logo

బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో మొక్కల నరికివేత

కొత్తగూడ మండలం వేలుబెల్లిలోని బృహత్‌ పల్లెపకృతి వనంలోని సుమారు 25వేల మొక్కలు నరికివేతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 18 Apr 2024 05:52 IST

వేలుబెల్లిలోని బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో..

కొత్తగూడ, న్యూస్‌టుడే: కొత్తగూడ మండలం వేలుబెల్లిలోని బృహత్‌ పల్లెపకృతి వనంలోని సుమారు 25వేల మొక్కలు నరికివేతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. వేలుబెల్లి గ్రామానికి 2022లో బృహత్‌ పల్లెపకృతి వనం మంజూరైంది. పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ శివారులోని సుమారు ఐదెకరాల భూమిని కేటాయించారు. ఇందులో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఆధ్వర్యంలో సుమారు 30వేలకు పైగా మొక్కలు నాటారు. ఇందుకు ప్రభుత్వం రూ.30లక్షలకు పైగా నిధులు కేటాయించింది. మొక్కల సంరక్షణ పనులను కూలీలతో చేయించారు. పెంపకానికి ఖర్చులను కూడా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి నిధులు ఏటా విడుదల చేశారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటి వాటిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. జనవరి వరకు కూడా వీటి రక్షణ నిమిత్తం, పిచ్చిమొక్కల తొలగింపు కోసం కూలీలచే పనులు జరిపించినట్లు రికార్డులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు బృహత్‌ పల్లెప్రకృతి వనంలోని సుమారు 25వేలకు పైగా మొక్కలన్నింటిని నరికివేశారు. కొన్ని చోట్ల చిన్నచిన్నమొక్కలు మినహా ఏపుగా పెరిగిన ప్రతీ చెట్టు నరికివేతకు గురైంది. ఈ భూమిని వ్యవసాయం కోసం స్వాధీనం చేసుకునేందుకు మొక్కలు నరికివేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పల్లెప్రకృతి వనాలు, బృహాత్‌ పల్లె ప్రకృతి వనాల రక్షణ కోసం వేసవిలో అధికారులు సందర్శించి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బృహత్‌ పల్లె పల్లెప్రకృతి వనంలోని మొక్కలు నరికివేతకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఐదెకరాల భూమిలోని సుమారు 25వేల మొక్కలు ఒక్క రోజులోనే నరికివేతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ భూమి గతంలో రైతుల సాగుభూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని బృహత్‌ పల్లె ప్రకృతి వనానికి కేటాయించినట్లు తెలిసింది. ఎంపీడీవో రవీంద్రపసాద్‌ మాట్లాడుతూ ఈ సంఘటన తన దృష్టికి ఈ రోజునే వచ్చిందన్నారు. స్థలాన్ని సందర్శించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని