logo

దేవుడి సొమ్ము కైంకర్యం..

దేవాలయాల్లో కొందరు కార్యనిర్వాహణాధికారులు(ఈవోలు) ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. హనుమకొండ ప్రాంతంలోని ఒక ఆలయంపై వచ్చిన ఫిర్యాదుతో దేవాదాయ శాఖ వరంగల్‌

Published : 29 Sep 2022 02:03 IST

దేవాలయాల్లో ఈవోల ఇష్టారాజ్యం!
న్యూస్‌టుడే, రామన్నపేట

దేవాలయాల్లో కొందరు కార్యనిర్వాహణాధికారులు(ఈవోలు) ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. హనుమకొండ ప్రాంతంలోని ఒక ఆలయంపై వచ్చిన ఫిర్యాదుతో దేవాదాయ శాఖ వరంగల్‌ ప్రాంతీయ ఉపకమిషనర్‌ శ్రీకాంత్‌రావు, జిల్లా అధికారులు విచారణ చేసినట్లు తెలిసింది.  ఉమ్మడి జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో ఉత్సవాలు, పండగలు, అభివృద్ధి పనుల పేరుతో దాతల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పతున్నారని గుర్తించారు. వసూలు చేసిన డబ్బులు, వస్తువులకు లెక్క పత్రాలుండటం లేదు. పేరు దాతలదైనా, ఖర్చులు మాత్రం దేవాలయ ఖాతాల్లో రాస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కొందరు ఈవోలు క్యాష్‌ బుక్కులో ఖర్చుల వివరాలు ఇష్టానుసారంగా రాస్తున్నారు. మమ్మల్ని ఎవరడుగుతారులే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలోని ఆలయాలు, ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద జాతరగా పేరొందిన దేవస్థానంలో నిర్వహణ, ఉత్సవాల ఖర్చులు ఎక్కువయ్యాయని తెలిసింది. గతంలో హుండీలో భక్తులు వేసే కానుకలు, అర్జీత సేవా టికెట్లు తదితరాల ద్వారా వచ్చే ఆదాయంతోనే అర్చక, ఉద్యోగులకు జీతాలు చెల్లించే వారు. కొన్ని ఆలయాల్లో హుండీలు తెరిస్తేనే జీతాలు వచ్చేవి. 2018 ఆగస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా అర్చక, ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంది. దీనివల్ల ప్రధాన దేవాలయాల్లో ఆదాయం మిగులుతోంది. డబ్బులున్నాయని కొందరు ఈవోలు ఖర్చులు పెంచేశారని తెలిసింది. దుబారాలు అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవిగో కొన్ని సాక్ష్యాలు

హనుమకొండ జిల్లా కాజీపేట శివారులోని ఆలయంలో జరిగే ఉత్సవాలకు గ్రేటర్‌ వరంగల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసింది. ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌తో లైటింగ్‌ వేయించినట్లు బిల్లు డ్రా చేశారని ఫిర్యాదు వెళ్లింది.

హనుమకొండ నగర నడిబొడ్డున చారిత్రక దేవాలయంలో ఏటా నాలుగైదు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. గ్రేటర్‌ వరంగల్‌ లైటింగ్‌, పారిశుద్ధ్యం ఇతర ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖాధికారులు ఖర్చు ఆలయం నుంచి చేసినట్లు బిల్లు డ్రా చేశారు. దీనిపై హిందూ ధార్మిక సంఘం వారు ఫిర్యాదు కూడా చేశారు.

హనుమకొండలోని మరో దేవాలయంలో ప్రైవేటు పెత్తనం ఎక్కువైంది. పేరుకు మాత్రం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నట్లు చెబుతారు. పెత్తనమంతా ప్రైవేటు వ్యక్తులదే. ఈవో ఉన్నా లేనట్లే. అభివృద్ధి పనులు, ఇతరాల పేరుతో దాతల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి.

వరంగల్‌ ప్రాంతంలోని మరో దేవాలయంలో గుట్టుచప్పుడు కాకుండా దేవాలయ నిర్వహణ ఖర్చులు రాస్తున్నట్లుగా తెలిసింది. అధికారి నుంచి ఉద్యోగి వరకు అందరూ భాగస్వాములనే విమర్శలున్నాయి.

వరంగల్‌ తూర్పులోని మరో రెండు దేవాలయాల్లో ఉత్సవాలు, ప్రతిష్ఠాపనల పేరుతో దాతల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఖర్చులు మాత్రం ఆలయం ఖాతాలో రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని