logo

బీఎస్పీ అభ్యర్థులుగా మరో ఆరుగురు ఖరారు

బహుజన సమాజ్‌పార్టీ తరఫున మరో ఆరు స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం సోమవారం ఖరారు చేసింది.

Published : 31 Oct 2023 05:38 IST

ఈనాడు, కరీంనగర్‌: బహుజన సమాజ్‌పార్టీ తరఫున మరో ఆరు స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం సోమవారం ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నాలుగు స్థానాల్లో రంగంలో నిలిచే అభ్యర్థులను ఈ నెల 3వ తేదీన ప్రకటించగా.. తాజాగా మరో ఆరుగురి పేర్లను పార్టీ వెల్లడించింది. దీంతో మొత్తంగా 10 మందికి టికెట్లు లభించాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో కోరుట్ల స్థానం నుంచి నిశాంత్‌ కార్తికేయగౌడ్‌, జగిత్యాల నుంచి బల్కం మల్లేశ్‌యాదవ్‌, రామగుండం నుంచి అంబటి నరేశ్‌యాదవ్‌, హుజూరాబాద్‌ నుంచి పల్లె ప్రశాంత్‌గౌడ్‌, సిరిసిల్ల నుంచి పిట్టల భూమేశ్‌ ముదిరాజ్‌, వేములవాడ నుంచి గోలి మోహన్‌లకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ప్రకటించిన బీఎస్పీ పోటీదారుల్లో ఎక్కువగా యువకులు, విద్యావంతులే ఉండటం గమనార్హం. ఇంతకుముందు మొదటి జాబితాలో నిషాని రామచంద్రం (మానకొండూర్‌), నక్క విజయ్‌కుమార్‌ (ధర్మపురి), దాసరి ఉష (పెద్దపల్లి), కొంకటి శేఖర్‌ (చొప్పదండి)పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్‌, మంథని, హుస్నాబాద్‌ అభ్యర్థులు ఇంకా ఎవరనేది తేలాల్సి ఉంది.

  • పేరు
  • నియోజకవర్గం
  • వయసు
  • తల్లిదండ్రులు
  • భార్య
  • పిల్లలు
  • స్వగ్రామం

  • నిశాంత్‌ కార్తికేయగౌడ్‌
  • నియోజకవర్గం: కోరుట్ల
  • 39
  • అరుణ, నరేందర్‌గౌడ్‌
  • సవ్యశ్రీ
  • పార్వతీ
  • మెట్‌పల్లి

కోరుట్ల : రెండున్నరేళ్లుగా రాజకీయాల్లో తిరుగుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో బీసీఏ పూర్తిచేసిన తరువాత సినిమా ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తితో డైరెక్టరుగా మారాలనుకున్నారు. ఎంఏలో సినిమా రంగానికి సంబంధించిన ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేసి డైరెక్టర్‌గా అవకాశాల కోసం కొన్నాళ్లు తిరిగారు. కొందరి వద్ద సహాయకుడిగా పనిచేసి అనుభవం సంపాదించారు. తరువాత తన తల్లి పూదరి అరుణ మెట్‌పల్లి జడ్పీటీసీ సభ్యురాలిగా గతంలో కొనసాగడంతో రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీలో చేరి ప్రస్తుతం టికెట్‌ను పొందారు.


  • పల్లె ప్రశాంత్‌గౌడ్‌
  • హుజూరాబాద్‌
  • 32
  • స్వరూప, శంకరయ్య
  • కన్నూర్‌

హుజూరాబాద్‌ గ్రామీణం: యువ నాయకుడైన పల్లె ప్రశాంత్‌గౌడ్‌ స్వగ్రామం హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌ మండలం కన్నూర్‌ (రాములపల్లి). ఎంఏ ఎల్‌ఎల్‌బీ చదివిన ఈయన కొన్ని నెలలుగా బీఎస్పీ తôఫున నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. న్యాయవాద వృత్తిలో రాణిస్తూనే నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా టికెట్‌ ఇవ్వడంతో హుజూరాబాద్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి టికెట్‌ కోసం పలువురు పోటీ పడినప్పటికీ పార్టీ అధిష్ఠానం మాత్రం ప్రశాంత్‌గౌడ్‌కు ప్రాధాన్యమిచ్చింది.


  • అంబటి నరేశ్‌ యాదవ్‌
  • రామగుండం
  • 36
  • లక్ష్మి, మొండయ్య
  • జ్యోతి
  • నిత్యశ్రీ, నిహర్ష
  • గోదావరిఖని

గోదావరిఖని: పీజీలో రాజనీతిశాస్త్రం చదివిన ఈ యువ నాయకుడు పాల వ్యాపారం చేస్తూ సింగరేణిలో ఉద్యోగాన్ని పొందారు. కొన్నాళ్ల తరువాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి కార్మికుల సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సహా సింగరేణి కార్మికుల పక్షాన పలు ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. నియోజకవర్గంలో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. కొన్ని నెలల కిందట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ పెద్దపల్లికి వచ్చిన సందర్భంలో పార్టీలో చేరారు. తరువాత పార్టీని విస్తరించేందుకు నియోజకవర్గంలో ఇటీవల విస్తృతంగా పర్యటిస్తున్నారు. టికెట్‌ రావడంతో పోటీకి సిద్ధమవుతున్నారు.


  • బల్కం మల్లేశ్‌యాదవ్‌
  • జగిత్యాల
  • 48
  • జమున
  • పవన్‌
  • హిమ్మత్‌రావుపేట

జగిత్యాల : కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేటకు చెందిన మల్లేశ్‌యాదవ్‌ బీఎస్పీలో కొన్నాళ్లుగా నియోజకవర్గ స్థాయి నాయకుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో హిమ్మత్‌రావుపేట ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి మండల పరిషత్తు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో భారాసలో చురుగ్గా పని చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ అధిష్ఠానం ఈయనకు జగిత్యాల నుంచి బరిలో నిలిచే అవకాశాన్ని కల్పించింది.


  • పిట్టల భూమేశ్‌ ముదిరాజ్‌
  • సిరిసిల్ల
  • దేవవ్వ, రాములు
  • జ్యోతి
  • రాహుల్‌, శాంతన్‌
  • తిమ్మాపూర్‌, చందుర్తి మండలం

సిరిసిల్ల గ్రామీణం : న్యాయవాద వృత్తిలో ఉన్న భూమేశ్‌ 2002లో బీఎస్పీలో చేరి వివిధ పార్టీ పదవుల్ని అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. సిరిసిల్ల కోర్టులో న్యాయవాదిగా పని చేస్తూనే రాజకీయాల్లో రాణిస్తున్నారు. తిమ్మాపూర్‌ గ్రామ సర్పంచిగా గతంలో పని చేశారు. ఇదే సమయంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర కమిటీకి సలహాదారుగా వ్యవహరించారు. ఇక్కడి ప్రజల సమస్యలపై పలు పోరాటాలు, ఆందోళనలు చేపట్టారు. పార్టీ అధిష్ఠానం టికెట్‌ను ఇవ్వడంతో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.


  • గోలి మోహన్‌
  • వేములవాడ
  • 46
  • మల్లమ్మ, నారాయణ
  • జ్యోత్స్నరాణి
  • అక్షయ, ఆద్య
  • నూకలమర్రి

వేములవాడ : ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన గోలి మోహన్‌ 2010లో అమెరికా వెళ్లి శాస్త్రవేత్తగా పని చేశారు. 2013లో ఆద్యగోలి ఫౌండేషన్‌ను ప్రారంభించి వేములవాడ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. యువత కోసం ఉపాధి మేళాలను నిర్వహించి కొందరికి ఉద్యోగావకాశాల్ని అందించారు. ఆధునిక విధానాలతోపాటు సేంద్రియ సాగును ప్రోత్సహించే విధంగా రైతులకు నియోజకవర్గవ్యాప్తంగా పలు అవగాహన సదస్సులను నిర్వహించారు. మేలైన పంటల సాగు దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. భారాసలో కొన్నాళ్లు కొనసాగిన ఆయన ఇటీవల బీఎస్పీలో చేరారు. టికెట్‌ను దక్కించుకుని పోటీ అవకాశాన్ని పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని