logo

సరదా అనుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు

‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు.

Updated : 17 Apr 2024 05:19 IST

ఈదేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం

న్యూస్‌టుడే, వికారాబాద్‌: ‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు. అయితే ఈ సరదా ప్రాణాల మీదికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చిన్నారులు నీళ్లను చూసి ఆకర్షితులై ఒక్కోసారి ఇంట్లో చెప్పకుండా  వెళ్తుంటారు. వారికి ఈత రాకున్నా కూడా నీళ్లలో దిగి స్నానాలు చేస్తుంటారు. యువకులు కూడా ఇలా చేస్తుంటారు. ఈ యత్నంలో ఈతరాక, లోతు తెలియక నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో విషాదం నింపుతారు. ప్రస్తుతం ఎండాకాలం. విద్యా సంస్థలకు సెలవులు. గ్రామాల్లో ఎండ వేడినుంచి ఉపశమనం కోసం సమీపంలోని చెరువులు, కుంటలు, బావుల చెంతకు ఈత కొట్టాలని వెళ్తుంటారు. అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.

  • 2023 జనవరి 15న పూడూర్‌ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు కోట్‌పల్లి ప్రాజెక్టుకు విహరించడానికి వెళ్లి ఈత రాక నీట మునిగి మృతి చెందారు.
  • 2022 ఆగస్టులో ఓ విద్యార్థి విహార యాత్రకు వచ్చి అనంతగిరి పుష్కరిణిలో స్నానం చేస్తూ ఈత రాక మృతి చెందాడు.
  • 2022 అక్టోబరులో ఈత రాక నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సాయికుమార్‌ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
  • 2021లో రాజధాని నగరానికి చెందిన నలుగురు యువకులు విహార యాత్రకు కోట్‌పల్లి ప్రాజెక్టుకు రాగా, వీరిలో ఓ యువకుడు నీటిలో మునిగి మృతువు పాలయ్యాడు.

ఇవీ తీసుకోవాల్సిన చర్యలు

  • చెరువుల మరమ్మతులు చేసే సందర్భాల్లో అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డును అధికారులు ఏర్పాటు చేయించాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ బావుల దగ్గర సంబంధిత యజమానులు కంచె ఏర్పాటు చేసి ఎవరూ బావిలోకి దిగకుండా చర్యలు తీసుకోవాలి.
  • చెరువులు, ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉంటుంది. అక్కడి పరిస్థితి తెలుసుకోకుండా ఈత వచ్చినా అందులో దూకితే ప్రమాదాల బారిన పడటం ఖాయం.
  • ఈత వచ్చినా కూడా నీళ్లు ఎంత లోతు ఉన్నాయి? ఎలాంటి ప్రమాదాలు ఉంటాయనేది గమనించి ఈతకు ప్రయత్నించాలి.
  • పిల్లలు ఈత నేర్చుకోవాలనుకుంటే నిపుణులైన ఈతగాళ్ల సమక్షంలో తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్పాలి.

పిల్లలు, యువకులపై కన్నేసి ఉంచాలి..

వార్షిక పరీక్షలు ముగిసి సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లిన పిల్లలు, యువకులు చేసే పనులపై ఓ కన్నేసి ఉంచాలి. పిల్లలు స్నేహితులతో కలిసి పొలం గట్ల వెంబడి, చెరువులు, కుంటల్లోకి వెళ్లి సరదాగా గడపాలని చూస్తారు. ఈత కొట్టడానికి వెళ్లి లోతు తెలియక, ఈత రాక మృత్యువాత పడ్డ పిల్లల సంఘటనలు జిల్లాలో అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఎవరితో ఆటలాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని గమనించి తగు సలహాలు, సూచనలు చేయాలి. అవసరమైతే ఈత వచ్చిన పెద్దలే పిల్లల వెంట ఉండి ఈత నేర్పించాలి. ఏమరుపాటు వహించకూడదు.

కోటిరెడ్డి, జిల్లా పోలీసు అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని