logo

సోదరుడి వరుస వ్యక్తితో కలిసి వివాహిత ఆత్మహత్య

వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళ ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డారు.

Updated : 24 Jan 2024 07:02 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళ ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని హైదర్‌గూడ గుమ్మకొండకాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు, బాధిత కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కాసరాబాదుకు చెందిన చామంతి(28)కి యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన సోమేష్‌తో 2010లో వివాహం జరిగింది. పదేళ్ల క్రితమే వారు రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని అత్తాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఐదేళ్ల క్రితం హైదర్‌గూడ గుమ్మకొండకాలనీలో సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్‌ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. మొదటి అంతస్తులో భార్యాపిల్లలతో కలిసి నర్సింహులు ఉంటుండగా.. కింది అంతస్తులో సోమేష్‌ కుటుంబం నివసి స్తోంది. సోమేష్‌ పలు కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తుండగా ఆయన భార్య చామంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నర్సింహులు బావమరిది అయిన యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన శేఖర్‌(25) ఆర్నెల్ల క్రితం బావ వద్దకే వచ్చి నివసిస్తుండడంతో రెండు కుటుంబాలతో సఖ్యతతో మెలుగుతున్నాడు. మంగళవారం ఉదయం సోమేష్‌, నర్సింహులు, ఆయన భార్య ముగ్గురూ సూర్యాపేటలో ఓ దశదినకర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు పిల్లలను పాఠశాలకు పంపించిన చామంతి 10.30కు తల్లికి ఫోన్‌చేసి మాట్లాడింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చిన పిల్లలు తలుపు తట్టగా తల్లి తీయలేదు. కిటికీ నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. హాల్లో చామంతి, పడకగదిలో శేఖర్‌ ఉరేసుకుని కనిపించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ధ్రువీకరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని