logo

అలలపై సాహసం.. అలుపెరగని పోరాటం

‘అమ్మా నేను హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ నేర్చుకుంటానని కుమార్తె అడిగినప్పుడు.. తల్లిదండ్రులు తొలుత ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడుతూనే కాదనలేకపోయారు.

Published : 17 Apr 2024 02:26 IST

సెయిలింగ్‌లో సత్తా చాటుతోన్న ఛాంపియన్‌ మాన్యారెడ్డి
ప్రపంచ పోటీలకు ఎంపిక.. చదువులోనూ మెరిక

ఈనాడు, హైదరాబాద్‌:  ‘అమ్మా నేను హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ నేర్చుకుంటానని కుమార్తె అడిగినప్పుడు.. తల్లిదండ్రులు తొలుత ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడుతూనే కాదనలేకపోయారు. కానీ తన లక్ష్యం కోసం తల్లిదండ్రులు చెప్పిన మాటను గుర్తుంచుకొని చదువులోనూ, సెయిలింగ్‌లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది నగరానికి చెందిన ‘మాన్యారెడ్డి’. తాజాగా పోర్చుగల్‌లో జరిగే వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 140 మందికి, భారత్‌ నుంచి ఇద్దరికి అవకాశం కల్పించగా నగరానికి చెందిన మాన్యారెడ్డి అందులో చోటు దక్కించుకుంది.

ఆలోచన కలిగిందిలా..

మాన్యారెడ్డి తండ్రి సునీల్‌ ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌, తల్లి డాక్టర్‌ దీప్తిరెడ్డి(ఉమెన్‌ ఫిజియోథెరపిస్ట్‌). మాన్యారెడ్డి ప్రస్తుతం ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి చదువులోనూ, స్విమ్మింగ్‌లోనూ ఛాంపియన్‌. కొవిడ్‌ సమయంలో సికింద్రాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్‌లో ఓ క్యాంప్‌కు హాజరైంది. అప్పటి నుంచే సెయిలింగ్‌ చేయాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. తల్లిదండ్రుల అనుమతితో తర్ఫీదు పొందింది. తొలిసారిగా ‘ఆప్టిమిస్ట్‌’ అనే బోట్‌తో మొదటి రెగట్టాలో పాల్గొని వెండి పతకం సాధించింది. అమెరికా వెళ్లిన సమయంలో సెయిలింగ్‌లో శిక్షణ తీసుకుంది. అనంతరం నగరానికి వచ్చి అనేక పోటీల్లో పాల్గొంది. థాయిలాండ్‌లో జరిగిన ఏషియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌, మలేషియాలో జరిగిన లంకావి ఇంటర్నేషనల్‌ రెగట్టాలో ప్రతిభ కనబరిచింది. ఇటీవల షిల్లాంగ్‌లో జరిగిన నేషనల్‌ రెగట్టాలో కాంస్య పతకం సాధించింది. ప్రస్తుతం ఆమె దేశంలోనే సెయిలింగ్‌లో మూడోస్థానంలో ఉంది. మాన్యారెడ్డి విజయంలో ఆమె తల్లి దీప్తిరెడ్డి పాత్ర ప్రత్యేకం. పోటీలు ఉన్న ప్రతిసారీ  క్లీనిక్‌ను మూసివేసి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. తను ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం ఒలింపిక్‌ క్రీడాకారిణి నేత్రకుమరన్‌ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని