logo

మిరప కాయలు ఏరేందుకు వెళ్తూ...

ఉదయం పూట వ్యవసాయ కూలీ పనులకు ఆటోలో వెళ్తున్న వారిని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. ఎదురెదురుగా ఆ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.

Published : 30 Mar 2023 04:39 IST

ఆటోను ఢీకొన్న కారు, ఇద్దరి మృతి

కోమల(పాత చిత్రం), పరకాల శివారులో చలివాగు వంతెన సమీపంలో క్షతగాత్రులు

పరకాల, న్యూస్‌టుడే: ఉదయం పూట వ్యవసాయ కూలీ పనులకు ఆటోలో వెళ్తున్న వారిని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. ఎదురెదురుగా ఆ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం హనుమకొండ జిల్లా పరకాల శివారులో చోటు చేసుకుంది. శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు మిరప కాయలు ఏరడానికి ఆటోలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లికి బయల్దేరారు. పరకాల శివారు చలివాగు వంతెన సమీపంలో మహారాష్ట్రలోని అసరెల్లి నుంచి వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వెళ్తున్న కారు ఎదురుగా వస్తూ ఢీ† కొట్టింది. అతి వేగంగా ఢీకొట్టడంతో ఆటోలోని కూలీలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. కారు అదుపుతప్పి రోడ్డు దిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దుబాసి కోమల(56), కొంగరి చేరాలు(57), సిలువేరు కొంరమ్మను 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని పోలీసు, ఇతర వాహనాల్లో పరకాల ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రికి చేర్చారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమల, చేరాలు మృతి చెందారు. గాయపడ్డ వారిలో పత్తిపాకకు చెందిన దుబాసి సూరమ్మ, దుబాసి కొంరమ్మ, పసుల భిక్షపతి, కొంగర్ల లక్ష్మి, నక్క ఐలమ్మ, బోగం సమ్మక్క, సాదు సుమలత, కొంగరి సుగుణ, మద్దెబోయిన సందీప్‌, నాలికె స్వరూప, మషుపాక సరోజనతో పాటు కారు డ్రైవర్‌ గండు తేజ(అసరెల్లి) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మూడేళ్ల నుంచి ప్రమాదాలు...

వరసగా మూడేళ్ల నుంచి వ్యవసాయ కూలీలకు వెళ్తున్న వాహనాలే ప్రమాదాల బారినపడ్డాయి. 2021 మార్చిలో ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు. శాయంపేట మండలం మాందారిపేట గుట్టల వద్ద  గత ఏడాది ఏప్రిల్‌ 8న అదే మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కూలీలు ట్రాలీ ఆటోలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరమెట్లకు మిర్చి పంట కోతకు వెళ్తూ ప్రమాదం బారినపడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా శాయంపేట మండలం పత్తిపాక కూలీలు మిరప కాయలను ఏరడానికి రేగొండ మండలం పోచంపల్లికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని