Zojila tunnel : ‘జోజిలా’.. ఆసియాలోనే అతి పొడవైన సొరంగ మార్గం!
ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటైన జమ్మూకశ్మీర్ (Jammu kashmir), లద్ధాఖ్‌లో (Ladakh) అభివృద్ధి పరుగులు పెడుతోంది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులతో ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి.
భౌగోళికంగా కీలకమైన శ్రీనగర్-లేహ్ హైవే (ఎన్‌హెచ్1)పై అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో (Jammu kashmir) రూ.25వేల కోట్ల వ్యయంతో 19 సొరంగాల (Tunnels) నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా 6.5 కిలోమీటర్ల పొడవైన ‘జడ్-మోర్’ టన్నెల్, సమీప రహదారి నిర్మాణం కోసం రూ.2680 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరో వైపు జోజిలా టన్నెల్ (Zojila tunnel) నిర్మిస్తున్నారు. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ (Ladakh) మధ్య రవాణా సులభతరం చేసేందుకు ఈ జోజిలా టన్నెల్ ఎంతో కీలకం కానుంది.
ఏంటీ జోజిలా టన్నెల్?
నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే జోజిలా టన్నెల్‌కు ఇండియాలో, ఆసియాలోనే అతి పొడవైన రహదారి సొరంగ మార్గంగా గుర్తింపు దక్కనుంది. దీని పొడవు 14.15 కిలోమీటర్లు. 7.57 మీటర్ల ఎత్తులో ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. రహదారితో కలిపి దీనికి రూ.6800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ఆసియాలోనే పొడవైన బై-డైరెక్షనల్ టన్నెల్ అని చెబుతున్నారు. ఇందులో 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణం చేయవచ్చు.
కశ్మీర్‌లోని గాందార్‌బల్, లద్ధాఖ్‌లోని కార్గిల్ జిల్లా డ్రాస్ పట్టణానికి మధ్యలో జోజిలా పాస్ ఉంది. ఈ పాస్‌లోని కొండలను తొలిచి జోజిలా టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. అలా చేయడం ద్వారా ‘జడ్-మోర్’ టన్నెల్ మార్గాన్ని జోజిలా టన్నెల్‌తో అనుసంధానం చేయవచ్చు. ఈ రెండు టన్నెళ్లకు మధ్య 18.475 కిలోమీటర్ల హైవేను అభివృద్ధి చేస్తున్నారు. అవసరం మేరకు 3 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరుగుతున్నాయి. మిగతా మార్గం మొత్తం కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ హైవేలో ఐదు వంతెనలు, రెండు స్నో గ్యాలరీలను నిర్మిస్తున్నారు.
సొరంగం ఎందుకు?
ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లద్ధాఖ్‌లోని లేహ్ చేరుకోవాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతోంది. ఈ మార్గంలో వాతావరణం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. పైగా ఎత్తయిన జోజిలా పాస్ పర్వత మార్గం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ ప్రయాణానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. జోజిలా టన్నెల్ అందుబాటులోకి వస్తే 20 నిమిషాలే పడుతుందని అధికారులు చెబుతున్నారు. చలికాలంలో జోజిలా వద్ద ఎక్కువగా మంచు కురుస్తుంటుంది. హిమపాతాలు చోటు చేసుకుంటాయి. కొండ చరియలు విరిగి పడుతుంటాయి. కొన్ని సార్లు వాహనాలు కూడా రోడ్డు మీద నుంచి జారి అదుపుతప్పుతుంటాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలను నిలిపివేస్తారు. దాంతో కనీసం ఐదు నెలలపాటు దేశంలోని మిగతా భూభాగంతో అవతలి వైపు ప్రజలకు సంబంధాలు తెగిపోతాయి. జోజిలా పాస్‌ను మూసివేస్తే విమాన ప్రయాణమే దిక్కు. ఆ ఖర్చును సామాన్యులు భరించలేరు. అందుకే జోజిలా టన్నెల్‌ను ప్రతిపాదించారు. ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే అన్ని కాలాల్లోనూ ప్రయాణం సులభతరం అవుతుంది. ఇది పౌరులకే కాదు.. మిలటరీకి కూడా కీలక మార్గం అవుతుంది. 2026 కల్లా ఈ రహదారి అందుబాటులోకి రానుంది.
ప్రమాదాలకు అడ్డుకట్ట
ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడం వల్ల కశ్మీర్-లద్ధాఖ్ ప్రయాణ సమయం తగ్గుతుంది. బాల్తాల్ నుంచి మినామార్గ్‌కు 40 కిలోమీటర్ల దూరం ఉంది. నూతన సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే ఆ దూరం 13 కిలోమీటర్లు కానుంది. దాంతో సుమారు గంటన్నర సమయం ఆదా అవుతుంది. మునుపటిలా శ్రమతో కూడిన ప్రయాణం కూడా ఉండదు. గతంలో జోజిలా మార్గం ఓ మృత్యుదారిలా ఉండేది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. టన్నెల్ రాకతో ప్రమాదాలు నివారించొచ్చని అధికారులు చెబుతున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.
స్మార్ట్ వ్యవస్థ
ఈ జోజిలా సొరంగ నిర్మాణంలో స్మార్ట్ టన్నెల్ వ్యవస్థను వాడుతున్నారు. అందులో భాగంగా న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్‌ను అనుసరిస్తున్నారు. ఈ విధానంలో సీసీటీవీ, రేడియో కంట్రోల్, నిరంతర విద్యుత్తు సరఫరా, వెలుతురు సౌలభ్యం ఉంటాయి. అ అధునాతన సాంకేతికతను వినియోగించడం ద్వారా భారత ప్రభుత్వానికి సుమారు రూ.5వేల కోట్ల రూపాయలు ఆదా అయినట్లు సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!