Playa de Las Teresitas: లక్షల టన్నుల సహారా ఎడారి ఇసుకతో తయారైన బీచ్‌.. ఎక్కడుందో తెలుసా!

 స్పెయిన్‌లోని (Spain) కేనరీ ఐలాండ్స్‌లో ఎన్నో ముఖ్యమైన బీచ్‌లున్నాయి. వాటిలోని ప్లేయా డి లాస్‌ టెరెసిటాస్‌ (Playa de Las Teresitas) బీచ్‌ ప్రత్యేకత ఏంటంటే అది సహజసిద్ధంగా ఏర్పడింది కాదు. సుమారు 2.7లక్షల టన్నుల ఇసుక పోగు చేసి దానిని సృష్టించారు. ఆ బీచ్‌ (Beach) నిర్మాణానికి గల కారణాలు తెలుసుకోండి.

Published : 15 Jun 2023 13:35 IST

Image : Club Canary

ప్రస్తుతం పర్యాటకులకు కనువిందు చేస్తున్న ప్లేయా డి లాస్‌ టెరెసిటాస్‌ (Playa de Las Teresitas) బీచ్‌  (Beach) గతంలో అలా ఉండేది కాదు. దాని తీరం గులకరాళ్లు, నల్లని అగ్నిపర్వత ఇసుకతో కళావిహీనంగా కన్పించేది. సముద్రంలో (sea) ఇప్పుడున్న ప్రశాంతత ఆనాడు లేదు. అలలు బలంగా ముందుకొచ్చి ఒడ్డునున్న రాళ్లను ఢీకొట్టి పోయేవి. తీరం నిత్యం అల్లకల్లోలంగా ఉండటంతో దానికి ప్రమాదకర బీచ్‌ అనే ముద్ర పడింది. కానీ, శాంటా క్రూజ్‌ నగరానికి దగ్గర్లో ఉన్న ఏకైక బీచ్‌ ఇది మాత్రమే కావడంతో అప్పటి అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. మిగతా బీచ్‌లలో ఉన్న కొద్దిపాటి మంచి ఇసుకను కూడా కొన్ని నిర్మాణ సంస్థలు తమ అవసరాల కోసం తరలించుకుపోయేవి. ఇదీ నాటి పరిస్థితి.

కృత్రిమ బీచ్‌ నిర్మాణానికి అడుగులు

1953లో శాంటా క్రూజ్‌ సిటీ కౌన్సిల్‌ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే లాస్‌ టెరెసిటాస్‌లో కృత్రిమ బీచ్‌ నిర్మించడం. ఆ డిజైన్‌ను రూపొందించడానికి ఎనిమిదేళ్లు పట్టింది. స్పానిష్‌ మంత్రిత్వశాఖ, కౌన్సిల్‌ ఆమోదం పొందడానికి తాత్సారం జరగడంతో మరో నాలుగేళ్లు గడిచిపోయాయి. మొత్తానికి కృత్రిమ బీచ్‌ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. తొలి దశలో భాగంగా బీచ్‌ను బలమైన అలలు ఢీకొట్టకుండా చర్యలు తీసుకున్నారు. అందుకోసం అతిపెద్ద ‘బ్రేక్‌ వాటర్‌’ నిర్మించారు. ఈ చర్య సత్ఫలితాన్నిచ్చింది. అంతేకాకుండా తీరంలో కొత్తగా తెచ్చి పోసే ఇసుక సముద్రంలోకి జారకుండా అడ్డుకట్ట వేసింది. తదుపరి చర్యల్లో భాగంగా సహారా ఎడారి నుంచి సుమారు 2,70,000 టన్నుల తెల్లని ఇసుక తెప్పించారు. ఆ ఇసుకను 1.3 కిలోమీటర్ల మేర.. 80 మీటర్ల వెడల్పులో పరిచారు. అలా 1973 నాటికి కృత్రిమ బీచ్‌ను అభివృద్ధి చేశారు. తర్వాతి కాలంలో ఇది స్థానికులకు, ప్రపంచ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారిపోయింది. 

మరిన్ని బీచ్‌ల అభివృద్ధి

ఇదే తరహాలో కేనరీ ఐలాండ్స్‌లోని పలు బీచ్‌లను బాగు చేసేందుకు పశ్చిమ సహారా నుంచి ఇసుక తరలించడం తర్వాతి కాలంలో పరిపాటిగా మారింది. భవన నిర్మాణ అవసరాలకు సైతం సహారా ఇసుకే ఆధారమైంది. దాంతో అక్రమ ఇసుక రవాణా ఊపందుకుంది. ఫలితంగా పశ్చిమ సహారా పర్యావరణం దెబ్బతిని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇసుక వ్యాపారం కారణంగా మొరాకో అధికారులు, కొన్ని కంపెనీలు లాభపడ్డాయి. అధిక ఇసుక వెలికితీత మాత్రం పర్యావరణానికి తీరని నష్టాన్ని మిగిల్చింది.

విధ్వంసం.. వినాశకరం

ఇసుక ప్రకృతి ప్రసాదించిన పరిమిత వనరు. దాన్ని ఇష్టారీతిన తోడుకోవడం మానవుల మనుగడకు ఎంత మాత్రం మంచిది కాదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం..  ప్రపంచం మొత్తం మీద ఏడాదికి 50 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ ఇసుకతో ఏకంగా ప్రపంచం చుట్టూ భారీ గోడ కట్టవచ్చట. ఇసుకకు డిమాండ్‌ ఏర్పడటంతో బీచ్‌లు, నదీ గర్భాల నుంచి తవ్వకాలు ఎక్కువయ్యాయి.  ఎడారి ఇసుక మరీ నునుపుగా ఉంటుంది కాబట్టి వదిలేశారని, లేకుంటే ఈ పాటికి ఇసుక లేని ఎడారులు కూడా చూసేవారమని పర్యవరణ వేత్తలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల నుంచి ఇసుక వెలికితీత జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని గత కొన్నేళ్లుగా సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలను అభ్యర్థిస్తున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని