logo

ఏళ్ల కల.. సాకారమైన వేళ

ఒకప్పుడు భద్రాచలం దండకారణ్యం.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. శ్రీరామ నవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు కాలినడకన, ఎడ్లబండ్లపై యాత్రికులు వచ్చేవారు.

Updated : 16 Apr 2024 05:51 IST

ప్రారంభానికి ముందు వంతెన

భద్రాచలం, భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: ఒకప్పుడు భద్రాచలం దండకారణ్యం.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. శ్రీరామ నవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు కాలినడకన, ఎడ్లబండ్లపై యాత్రికులు వచ్చేవారు. సారపాక వైపు గోదావరి అడ్డుగా ఉండటంతో పడవల సాయంతో రేవు దాటి భద్రాచలం చేరుకునేవారు. ఏడు దశాబ్దాల క్రితం రెండు భారీ పడవలు నదిలో ఢీకొనటంతో పెను ప్రమాదం సంభవించింది. వందల సంఖ్యలో జలసమాధి అయ్యారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి 1959లో సుమారు రూ.70లక్షలు వెచ్చించి ఇక్కడ వంతెన నిర్మించటంతో రవాణా సదుపాయాలు మెరుగుపడ్డాయి. భక్తుల తాకిడి అధికమైంది. నదిలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పోయింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. 2022 జులైలో వచ్చిన వరదల తరుణంలో కొద్దిరోజుల పాటు వంతెనపై రాకపోకలు ఆగటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమస్యను ముందే గుర్తించిన ఉన్నతాధికారులు రెండో వంతెన నిర్మాణానికి దశాబ్దం క్రితమే ప్రతిపాదనలు రూపొందించారు.

మంత్రి తుమ్మల చొరవ..

ప్రస్తుతం వన్‌వే విధానంలో రెండో వంతెన అందుబాటులోకి వచ్చింది. భద్రాచలం నుంచి సారపాక వైపు పాత వంతెన మీదుగా వెళ్తుండగా.. సారపాక వైపు నుంచి రెండో వంతెన మీదుగా భద్రాచలం వస్తారు. రూ.98.45 కోట్లతో టెండర్లు పిలవగా రూ.65 కోట్లకు సదరు కంపెనీ హక్కులు దక్కించుకుంది. కొంత పని ప్రారంభమయ్యాక పిల్లర్‌ కూలటంతో తొలగించి మళ్లీ నిర్మించింది. గెడ్డర్‌ విరిగిపోవటంతో కొత్తగా తయారు చేయించింది. ఈ పరిస్థితిలో అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయలేకపోయింది. మంత్రి తుమ్మల నాగేళ్వరరావు గతంలో వంతెనకు శంకుస్థాపన చేయగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ ఆయన మంత్రి పదవి చేపట్టడంతో పనులను నిరంతరం పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో నవమికి రెండో వంతెన అందుబాటులోకి రావటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని