logo

ఆ రోజులే వేరు..!

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూరు మా స్వగ్రామం. చిన్నతనంలో వేసవి సెలవులను బాగా ఆస్వాదించేవాళ్లం.

Updated : 30 Mar 2024 06:33 IST

యాట సత్యనారాయణ, ‘రజాకార్‌’ చిత్ర దర్శకుడు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూరు మా స్వగ్రామం. చిన్నతనంలో వేసవి సెలవులను బాగా ఆస్వాదించేవాళ్లం. వార్షిక పరీక్షలు ముగియడంతో అప్పటి వరకు మాపై ఉన్న ఒత్తిడి తొలగిపోయేది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న రెండు వ్యవసాయ బావులు ఉండేవి. తెల్లవారింది మొదలు పిల్లలం అంతా కలిసి బావుల వద్దకు వెళ్లి ఈత కొట్టేవాళ్లం. అదొక్కటే మాకు ఆనందంగా గడిపే వ్యాపకంగా ఉండేది. ఆకలిని కూడా మరిచి ఈతలో మునిగిపోయేవాళ్లం.

  • ప్రాథమిక పాఠశాలలో చదువుకునే సమయంలో వేసవి సెలవులకు సంబంధించి నా జీవితంలో బాగా గుర్తుండి పోయే ఘటన ఒకటి జరిగింది. గ్రామశివారులో ఎర్రకుంట ఉండేది. సెలవులు వస్తే కొంతమంది పిల్లలు అందులో ఈతకొట్టేవాళ్లు. నేను ఒక పనిపై అటుగా వెళ్తుంటే ఎర్రకుంటలో ఈత కొడుతున్న నా స్నేహితులు ఒకరిద్దరు నన్నుకూడా కుంటలోకి రమ్మని పిలిచారు. ఈత గురించి కూడా తెలియని నేను ఒడ్డువెంట నీటిలో నడుచుకుంటూ వారి వద్దకు చేరాను. తిరిగి వారు నన్ను ఒడ్డుకు తీసుకొచ్చారు. వారు వెళ్లిపోతున్న సమయంలో ఈత అంటే భళే తమాషాగా ఉందని మరోసారి కుంటనీటిలోకి ఒంటరిగా వెళ్లాను. నీటిలో నడవడానికి కిందపట్టులేక క్రమంగా మునిగిపోవడం ప్రారంభమైంది. నా అరచేతులు మాత్రమే నీటిపైన కనిపిస్తున్నాయి. అప్పటికే కుంటగట్టుదాటుతున్న శ్రీశైలం అనే అబ్బాయి ఇది గమనించి నన్ను లాగే ప్రయత్నం చేశాడు. అతన్ని గట్టిగా పట్టుకుని నీటిపైకి తేలి నేను అరవడంతో శ్రీశైలం సోదరుడు గోపాల్‌ వచ్చి ఇద్దరినీ బయటకు లాక్కొచ్చాడు.నన్ను నీటి గండం నుంచి బయటపడేయడానికి ప్రయత్నించిన శ్రీశైలం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం నన్ను కలిచివేసింది.
  • రాత్రివేళల్లో యక్షగానాలు, ఇతర వీధి నాటకాలు ఆసక్తిగాచూసే వాళ్లం. కొందరు కళాకారులకు అప్పట్లో కూడా బాగా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉండేది. అప్పుడు చూసిన వీధినాటకాలు, యక్షగానాలు నాలో నింపిన స్ఫూర్తితోనే నేను సినీరంగంలోకి రావడానికి ప్రేరణగా నిలిచాయి. తాటి వనాల్లోకి వెళ్లి ముంజలు తినడం కూడా వేసవిసెలవుల్లో మరిచిపోలేని అనుభూతి.

న్యూస్‌టుడే, చిట్యాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని