావడంతో మొక్కలు ఎండిపోయాయి. గురువారం రాత్రి ఓ పెళ్లి బరాత్‌లో టపాసుల పేల్చడంతో నిప్పురవ్వలు పడి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ఈ జాగా ప్రహరీని ఆనుకొని ఉన్న నియంత్రిక పనిచేయకపోవడంతో విద్యుత్తు అధికారులు మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.


దొంగతనాలతో జల్సాలు...ఐదుగురి అరెస్టు

చోరీకి దొంగల ముఠా ఉపయోగించిన పరికరాలు

శామీర్‌పేట, న్యూస్‌టుడే: సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని నిర్మానుష్య ప్రదేశాలు, వ్యవసాయ క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని 18 చోరీలకు పాల్పడిన ఓ ముఠాను శామీర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్‌ జిల్లాకు చెందిన షేక్‌ఖాదర్‌(32), షేక్‌ఖయ్యూమ్‌(30), షేక్‌నయీం(25), షేక్‌మహ్మద్‌(21), షేక్‌రహీం(27)లు ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలో వచ్చి బోరు మోటార్లు, రాగి తీగలు, వాహనాల బ్యాటరీలు, నిర్మాణంలో ఉన్న ఇళ్లలోని ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ వస్తువులు, దేవాలయాల్లోని హుండీలు, గ్యాస్‌ సిలిండర్లు, ఇత్తడి వస్తువులను చోరీ చేస్తున్నారు. చోరీ సొత్తు అమ్ముకుని ఆ డబ్బుతో జల్సాలు చేస్తారు. ఈ ముఠా శామీర్‌పేట ఠాణా పరిధిలో 6 చోరీలకు పాల్పడ్డారు. శుక్రవారం ప్యాసింజర్‌ ఆటోలో ఉప్పరిపల్లి అవుటర్‌ రింగ్‌ సర్వీస్‌ రోడ్డులో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద స్పానర్స్‌, ఎలక్ట్రికల్‌ హ్యండ్‌ గ్రైండర్‌, చిన్న గునపం, కట్టింగ్‌ ప్లేయర్లు, రింగ్‌ పానాలు స్వాధీనం చేసుకున్నారు.


నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలతో ద్విచక్ర వాహనాల విక్రయం

స్వాధీనం చేసుకున్న వాహనాలు, చిత్రంలో నిందితుడు మహ్మద్‌ అక్బరుద్దీన్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే: నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, నంబరు ప్లేట్లు సృష్టించి ద్విచక్ర వాహనాలు విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి అబిడ్స్‌ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మీ పెరుమాల్‌ వివరాల ప్రకారం.. కింగ్‌కోఠి షేర్‌గేట్‌కు చెందిన మహ్మద్‌ అక్బరుద్దీన్‌(34) వృత్తిరీత్యా లేథ్‌ మెషిన్‌ వర్కర్‌. అతనికి కింగ్‌కోఠిలో నియామత్‌ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ ఉంది. అక్రమ సంపాదనకు పథకం వేశాడు. పాత ద్విచక్ర వాహనాలను స్క్రాప్‌ డీలర్లు, ఫైనాన్సర్ల నుంచి ఎలాంటి పత్రాలు లేనివి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాడు. అనంతరం వాటి విడిభాగాలు ఇంజన్‌, ఛాసిస్‌, ఇతర భాగాలతో నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, నంబరు ప్లేట్లు సృష్టించి విక్రయించి ఆర్జిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఏడు ద్విచక్ర వాహనాలు, కట్టింగ్‌ మిషన్‌, ఆల్ఫాబెటికల్‌ ఐరన్‌ బిట్స్‌/డైలు (40), నంబరు ప్లేటు కలిగిన ఐరన్‌ బిట్స్‌/డైలు (09) స్వాధీనం చేసుకున్నారు.


తుక్కు దుకాణంలో అగ్నిప్రమాదం

తగలబడుతున్న  దుకాణం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ పట్టణంలో శుక్రవారం ఓ తుక్కు దుకాణంలో మంటలు చెలరేగాయి. ఎల్పీజీ గ్యాస్‌ కంపెనీకి ఆనుకొని మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన గ్యాస్‌ ఏజన్సీ సిబ్బంది సిలిండర్లను వెంటనే బయటకు తరలించారు. ఆర్జీఐఏ పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. అహ్మద్‌నగర్‌కు చెందిన సాధిక్‌, జహంగీర్‌ ఇద్దరు బంధువులు. వీరు ఆర్బీనగర్‌లోని రాళ్లగూడ రహదారి పక్కన కొన్నేళ్ల కిందట దుకాణం ఏర్పాటు చేసి కేబీఎన్‌ పేరుతో తుక్కు వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలా గురువారం రాత్రి వారు దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఉదయం తుక్కు దుకాణంలో మంటలు వస్తున్నాయని కాలనీవాసులు వారికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి స్థానికులతో కలిసి మంటలను ఆర్పడానికి యత్నించినా ఫలితం లేదు. అగ్నిమాపక శకటాలు ఆలస్యంగా వచ్చాయి. తుక్కు దుకాణం వద్ద బార్‌ నిర్వాహకులు చెత్త కుప్పలకు నిత్యం నిప్పు పెడుతున్నారన్నారని, ఆ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.


వృద్ధుడి మెడలో గొలుసు అపహరణ

సైదాబాద్‌: వృద్ధుడి మెడలో బంగారు గొలుసు అపహరించిన ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది. గొలుసు తెంపుకొని పారిపోతున్న దొంగను ఇద్దరు యువకులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. మాదన్నపేటకు చెందిన ప్రకాశ్‌గౌడ్‌ వెల్డింగ్‌ పనులు చేస్తాడు. శుక్రవారం సాయంత్రం శంకేశ్వర్‌బజార్‌ పెట్రోల్‌ బంకు వద్ద కారులోంచి అతను దిగాడు. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతన్ని బెదిరించారు. అతని మెడలోని రెండు తులాల బంగారు గొలుసు అపహరించి పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించి రహదారిపై పడిపోయాడు. సమీపంలో ఉన్న ఇద్దరు యువకులు గమనించి ఆటోలో పారిపోతున్న సింగరేణి కాలనీ గుడిసెల ప్రాంతానికి చెందిన కొర్ర స్వామి నాయక్‌(40)ను వెంబడించి పట్టుకున్నారు. ఆటోలో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు.


పోలీసులు న్యాయం చేయడం లేదని..

పెట్రోల్‌ సీసాతో శ్రీనివాస్‌

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: మధురానగర్‌ పోలీసులు తనకు న్యాయం చేయడంలేదంటూ, రహ్మత్‌నగర్‌ వీడియోగల్లీ ప్రాంతానికి చెందిన యోగా శిక్షకుడు శ్రీనివాస్‌ ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకొని, పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్‌ చేశాడు. శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భార్యతో విభేదాలు రావడంతో శ్రీనివాస్‌ దంపతులు ఏడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈనెల 17న అతడు ఇంట్లో భోజనం చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి ప్లేటు తన్ని, బయటికి నెట్టేడయంతో డయల్‌ 100కు కాల్‌ చేశాడు. ఇంతలో వచ్చిన వ్యక్తి పారిపోయాడు. పోలీసులు తనను ఠాణాకు తీసుకొచ్చారని, అదే సమయంలో భార్య, పిల్లలు రాగా, తన ఫిర్యాదు తీసుకోకుండా, భార్య తనపై ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నారని ఆరోపించాడు. పోలీసులు తనకు న్యాయం చేయడంలేదని, ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నాడు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. శ్రీనివాస్‌ భార్య, పిల్లల్ని వేధిస్తుండటంతో వారు ఆమె తల్లి ఇంట్లో ఉంటున్నారని, అమ్మమ్మ మనుమరాలికి ఇచ్చిన ఇంటి స్థలాన్ని విక్రయించడంతో శ్రీనివాస్‌ వచ్చి న్యూసెన్స్‌ చేస్తున్నాడని, అతడి కూతురు ఫిర్యాదు మేరకు క్రైమ్‌ నంబరు 198/24 కేసు నమోదు అయ్యిందన్నారు. అయితే, తన మామ తనకు స్థలం ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించినందుకు శ్రీనివాస్‌పై నాలుగేళ్ల కిత్రం జూబ్లీహిల్స్‌ ఠాణాలోనూ కేసు నమోదు అయిందని ఇన్స్‌పెక్టర్‌ డి.మధుసూదన్‌ రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని