logo

కంటోన్మెంట్ పోరు.. అభ్యర్థులు ఖరారు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి.

Updated : 17 Apr 2024 08:55 IST

ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో ఉప ఎన్నిక
రంగంలోకి దిగిన ప్రధాన పార్టీలు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. దీంతో పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌, భారాసలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. భాజపా మంగళవారం ఖరారు చేసింది. మొత్తం మీద మూడు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా మారింది.

చేరికల జోష్‌లో అధికార పార్టీ..

కాంగ్రెస్‌ పార్టీ ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్‌ కుమార్తె వెన్నెలను నిలపగా.. మూడోస్థానానికి పరిమితమయ్యారు. దీంతో ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచీతూచి వ్యవహరించారు. నియోజకవర్గంపై పట్టున్న నాయకుడిని నిలపాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో భాజపా తరఫున రంగంలోకి దిగి 41 వేల ఓట్లకు పైగా తెచ్చుకున్న శ్రీ గణేష్‌ను పార్టీలో చేర్చుకుని ఆయనకు టిక్కెట్‌ను ప్రకటించారు. ఇతనికి ప్రజలతో మంచి అనుబంధం ఉండటమే కాకుండా అనేక సమస్యల పరిష్కారంలో పాలుపంచుకున్నారు. దీనికితోడు ఇతర పార్టీలకు చెందిన కంటోన్మెంట్‌ బోర్డు మాజీ సభ్యుడు జంపన ప్రసాద్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కె.రాజగోపాలన్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

అభివృద్ధి, సానుభూతి కలిసొచ్చే అవకాశం..

కంటోన్మెంట్‌కు భారాస నేత సాయన్నకు విడదీయరాని బంధం ఉంది. ఆయన ఇక్కడి నుంచి అయిదుసార్లు విజయం సాధించారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన అనారోగ్యంతో చనిపోయారు. నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్యనందిత బరిలో నిలిచి గెలుపొందారు. ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ టిక్కెట్‌ కోసం యువనేతలు చాలామంది అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చినా సాయన్న రెండో కుమార్తె నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో చేసిన అభివృద్ధి, సాయన్న కుటుంబం మీద ఉన్న సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు.

రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి..

కంటోన్మెంట్‌లో బలంగా ఉన్న భాజపా ఈ ఎన్నికల్లో విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీ గణేష్‌తోపాటు మరికొందరు కాంగ్రెస్‌లో చేరారు. ఇదే సమయంలో రాజకీయాలకు కొత్తయిన డాక్టర్‌ తిలక్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. 1960లో జన్మించిన ఈయన ఎంబీబీఎస్‌ చేశారు. ఇతని తండ్రి టీవీ నారాయణ పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన తల్లి సదాలక్ష్మి తొలి డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పని చేశారు. తల్లిదండ్రుల నేపథ్యంతోనే తిలక్‌కు టిక్కెట్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  కొత్త నేతకు  సీనియర్‌ నేతల సహకారం ఇక్కడ కీలకం కానుంది. మొన్నటి ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన భాజపా ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని