logo

రామతత్వం నాయకత్వం

పాలన గురించి ప్రస్తావించినప్పుడు రామరాజ్యం పేరు రాకమానదు. ఎందుకంటే ఎన్ని కోణాల్లో చూసినా శ్రీరాముడు మంచి నాయకుడు.

Updated : 17 Apr 2024 05:57 IST

కోస్గి, షాద్‌నగర్‌-న్యూస్‌టుడే: పాలన గురించి ప్రస్తావించినప్పుడు రామరాజ్యం పేరు రాకమానదు. ఎందుకంటే ఎన్ని కోణాల్లో చూసినా శ్రీరాముడు మంచి నాయకుడు. నవమి రోజున ఆ పాలకుడిలోని లక్షణాలు ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేస్తున్న నాయకులు కొంతైనా పుణికిపుచ్చుకోవాలి. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొందరు నాయకులు ప్రజలకు మంచి చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  అలాగే నేటి నాయకులూ రామచంద్ర ప్రభువు నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం.

ధర్మం, వినయం: శ్రీరాముడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. వినయం ఆయన విజయంలో కీలకపాత్ర వహించింది. పెద్ద రాజ్యానికి రాజైనా ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయేవారు. అహం అన్నది లేకుండా ఉండేవారు. వాలి బలవంతుడైనా సుగ్రీవునిని చేరదీశాడు. న్యాయం, ధర్మం ఉన్నవారికే మద్దతు అని చాటి చెప్పారు. ఉమ్మడి జిల్లాలో కొందరు నాయకులు పదవి ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించి ఓటమి చెందడం మనం చూశాం.

నైపుణ్యాల వినియోగం: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. దాన్ని చక్కగా వినియోగించుకుంటేనే నాయకుడు విజయపథంలో పయనిస్తాడు. రామచంద్రుడు అలా పనులను విభజించబట్టే ఫలితం సాధించాడు. కొడుకు, సోదరుడు, భర్త, స్నేహితుడు, రాజు... ఇలా అన్ని పాత్రలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. శత్రువైన రావణుడు సోదరుడు విభీషణుడు రాముని మంచితనానికి దాసోహమయ్యాడు. అందరినీ కలుపుకుని పోయినప్పుడు నాయకులు రాణిస్తారనేది గుర్తించాలి.  

భావవ్యక్తీకరణ: ఎలాంటి ప్రచార సాధనాలు లేని సమయంలో తన వారిని సమన్వయం చేసుకుంటూ సీతను వెతకడం, సుగ్రీవునితో స్నేహం, లంకకు చేరుకోవడం, పరిమిత వానర సైన్యంతో రావణయుద్ధం చేసి విజయం సాధించడం గొప్ప విషయం.  మానవవనరుల సమర్థ వినియోగం, కిందవారిని నాయకులుగా తయారు చేయడంలో నాయకుడి విజయం ఆధారపడి ఉంటుందన్నది ఈ విషయం తెలియజేస్తుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాలు విస్తృతమైనందున ప్రజలను చక్కగా ఆకట్టుకోవచ్చు.

ఆదర్శం: ఆడే మాటపై ఎరుక, పలికే పదం సత్యం, వ్యవహారంలో ఆదర్శం రాముడి లక్షణాలు. ప్రజాప్రతినిధి ఆదర్శప్రాయుడై ఉండాలి. ఆయన చర్యలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఉమ్మడి జిల్లాలో కొందరు నాయకులు దశాబ్దాలు గడిచినా ప్రజల నోళ్లలో నానుతున్నారు. కొన్ని అభివృద్ధి పనుల పేరుచెబితే వారే గుర్తొచ్చేలా పాటుపడ్డారు. నాయకులు తమ హయాంలో ప్రజలపై బలమైన ముద్ర వేయాల్సి ఉంది.


వ్యూహం: రావణుడితో సాగిన హోరాహోరీ పోరులో ప్రశాంతంగా తన వ్యూహాలకు ప్రభువు పదునుపెట్టారు.  ఎన్నికల సంగ్రామంలోనైనా, పనులను సాధించడంలోనైనా నాయకులకు కావలసినది చక్కని వ్యూహం. సమయానికి తగిన యుక్తి. ఆవేశ,కావేషాలకు గురైతే అసలుకే మోసం వస్తుంది.


నీతి, నిజాయతీ, క్రమశిక్షణ: ప్రతి పని నీతి, నిజాయతీ, క్రమశిక్షణతో పూర్తి చేశారు. పెద్దలను గౌరవిస్తూ, తల్లిదండ్రులతో పాటు ప్రజల మాటలకు  ఎంతో విలువనిచ్చారు. నాయకులు ఆ విధంగా నిస్వార్థంతో వ్యవహరిస్తే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజా మన్నన  పొందుతారు.


సహనమే ప్రగతి: అందివచ్చిన రాజపదవి చేజారినా రాముడు ఎక్కడా కుంగిపోలేదు. కుటుంబ సమేతంగా 14 సంవత్సరాల అరణ్యవాసం చేశాడు. కష్టాలు అధిగమించి మళ్లీ రాజై మన్నన పొందారు. ప్రస్తుత నాయకులు అపజయం ఎదురైనా జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ ప్రజామన్నన పొందేవరకు వేచిచూసే సహనం కొరవడుతోంది.


నిబద్దత: నాయకుడిగా ఎదగాలనుకునేవారు నిబద్ధతతో సేవచేయాలి. ప్రజాహితమే లక్ష్యంగా పనిచేయాలి తప్ప, రాగద్వేషాలకు తావివ్వకూడదు. ఓట్లేయలేదని కొన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యాలు అందించకపోవడం వంటి దుర్గుణాలు ఉండకూడదు. ప్రత్యర్థిపై ద్వేషంతో అభివృద్ధిని అడ్డుకోవడం అన్యాయం. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు తీసుకుంటూ పనుల్లో జాప్యం, నాణ్యత లోపంతో చేపట్టి ప్రజల ఉసురును పోసుకోకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని