logo

Congress: కరీంనగర్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్‌ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు.

Updated : 29 Mar 2024 08:47 IST

ఈనాడు, కరీంనగర్‌

రీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్‌ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్ఠానం పలు జాబితాలను వెల్లడించగా.. అందులో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి పేరు లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు పలు కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాత్రం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎలాంటి సన్నాహక సమావేశాలు, ఇతరత్రా పార్టీ కార్యక్రమాల్ని నిర్వహించడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజల్లోకి వెళ్లవచ్చని ఈ ఆలస్యం ఏంటని స్థానిక నాయకుల వద్ద అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలనలో ముగ్గురి పేర్లు..!

కాంగ్రెస్‌ నుంచి ఇటీవలి వరకు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. కొత్తగా తీన్మార్‌ మల్లన్న పేరు తెరమీదకు వచ్చినట్లు తెలిసింది. బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అవడంతో ఆయన పేరుని కూడా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. రెడ్డి, వెలమ, బీసీ సామాజిక వర్గాల వారీగా ముగ్గురు నాయకుల విషయంలో తుది కసరత్తు చేసే పనిలో పార్టీ ముఖ్యులున్నారు. ఈ నెల 31న మరోమారు దిల్లీలో టికెట్ల ఖరారు విషయంలో సమావేశం జరగనుండగా.. ఆ రోజు వెల్లడించే జాబితాలో కరీంనగర్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది తెలిసిపోనున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను గురువారం మధ్యాహ్నం మరోసారి తీసుకున్నట్లు సమాచారం. ఎవరైతే బాగుంటుంది? ఎవరికి క్షేత్రస్థాయిలో పట్టు ఉందని వీరి అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిసింది. వీరితోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థిని ప్రకటించే దిశగా మొగ్గు చూపుతున్నారనే చర్చ జరుగుతోంది. మరో మూడు రోజుల్లో కరీంనగర్‌ స్థానం నుంచి టికెట్‌ పొందేదెవరో తెలియనుంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ తప్పదనే భావనలో పార్టీ కార్యకర్తలున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని