logo

పేలుడు పదార్థాల రవాణాపై నియంత్రణ ఏది?

గత నెల 27న మరిపెడ ఠాణా పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీరారం క్రాస్‌ రోడ్డు సమీపంలో తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 50 ఎలక్ట్రానిక్‌ డిటోనెటర్లు, 32 జిలిటెన్‌ స్టిక్స్‌, 20 బాక్సుల్లో జిలిటెన్‌ స్టిక్స్‌ బూస్టర్‌ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Published : 18 Apr 2024 06:00 IST

గత నెల 27న మరిపెడ ఠాణా పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీరారం క్రాస్‌ రోడ్డు సమీపంలో తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 50 ఎలక్ట్రానిక్‌ డిటోనెటర్లు, 32 జిలిటెన్‌ స్టిక్స్‌, 20 బాక్సుల్లో జిలిటెన్‌ స్టిక్స్‌ బూస్టర్‌ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో లైసెన్స్‌ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అనుమతులు లేని వారికి విక్రయిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు.

ఈనాడు, మహబూబాబాద్‌, నెహ్రూసెంటర్‌: జిల్లాకు అనుమతులు లేకుండా అడ్డదారిలో పేలుడు పదార్థాలు వస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారం జోరందుకోవడంతో గుట్టలన్న ప్రాంతాల్లో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో గుట్టలను తొలగించేందుకు జిలెటిన్‌ స్టిక్స్‌ లాంటి పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు.  చాలా వరకు అక్రమంగా తెచ్చి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా లేకపోవడంతో వాటి వినియోగం వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయి. గతంలో నెల్లికుదురు మండలంలోని ఓ క్వారీలో రాళ్లను పగలగొట్టడానికి వినియోగించిన జిలెటిన్‌ స్టిక్స్‌ చెందిన పూస పేలి ఒక మహిళ మృతి చెందారు. గూడూరులోని ఓ క్వారీలోనూ ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో ఒకరు మృతి చెందారు.

ఫిర్యాదులొస్తేనే

స్థిరాస్తి వెంచర్ల ఏర్పాటులో భాగంగా అక్కడక్కడ అడ్డొచ్చిన రాళ్లను పగలగొట్టేందుకు కంప్రెషర్‌లతో వాటికి రంధ్రాలు చేసి అందులో జిలెటిన్‌ స్టిక్స్‌ పూసలను పెట్టి పేలుస్తున్నారు. కంప్రెషర్‌ నిర్వాహకులు చాలా వరకు అనుమతులు లేకుండానే వినియోగిస్తున్నట్లు తెలిసింది. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన సంబంధిత అధికారులు ఫిర్యాదులొస్తేనే పట్టుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గత ఏడాది నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం శివారులో, పెద్దనాగారం స్టేజీ వద్ద, కౌసల్యదేవిపల్లిలో అనుమతుల లేకుండా జిలెటెన్‌ స్టిక్స్‌ ఉపయోగించి పేలుళ్లు నిర్వహిస్తుండగా సమీపంలోని వారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వాటిని పట్టుకుని బాధ్యులపై కేసులు నమోదు చేశారు. మూడు చోట్ల 30 జిలెటిన్‌ స్టిక్స్‌ను పట్టుకున్నట్లు సమాచారం.  క్వారీల్లో వినియోగిస్తున్న భారీ పేలుడు పదార్థాలతో ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయంటూ నెల్లికుదురు మండలంలోని తండావాసులు ఆందోళన చేసిన సంఘటనలున్నాయి.

నిబంధనలు బేఖాతరు!

పేలుడు పదార్థాలను వినియోగించే వారికి పోలీసుల అనుమతి ఉండాలి. గనులశాఖకు సమాచారం అందించాలి. వాటి వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడంతో పాటు పోలీసులకు తెలియజేయాలి. నిపుణుల పర్యవేక్షణలో పేలుళ్లు జరపాలి. చాలా వరకు ఈ నిబంధనలు అమలు కావడం లేదు.


నివారణకు ప్రత్యేక చర్యలు

- జోగుల చెన్నయ్య ఏఎస్పీ మహబూబాబాద్‌

జిల్లాలో పేడులు పదార్థాల అక్రమ వ్యాపారంపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వెంచర్ల ఏర్పాటు, రాళ్లు పగులగొట్టే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా పెట్టాం.సంబంధిత కార్యాలయాల్లో రిజిస్టర్లను పరిశీలిస్తున్నాం. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు విక్రయిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని