logo

నకిలీల నివారణకు నిరంతర నిఘా

వ్యవసాయ సీజన్‌ ఆరంభం కానుండటంతో కల్తీ ఎరువులు, విత్తనాలు, మందుల విక్రయాలను అరికట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Published : 01 Jun 2023 04:00 IST

ఎరువుల దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

పెద్దకొత్తపల్లిలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు, పోలీసులు

కొల్లాపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : వ్యవసాయ సీజన్‌ ఆరంభం కానుండటంతో కల్తీ ఎరువులు, విత్తనాలు, మందుల విక్రయాలను అరికట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఖరీఫ్‌ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులతో కలిసి జిల్లావ్యాప్తంగా ఎరువులు, మందుల దుకాణాల్లో దాడులు, తనిఖీలు చేపడుతున్నారు. చాలా మండలాల్లో ధరల నియంత్రణ జరగడం లేదని అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. దుకాణాల వద్ద ఎప్పటికప్పుడు ధరల పట్టిక ప్రదర్శించకపోగా, ఈ-పాస్‌ యంత్రాల ద్వారా విక్రయాలు జరగడం లేదన్న ఆరోపణలు ఉంటున్నాయి. పురుగు మందుల విక్రయాల్లో నిబంధనలు పాటించడం లేదని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి నోటీసులు సైతం ఇస్తున్నారు.

ఈసారైనా అమలయ్యేనా..

జిల్లాలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలు విరివిగా వెలిశాయి. మానవ ఆరోగ్యానికి వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఎలాగో అవసరంలేని మందులు, ఎరువుల వాడకాన్ని నియంత్రించి, రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు చీటీ విధానాన్ని ప్రభుత్వం మూడేళ్ల క్రితమే అమలుచేయాలని సూచించింది. అయినప్పటికీ ఎక్కడా ఈ విధానం అమలులోకి నోచుకోలేదు. అధికారులు కూడా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో నకిలీ మందులు, ఎరువుల విక్రయాలు ఏటా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు రైతులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. లైసెన్స్‌డ్‌, పీవోఎస్‌ యంత్రాల లావాదేవీలు నిర్వహించే గుర్తింపుఉన్న దుకాణాలనుంచే నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తేనే ప్రయోజనం నెరవేరనుంది. ఇప్పటి వరకు జిల్లాలో పీవోఎస్‌ యంత్రాలను సంబంధిత డీలర్లకు అందజేసినా సరిగా వినియోగించడం లేదన్న ఆరోపణలు ఉంటున్నాయి. దీంతో నిజమైన రైతుల వివరాలు నమోదు కావడం లేదు.

పెద్ద గ్రామాల దుకాణాల్లోనూ..

మండలాల్లో పురుగు మందులు, ఎరువుల దుకాణాల తనిఖీలకు మండలస్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. వ్యవసాయాధికారి, ఎస్సై, తహసీల్దార్‌లతో కూడిన బృందం దుకాణాలను పరిశీలిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ఏటా విక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయాధికారులు కేవలం మండలకేంద్రాలలోనే తనిఖీలు చేపడుతున్నారని, పెద్ద గ్రామాల్లోనూ వెలిసిన ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో సైతం తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి..

విత్తనాల కొనుగోలులో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేటు విత్తన, పురుగు మందుల సంస్థల ప్రచారాలకు ఆకర్షితులు కాకుండా వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు విధిగా పాటించాలి. సరిగా సీల్‌ చేసి, ధ్రువీకరణ పత్రం ఉన్నబస్తాల్లోని విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. బస్తాపై లాట్‌ నంబరు, విత్తన రకం, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించాలి. ముందస్తుగా విత్తనాలు మొలకెత్తే శాతాన్ని విత్తనప్యాకెట్‌పై చూసుకుని పంటపొలాల్లో విత్తుకోవాలి. విత్తనం వేసిన తర్వాత విత్తన ప్యాకెట్ల ఖాళీ కవర్లు, రసీదులను భద్రపర్చాలి. కొనుగోలు బిల్లుపై నంబర్‌, విత్తన రకం, గడువు తేదీ రాయించుకుని డీలర్‌ సంతకాలు తీసుకోవాలి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాల కొనుగోలు సమయంలో బస్తాపై నీటివర్ణం ట్యాగు పరిశీలించాలి. వ్యవసాయశాఖ అధికారులు  సూచించిన పురుగు మందులను అవసరం మేర మాత్రమే కొనుగోలు చేసి పిచికారీ చేయాలి. లైసెన్సు లేని డీలర్లు పురుగుమందులు విక్రయిస్తుంటే సమీప వ్యవసాయఅధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లాలి.

బృందాలతో.. : ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించాం. ఇలా మండలానికి 5 నుంచి 8 మంది ఏఈవోలు, ఒక ఏవో పనిచేస్తున్నారు. అనుమతిలేని దుకాణాలు, కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయించకుండా నిరంతరం నిఘాతోపాటు తనిఖీలు చేపడుతున్నాం. డీలర్లు పీవోఎస్‌ యంత్రాల ద్వారానే లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.

వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు