logo

Tadipatri: తాడిపత్రి ముఠా తప్పుడు పనులు

డోన్‌ మండలం కొత్తకోట పరిధిలో ఎన్‌హెచ్‌-44 రహదారికి ఆనుకుని 21 సెంట్లు మిగులు భూమిగా ఉంది. ఇది ఆర్యవైశ్యులకు చెందినది కావడం..

Updated : 10 Oct 2023 08:42 IST

ఎన్‌హెచ్‌-44 వెంట ఖాళీ స్థలాలపై కన్ను
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌
న్యూస్‌టుడే, డోన్‌, ప్యాపిలి

డోన్‌ మండలం కొత్తకోట పరిధిలో ఎన్‌హెచ్‌-44 రహదారికి ఆనుకుని 21 సెంట్లు మిగులు భూమిగా ఉంది. ఇది ఆర్యవైశ్యులకు చెందినది కావడం.. ఈ భూమిని పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉండటంతో నిర్వాహకులు వివిధ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. దీనిపై కన్నేసిన తాడిపత్రికి చెందిన కొందరు ఆ గ్రామ కార్యదర్శి శివారెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగపత్రా(యాజమాన్య)లు సృష్టించారు. దర్జాగా ప్యాపిలి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. రూ.40 లక్షల విలువైన స్థలాన్ని సొంతం చేసుకున్నారు. తన సంతకం ఫోర్జరీ చేశారు.. రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని కోరుతూ కార్యదర్శి రిజిస్ట్రార్‌కు విన్నవించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి ఇరువైపులా ఖాళీ స్థలాలపై అనంతపురం జిల్లా తాడిపత్రి ముఠా కన్నేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి విలువైన భూములను కాజేస్తున్నారు.  


రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని రిజిస్ట్రార్‌కు రాసిన వినతిపత్రం

జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-44 ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు మండలం పంచలింగాలలో ప్రారంభమై ప్యాపిలి మండలం పోదొడ్డిలో ముగుస్తుంది. 80 కి.మీ మేర విస్తరించిన రహదారి కర్నూలు, కల్లూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, డోన్‌, ప్యాపిలి మండలాల మీదుగా వెళ్తోంది. 2009లో నాలుగు వరుసలుగా విస్తరించారు. హైదరాబాద్‌- బెంగళూరు ప్రధాన రహదారి కావడంతో వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అన్ని    కలిపి నిత్యం పదివేల వరకు వాహనాలు వెళ్తున్నాయి. ఇందులో సరకు రవాణా, కార్లు ఎక్కువగా ఉన్నాయి.

అధికారుల సహకారం

జాతీయ రహదారి-44కి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల వివరాలు మీ-భూమి పోర్టల్‌లో చూసి సేకరిస్తున్నారు. తర్వాత రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఆక్రమణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖాళీ స్థలాల యజమానుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. వాటిపై ఆయా గ్రామాల కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఇందుకు ప్యాపిలి రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది సహకరిస్తున్నట్లు సమాచారం. రూ.లక్షల విలువైన భూమిని మొదట తమ పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకొని తర్వాత ఇతరులకు అంటగట్టేస్తున్నారు.

ధరలు పెరగడంతో

వాహనాల సంఖ్య పెరగడంతో ఎన్‌హెచ్‌-44ను ఆరు వరుసల రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల సర్వే చేపట్టారు. దీంతో రహదారికి ఇరువైపులా ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరా రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు సుదూరం కావడంతో వాహనదారులు దారి మధ్య భోజనం, ఇతర అవసరాలకు దాబాలు, హోటళ్లను ఆశ్రయిస్తుంటారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్‌ బంక్‌లు, ఫంచర్‌ దుకాణాలు వెలుస్తున్నాయి. గిరాకీ బాగుండటంతో వీటి ఏర్పాటుకు చాలా మంది ముందుకొస్తున్నారు.  సెంటు కన్నా తక్కువ స్థలం ఉన్నా సరిపోతుంది. ఖాళీ స్థలాలకు డిమాండ్‌ పెరగడంతో తాడిపత్రికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి తప్పుడు పత్రాలు సృష్టించి కాజేస్తున్నారు.


ప్యాపిలి మండలం వెంగళాంపల్లెకు చెందిన బోయపాటి జయశీల, బోయపాటి హేమ లతలకు సర్వే నంబరు-144-1ఏ, 1బి, 144-2ఏ, 2బి, 156, 157-2ఏలలో 13 ఎకరాలు ఉంది. కొంతభాగాన్ని హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు విక్రయించగా, 16 సెంట్లు ఉంచుకున్నారు. ఇక్కడ రస్తా కోసం కొంత భూమిని వదిలారు. రూ.లక్షల విలువైన దీనిపై తాడిపత్రి ముఠా ఓ కన్నేసింది. కార్యదర్శి మంజుల సంతకాన్ని ఫోర్జరీ చేసి 8 సెంట్ల చొప్పున ఓ మహిళ పేరిట ఉన్నట్లు దొంగ పత్రాల్ని తయారు చేయించారు. ఆమె మరో వ్యక్తికి మూడు సెంట్ల చొప్పున అమ్మేసింది. యజమానులకు ఈ విషయం తెలియడంతో కార్యదర్శిని ప్రశ్నించగా, సంతకం ఫోర్జరీ అయినట్లు గుర్తించి ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని