logo

నిలువ నీడ.. యాడ?

బస్‌షెల్టర్ల ఏర్పాటులో జాప్యం, నిర్వహణ లోపం కారణంగా ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

Updated : 30 Mar 2024 05:51 IST

రద్దీ ప్రాంతాల్లో షెల్టర్లు లేక ప్రయాణికుల అవస్థలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బస్‌షెల్టర్ల ఏర్పాటులో జాప్యం, నిర్వహణ లోపం కారణంగా ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో షెల్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలో రహదారిపై నిరీక్షిస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు సైతం అవస్థలు పడుతున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.. పథకం అమలు చేయడానికి పూర్వం నగరంలో రోజుకి సగటున 11 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు.. ప్రస్తుతం వారి సంఖ్య 16 లక్షలకు పెరిగింది. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు కానరావడం లేదు. ట్రాఫిక్‌ ఆంక్షల పేరిట బస్టాప్‌ల వద్ద ప్రయాణికులు ఉన్నప్పటికీ డ్రైవర్లు బస్సుల్ని అక్కడ ఆపకుండా దూరంగా నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు వాటి కోసం పరుగులు పెడుతున్నారు.  

షాపింగ్‌మాల్స్‌ ముందు నిరీక్షణ..: అవసరమైన చోట షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండవేడిమి తాళలేక షాపింగ్‌మాల్స్‌ ముందు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. మాల్స్‌ ద్వారాల నుంచి బయటకొచ్చే చల్లగాలిలో వారు సేదదీరుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏసీ షెల్టర్లు ఉన్నప్పటికీ అవి నిరుపయోగంగా మారాయి. వాటి నిర్వహణను అధికారులు విస్మరించారు. వాటిలోకి వెళ్లిన ప్రయాణికులు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తార్నాక-ఉప్పల్‌ మధ్య పలు బస్టాప్‌ల ముందున్న స్థలాన్ని ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు ఉపయోగిస్తున్నారు. అమీర్‌పేట్‌ వద్ద షెల్టర్‌ లేకపోవడంతో సవ్య, అపసవ్య దిశలో వచ్చే వాహనాలను దాటి బస్సెక్కాల్సిన పరిస్థితి. ఈఎస్‌ఐ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే ప్రయాణికుల కోసం మూడు షెల్టర్లు ఏర్పాటు చేయగా.. దానిలో కూర్చున్నవారికి బస్సులు కనిపించడం లేదు. దీంతో వారు రహదారి పక్కనున్న చెట్ల కింద నిరీక్షిస్తున్నారు. ఆయా షెల్టర్లను ఆకతాయిలు ఆక్రమించుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గాంధీభవన్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, బేగంపేట్‌, పబ్లిక్‌గార్డెన్‌ తదితర ప్రాంతాల్లోని షెల్టర్లు లోపలకు ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులకు బస్సుల రాక గుర్తించడం కష్టమవుతోంది.

బస్సెక్కాలంటే నడవాల్సిందే..

హిమాయత్‌నగర్‌ రోడ్డు, నారాయణగూడ, కాచిగూడ, అమీర్‌పేట్‌, కోరి, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో షెల్టర్లు అందుబాటులో లేవు. ఆయా ప్రాంతాల్లో బస్సెక్కాలంటే సుమారు కి.మీ.దూరంలోని బస్టాప్‌ల వద్దకు నడిచి వెళుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఆటోలపై ఆధారపడుతున్నారు. హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, సోమాజిగూడ ప్రాంతాల్లో అవసరానికి మించి షెల్టర్లు నిర్మించారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా క్యాబ్‌లు, ద్విచక్ర వాహనాలపై ఆధారపడతారు. జనాలకు మాత్రం షెల్టర్లు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని