Tunnel Rescue: రాణిగంజ్‌ నుంచి ఉత్తర్‌కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!

భారత్‌లో రాణిగంజ్‌ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్‌లాండ్‌లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్‌కాశీ సొరంగం ఆపరేషన్‌లు చరిత్రలో నిలిచిపోయాయి.

Published : 29 Nov 2023 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బొగ్గు గనులు, సొరంగాల్లోకి వెళ్లి ప్రతికూల పరిస్థితుల్లో అక్కడే చిక్కుకుపోయిన ఎన్నో ఘటనలు చూస్తున్నాం. విధుల్లో భాగంగా కొందరు.. సాహస యాత్రలకు వెళ్లిన మరికొందరు తిరిగి రాలేని దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో రాణిగంజ్‌ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్‌లాండ్‌లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్‌కాశీ సొరంగం వరకు అనేక ఘటనలు ప్రపంచాన్ని కదిలించాయి. సాహసోపేతమైన ఆపరేషన్లతో  బాధితులను రక్షించారు. ఉత్తర్‌కాశీ రెస్క్యూ నేపథ్యంలో.. ఈ తరహా భారీ ఆపరేషన్లు ఓసారి గుర్తుచేసుకుంటే..

రాణిగంజ్‌ రెస్క్యూ 1989:

మహబీర్‌ కొలియరీ బొగ్గు గనిలో కార్మికులు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పశ్చిమబెంగాల్‌లోని రాణిగంజ్‌ (Raniganj Coalfields) ప్రాంతంలో ఉన్న ఈ బొగ్గు గనిలో 232 కార్మికులు పనిచేస్తున్నారు. నవంబర్‌ 13, 1989న బ్లాస్టింగ్‌ చేస్తున్న సమయంలో గని గోడలకు పగుళ్లు వచ్చాయి. దాంతో గనిలోకి ఒక్కసారిగా నీరు చేరడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని పసిగట్టి రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. వెంటనే 161 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఈ క్రమంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 65 మంది మాత్రం అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. జశవంత్‌ గిల్‌ అనే మైనింగ్‌ ఇంజినీర్‌ ఇచ్చిన ఓ వినూత్న ఐడియా ఆపరేషన్‌లో కీలకమైంది. బోర్‌వెల్‌ సాయంతో ఓ భారీ స్టీల్‌ పైపును లోపలికి పంపించారు. అందులోనుంచి ఒక్కొక్కరు బయటకు రావడంతో కథ సుఖాంతమైంది.

ప్రిన్స్‌ బోర్‌వెల్‌ ప్రమాదం 2006:

హరియాణాలోని కురుక్షేత్రలో ఓ ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. అంతకుముందు ఈ తరహా ఘటనలు పెద్దగా వెలుగు చూడకపోవడంతో.. మీడియాలోనూ ఇది కాస్త ప్రధాన వార్తగా నిలిచింది. అతడిని (Prince's 2006 borewell accident) బయటకు తెచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేశాయి. దాని పక్కనే మరో బోరుబావి ఉండటం ఆపరేషన్‌కు అనుకూలించింది. దాని ద్వారా మూడు అడుగుల వ్యాసం కలిగిన ఓ ఐరన్‌ పైపును లోపలికి పంపించారు. చివరకు 50గంటల రెస్క్యూ తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

చిలీ మైనింగ్‌ రెస్క్యూ 2010: 69 రోజుల ఆపరేషన్‌..

 చిలీలోని ఓ బంగారు గని ప్రమాదం కూడా యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆగస్టు 5, 2010న శాన్‌ జోస్‌ గోల్డ్‌ అండ్‌ కాపర్‌ గని కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 33 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అయితే, లోపల ఉన్న అత్యవసర షెల్టర్‌లో తలదాచుకున్నారు. బాహ్య ప్రపంచంతో సంప్రదించే వీలులేకుండా పోయింది. కేవలం పరిమిత ఆహారం, కొద్దిపాటి నీటితోనే గడపాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు 2వేల అడుగుల లోతుకు చిన్న రంధ్రాన్ని తవ్వారు. అందులోకి ఓ నోట్‌ను పంపించారు. తామంతా సురక్షితంగా ఉన్నామని చెప్పడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోనికి ఆహారం, నీరు, ఔషధాలు పంపించారు. చివరకు 69 రోజుల తర్వాత ఓ గొట్టం నుంచి ఒక్కొక్కరుగా బయటకు రావడాన్ని ప్రజల కళ్లల్లో మెదులుతూనే ఉంది.

క్యూక్రీక్‌ మైనింగ్‌ ప్రమాదం 2002:

అమెరికా పెన్సిల్వేనియాలో ఉన్న ఓ గనిలో జులై 24, 2002న ప్రమాదం చోటుచేసుకుంది. వందల అడుగుల లోతులో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. భూగర్భం నుంచి నీరు చేరుతుండటంతోపాటు ఆక్సిజన్‌ కూడా నిండుకుపోవడం వారి ప్రాణాలకు ముప్పుగా మారింది. తీవ్ర కృషి చేసిన రెస్క్యూ సిబ్బంది 77గంటల తర్వాత 22 అంగుళాల పైపు సాయంతో బయటకు తీసుకురాగలిగారు. 

థాయ్‌ కేవ్‌ రెస్క్యూ 2018: 18 రోజుల సాహసం..

ఫుట్‌బాల్‌ ఆడే బాలలు తమ కోచ్‌తో కలిసి థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో (Tham Luang Cave)కి వెళ్లగా.. ఆకస్మిక వరద ప్రవాహంతో అందులో చిక్కుకుపోయారు. 2018లో జరిగిన ఈ సంఘటన (Thailand cave rescue) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపింది. వీరిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి.. 18 రోజులపాటు (జూన్‌ 23, 2018 నుంచి జులై 10 వరకు) తీవ్ర ప్రయత్నాల అనంతరం సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు డైవర్లు కీలకంగా వ్యవహరించగా.. ఇతర దేశాలకు చెందిన మరో 90 మంది డైవర్లు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 10 వేల మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా చూసిన ఈ భారీ రెస్క్యూపై అనేక సినిమా, డాక్యుమెంటరీలు, పుస్తకాలు కూడా వచ్చాయి.

ఉత్తర్‌కాశీ ఆపరేషన్‌: 17 రోజులు సొరంగంలోనే..

ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. సొరంగంలోకి చేరేందుకు దాదాపు ఆరు మార్గాల్లో ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. అత్యంత సాంకేతికత యంత్రాలను వినియోగించినప్పటికీ.. చివరకు నేలకు సమాంతరంగా ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ చేపట్టి కార్మికులు ఉన్న ప్రాంతానికి చేరుకోగలిగారు. గనిలో అమర్చిన ఓ పైపు ద్వారా కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని