logo

జగన్‌ ఊరేగారు.. జనం అల్లాడారు

ఉభయ జిల్లాల్లో మంగళవారం సాగిన ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర, మేమంతా సిద్ధం సభలు జనాలకు అష్టకష్టాలు తెచ్చిపెట్టాయి.

Published : 17 Apr 2024 06:31 IST

   సిద్ధం బస్సు యాత్ర, సభలతో ప్రజలకు ప్రత్యక్ష నరకం
  కరెంటు కోత.. ఆపై ఉక్కపోతతో సతమతం
  ట్రాఫిక్‌ సమస్యకు తోడు బస్సుల్లేక ఇబ్బందులు

భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి సమీపాన వంతెనపై గంటల కొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ఎండ తీవ్రతతో చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడారు.

భీమవరం,  ఉండి, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు గ్రామీణం,న్యూస్‌టుడే:  ఉభయ జిల్లాల్లో మంగళవారం సాగిన ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర, మేమంతా సిద్ధం సభలు జనాలకు అష్టకష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రధాన మార్గాల్లో సైతం ట్రాఫిక్‌ మళ్లింపులు, రహదారుల మూసివేతతో సాధారణ ప్రజలతో పాటు వాహనదారులకు చుక్కలు కనిపించాయి.

తీవ్ర ఎండలో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని వృద్ధుల నుంచి చిన్నారులు వరకు నరకయాతన అనుభవించారు.ఉండి సెంటర్‌, భీమవరం బైపాస్‌, బీవీ రాజు కూడలిలో మధ్యాహ్నం నుంచే రాకపోకలను నిలిపివేయడంతో పట్ణణంలోని ప్రధాన రహదారులు, పైవంతెన మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బస్సు యాత్ర నిడమర్రు, గణపవరం, ఉండి మండలాల మీదుగా సాగింది. అధికారులు స్వామిభక్తిని ప్రదర్శించి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించారు. గణపవరం, సరిపల్లె గ్రామాల్లో రహదారుల వెంబడి ఉన్న చెట్లను గణపవరం పోలీసులు దగ్గరుండి మరీ  నరికి వేయించారు. రహదారిపై నుంచి వెళ్లిన విద్యుత్తు తీగలు, అంతర్జాలం, టీవీ కేబుళ్లను తొలగించడంతో మంగళవారం ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వరకు సరఫరా నిలిచింది. అసలే వేసవి కాలం.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక ఉక్కపోతకు సతమతమయ్యారు.

విద్యుత్తు సరఫరా లేక వరండాలో వైద్యం

  మంగళవారం ఉదయం 6 గంటలకే విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. గణపవరం పీహెచ్‌సీలో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో  రహదారి ప్రమాదంలో గాయపడిన యువకుడికి సిబ్బంది వరండాలో పరదాల చాటున చికిత్స అందించారు.

గణపవరంలో పోలీసు పర్యవేక్షణలో చెట్ల నరికివేత

విలవిల్లాడిన వ్యాపారులు.. వ్యాపార సముదాయాల్ని మూసివేయాలని పోలీసులు హుకుం జారీ చేయడంతో గణపవరం కూడలి వెలవెలబోయింది. ఐస్‌క్రీం, పాలు, పెరుగు పదార్థాలు విక్రయించే వ్యాపారులకు నష్టం వాటిల్లింది. విద్యుత్తు నిలిచిపోవడంతో ఐస్‌ పరిశ్రమలో చేపలు, రొయ్యల ప్యాకింగ్‌లు  నిలిచిపోయాయి. రొయ్యల చెరువుల్లో పంకాలు తిప్పేందుకు రైతులు పెట్రోలు బంకులకు పరుగులు తీశారు. తీరా అక్కడికి వెళ్లాక జనరేటర్‌ పనిచేయక పోవడంతో డీజిల్‌ను పెంటపాడు, అత్తిలి తదితర ప్రాంతాల నుంచి తీసుకు రావాల్సి వచ్చింది. బ్యాంకుల్లో బ్యాటరీలు మొరాయించడంతో సేవలు నిలిచి పోయాయి. సరిపల్లెలో తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోయారు. నీటిశుద్ధి కేంద్రాలకు మంచినీరు తెచ్చుకుందామని వెళ్తే విద్యుత్తు లేనందున అక్కడా దొరక్క నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక విద్యార్థులు పాఠశాలల్లో నరక యాతన అనుభవించారు. పాఠశాలలు వదిలాక ఇంటికి వెళ్లేందుకు యత్నిస్తే పోలీసుల ఆంక్షల కారణంగా వాహనాలు రాకపోవడంతో ఎండలో నిరీక్షించాల్సి వచ్చింది.

216ఏ జాతీయ రహదారి నుంచి భీమవరం వైపు వాహనాలు వెళ్లకుండా నారాయణపురం వద్ద రహదారిని మూసివేశారు.

ఆర్టీసీ బస్సులను భీమవరం సభకు జనాల్ని తీసుకెళ్లేందుకు కేటాయించడంతో కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


నీరు లేక నీరసించి.. సీఎం జగన్‌ వస్తున్నారంటూ ఉదయం 6 గంటలకే కరెంటు ఆపేశారు. కుళాయిల ద్వారా మంచినీరు రానందున అటు తాగడానికి లేక, ఇటు స్నానాలు చేయడానికి వీలు లేక నరకయాతన అనుభవించాం. జగన్‌ వస్తున్నారంటే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుందని టీవీల్లో చూడటమే గానీ, ఈ రోజు ప్రత్యక్షంగా చూశా.

 మహాలక్ష్మి, గృహిణి, సరిపల్లె


ఉక్కిరిబిక్కిరయ్యాం.. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ఉక్కబోతకు ఉక్కిరి బిక్కిరయ్యాం. రోజూ మాదిరే తాగునీరు వస్తుందని భావించాం. గుక్కెడు నీరు లేకుండాపోయింది. టిఫిన్‌, భోజనం వండుకునే అవకాశం లేకుండా చేశారు. ప్రత్యక్ష నరకం చవిచూశాం

 నరసమ్మ, గృహిణి


దుకాణాలు మూత.. విద్యుత్తు లేనందున టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు పని చేయలేదు. దుకాణాలు మూసివేశారు. నగదు జమ చేసేందుకు బ్యాంకులకు వెళ్తే అక్కడా సేవలు నిలిచిపోయాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు గణపవరం వచ్చారు కానీ ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు.

బుద్ధారపు పుల్లయ్య, గణపవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు