logo

స్థిరాస్తి వెంచర్‌లో పేలుడు పదార్థాల పట్టివేత

ఆలేరు జాతీయ రహదారి పక్కన ఉన్న జేఎస్‌ఆర్‌ సన్‌సిటీ స్థిరాస్తి వెంచర్‌లో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ రాజేష్‌చంద్ర తెలిపారు.

Published : 04 Feb 2023 04:56 IST

57 జిలిటెన్‌ స్టిక్స్‌, 51 డిటోనేటర్లు స్వాధీనం 

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆలేరు జాతీయ రహదారి పక్కన ఉన్న జేఎస్‌ఆర్‌ సన్‌సిటీ స్థిరాస్తి వెంచర్‌లో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ రాజేష్‌చంద్ర తెలిపారు. నిందితుల నుంచి 57 జిలిటెన్‌ స్టిక్స్‌, 51 డిటోనేటర్లు, వైర్ల బండిళ్లు మూడు, ఒక కంప్రెషర్‌ ట్రాక్టర్‌, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.  క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెలిపారు.  తాడేపల్లి నారాయణ భూములను చదును చేసే పనులు చేస్తుంటాడు. వెంచర్‌ యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నారాయణ దగ్గర యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన ఎన్నా మల్లారెడ్డి, జనగాం జిల్లా పెంబర్తికి చెందిన సల్లగురుగుల శ్రీనివాస్‌ అలియాస్‌ రాజు ఆరు నెలల నుంచి పనిచేస్తున్నారు. నారాయణ  ఒప్పుకున్న పనులు వీరికి అప్పగించాడు. తొందరగా పని అయ్యేలా పేలుడు పదార్థాలు వినియోగిస్తామని ఒప్పించారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన కంప్రెషర్‌ ట్రాక్టర్‌ నడుపుతున్న అన్నదమ్ములు అలకుంట్ల కమాలాకర్‌, సుమాలాకర్‌తో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. ఎస్వోటీ, ఆలేరు పోలీసులు సంయుక్తంగా గురువారం రాత్రి దాడులు జరిపి మల్లారెడ్డి, శ్రీనివాస్‌, కమలాకర్‌, సుమాలాకర్‌ను అదుపులోకి తీసుకుని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. పేలుడు పదార్థాలు మహేందర్‌ అనే వ్యక్తి సరఫరా చేసినట్లు విచారణలో తేలిందని ప్రస్తుతం ఆ వ్యక్తితోపాటు నారాయణ పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు. సమావేశంలో యాదగిరిగుట్ట ఏసీపీ నర్సింహ్మరెడ్డి, సీఐ నవీన్‌రెడ్డి, ఎస్సైలు ఇద్రీస్‌అలీ, వెంకట శ్రీను పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని