logo

కొల్లాపూర్‌ పురపాలిక హస్తగతం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పురపాలిక ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మిపై కాంగ్రెస్‌ మద్దతు కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మంగళవారం పట్టణంలోని కొత్తగ్రంథాలయ భవనంలో ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం సమావేశం నిర్వహించారు.

Published : 17 Apr 2024 05:23 IST

పురఛైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం

సమావేశంలో పురఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం సందర్భంగా చేతులు ఎత్తిన ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ మద్దతు కౌన్సిలర్లు

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పురపాలిక ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మిపై కాంగ్రెస్‌ మద్దతు కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మంగళవారం పట్టణంలోని కొత్తగ్రంథాలయ భవనంలో ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ మద్దతు కౌన్సిలర్లు 15 మంది హాజరవగా మంగళవారం కల్వకుర్తి ఆర్డీవో, ప్రిసైడింగ్‌ అధికారి శ్రీను ఓటింగ్‌ చేపట్టారు. 2/3 మెజార్టీ ప్రకారం సరిపోను కోరం ఉండడంతో ఛైర్‌పర్సన్‌పైఅవిశ్వాసానికి  ప్రిసైడింగ్‌ అధికారి అనుమతించారు. ఎమ్మెల్సీతో పాటు కాంగ్రెస్‌ మద్దతు కౌన్సిలర్లు 15 మంది అవిశ్వాసం తీర్మానంపై సమ్మతి తెలుపుతూ చేతులు ఎత్తారు. మొత్తం 16 మంది సభ్యుల ఓటింగ్‌తో భారాసకు చెందిన ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని అధికారులు ప్రకటించారు. మొత్తం 20 మందికి గాను 15 మంది కూడా మంత్రి జూపల్లి వర్గానికి చెందిన వారు కావడం, వారంతా ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌, భారాసకు చెందిన కౌన్సిలర్లు ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తదుపరి తేదీ వచ్చిన తర్వాత పురపాలికకు కొత్త ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ పేర్కొన్నారు.

భారాస కౌన్సిలర్ల గైర్హాజరు.. : కొల్లాపూర్‌ పురపాలికలో ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మిపై అవిశ్వాసానికి భారాస కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్‌ మద్దతు కౌన్సిలర్లు 15 మంది పాల్గొన్నారు. భారాసకు చెందిన ఛైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు పసుపులకృష్ణ, కృష్ణమూర్తి, సత్యంయాదవ్‌, అనిత సమావేశానికి హాజరు కాలేదని పురపాలిక కమిషనర్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. అవిశ్వాస సమావేశం జరిగే కొత్తగ్రంథాలయ భవన ప్రాంతంలో డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌, సీఐ మహేష్‌, వివిధ మండలాల ఎస్సైలు, భారీగా పోలీసులు మోహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని