logo

రోగి తత్వం.. హోమియో వైద్యం

రోగి తత్వాన్ని పూర్తిగా పరీక్షించి.. దాని ఆధారంగా ఒక్కో రోగికి ఒక్కోలా మందులు ఇచ్చే వైద్యమే హోమియోపతి. ఈ వైద్యంపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ.. మన దేశంలో రెండు వందల ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్నది.

Published : 10 Apr 2024 02:37 IST

మిర్యాలగూడ పట్టణం, మేళ్లచెరువు, న్యూస్‌టుడే:  రోగి తత్వాన్ని పూర్తిగా పరీక్షించి.. దాని ఆధారంగా ఒక్కో రోగికి ఒక్కోలా మందులు ఇచ్చే వైద్యమే హోమియోపతి. ఈ వైద్యంపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ.. మన దేశంలో రెండు వందల ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్నది. ఆంగ్ల వైద్యంలో నయం కాని అనేక వ్యాధులను హోమియోపతి వైద్యంలో నయం చేసి చూపించారు వైద్యులు. హోమియోపతి వైద్యానికి పితామహుడిగా చెప్పుకునే జర్మనీకి చెందిన డాక్టర్‌ సామ్యేల్‌ హానిమాన్‌ జయంతి సందర్భంగా ఏటా ఏప్రిల్‌ 10న ‘ప్రపంచ హోమియోపతి’ దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.

దీర్ఘకాలిక రోగాలకు..

ఒకప్పుడు దేశంలో అనేక మందిని బలిగొన్న మెదడు వాపు వ్యాధిని హోమియో మందుల ద్వారానే తరిమి కొట్టామంటున్నారు వైద్యులు. ఇటీవల కాలంలో అనేక మంది పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి బాధపడుతున్నారు. వాటిలో అనేక వ్యాధులకు అల్లోపతిలో తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ హోమియోపతిలో కేవలం మందుల ద్వారానే నయం చేసి చూపిస్తున్నారు వైద్యులు. నొప్పుల కోసం ఆంగ్ల మందులు వాడడంతో ఇతర అవయవాలపై ప్రభావం పడుతుందని.. కానీ ఇతర అవయవానికి ఎటువంటి ఆపద కలుగకుండా వ్యాధిని నయం చేయడమే హోమియోపతి ప్రత్యేకత అంటున్నారు నిపుణులు. కీళ్ల నొప్పులు, గొంతులో గడ్డలు, స్వైన్‌ఫ్లూ, కొవిడ్‌ వంటి వ్యాధులను హోమియో మందులతో నయం చేయవచ్చంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో మందుల వాడకం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో హోమియో మందులు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి వంటి ప్రాంతాల్లో ప్రైవేట్‌ హోమియో వైద్యశాలలు, మందుల దుకాణాలు సైతం నిర్వహిస్తున్నారు. అనేక మంది రోగులు వివిధ రోగాలను నయం చేసుకునేందుకు హోమియోనే ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఉండడంతో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హోమియో వైద్యానికి తగిన ప్రచారం కల్పించడంతో పాటు తగిన నిధులు కేటాయించి.. హోమియో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.


ఇతర సమస్య రాకుండా వైద్యం..

 డాక్టర్‌ నితిన్‌ ప్రసాద్‌ రాయ్‌,   ఆర్బీఎస్కే వైద్యాధికారి, మిర్యాలగూడ

ఆంగ్ల మందులు వాడకం వల్ల తక్షణమే వ్యాధి నయమవుతుంది కానీ.. ఇతర అవయవాలపై దుష్ప్రభావాలు కలిగిస్తాయి. హోమియో వైద్యంలో ఇతర అవయవాలకు ఎలాంటి హాని జరగకుండా మందులు వాడుతారు. హోమియో వైద్యంలో ఒక్కో రోగిని పూర్తిగా పరిశీలించి.. వారి తత్వాన్ని బట్టి మందులు సిఫారసు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని