logo

తనువు చాలించిన గర్భిణి

ప్రసవానికి వచ్చిన ఓ నిండు గర్భిణి పరిస్థితి విషమించి జిల్లా ఆస్పత్రిలో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది.

Published : 18 Apr 2024 04:00 IST

జిల్లా ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

పేట : ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పేట జిల్లా ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు

నారాయణపేట, న్యూస్‌టుడే : ప్రసవానికి వచ్చిన ఓ నిండు గర్భిణి పరిస్థితి విషమించి జిల్లా ఆస్పత్రిలో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యసిబ్బంది కథనం మేరకు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్‌కు చెందిన గోవిందమ్మ(38)కి ఎనమిదేళ్ల క్రితం కుమారుడు జన్మించగా, నాలుగేళ్ల కిందట రెండో కొడుకు పుట్టాడు. మూడోసారి గర్భం దాల్చిన గోవిందమ్మకు ఈనెల 16న ప్రసవానికి రావాలని మద్దూరు ఆస్పత్రి వైద్యులు సూచించారు. పురిటినొప్పులతో బాధపడుతూ ఆమె బుధవారం ఉదయం మద్దూరు ఆస్పత్రికి వెళ్లారు. గర్భిణీని పరీక్షించిన వైద్యులు పేటలోని జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. పేట ఆస్పత్రి వైద్యులు పరిశీలించి కడుపులోని బిడ్డ పరిస్థితి బాగాలేదని సూచించారు. ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆకస్మికంగా గుండెపోటు వచ్చి మృతిచెందింది.

ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు: ఆస్పత్రిలో గర్భిణికి ప్రసవం చేయడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే కారణమని  కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. గ్రామస్థులతో కలిసి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. సాధారణ ప్రసవం జరుగుతుందని చెప్పిన వైద్యులు, సకాలంలో వైద్యం చేయకపోవడంతో రక్తస్రావం అధికమై కడుపులోనే బిడ్డతోపాటు గర్భిణి మృతిచెందినట్లు కుటుంబికులు ఆరోపించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించామని, ప్రసవం చేసేందుకు తమ వంతుగా కృషిచేశామని, గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రంజిత్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని