Technology : మనిషిని పోలిన మనుషులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు!

ఒకరి పోలికలతో ఉన్న మరి కొంత మంది వ్యక్తులను గుర్తుపట్టి చూపించే సాంకేతిక పరిజ్ఞానం(technology) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఉపయోగించిన కొందరు తమలాంటి పోలికలతో ఉన్న వారిని కలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. అదెలా సాధ్యమైందో తెలుసుకోండి!

Published : 22 Jan 2023 12:43 IST

(Image : youtube)

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని విన్నాం. అయితే ఆ ఏడుగురు ఎక్కడుంటారో ఎవరికైనా తెలుస్తుందా? పోనీ.. కనీసం మనలా ఎవరో ఒకరైనా ఉన్నారే అనుకుందాం. వారిని కలవాలంటే.. ఫేస్‌బుక్‌(facebook), ట్విటర్‌(twitter), యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌(instagram) ఇలా ఏ సామాజిక మాధ్యమంలో వెతకాలి? వారు మనకు అసలు ఎదురుపడతారా? ప్చ్‌.. కష్టం అనుకుంటున్నారా? అదేమీ అంత కష్టం కాదని నిరూపిస్తోంది Twinstrangers.com అనే వెబ్‌సైట్‌. ఇదే పేరుతో ఓ యాప్‌ కూడా ఉంది. 

ఈ వెబ్‌సైట్‌ నుంచి చాలా మంది తమను పోలిన వ్యక్తులను కలుసుకున్నారు. ఆ క్షణంలో వారి ఆనందానికి అవధులు లేవు. అలా అమెరికాలోని నార్త్‌ కరోలినాకు చెందిన అంబ్రా, టెక్సాస్‌కు చెందిన జెన్నిఫర్‌ మీట్‌ అయ్యారు. వయసు రీత్యా ఇద్దరికీ పదేళ్ల వ్యత్యాసం ఉంది. కానీ, వారి ముఖ కవళికలు(face) మాత్రం ఒక్కటిగానే ఉండటం ఆశ్చరకరమైన విషయం. ఇలా తమలాంటి పోలికలతో ఉన్న వ్యక్తులను కలుసుకున్న చాలామంది వారి అనుభవాలను వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. 

గుర్తు పట్టాలంటే ఏం చేయాలి?

ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌(website)లో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. సరైన పోలికలతో ఉన్నవారిని గుర్తించాలంటే మన అసలైన రూపం ఎలా ఉంటుందో అలా ఇందులో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫొటో(photo)లో మన ముఖం కచ్చితంగా మధ్యలోనే ఉండి తీరాలి. సైడ్‌ లుక్‌లో ఉన్న చిత్రాలు ఇందులో అప్‌ చేయడానికి పనికి రావు. పైగా ట్రాక్‌ చేయడం కష్టతరమవుతుంది. ముఖంపై వెంట్రుకలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోరు, చెవులు అద్దంలో ఎలా కన్పిస్తుంటాయో అచ్చం అలాంటి ఫొటోనే ఇందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ జెండర్‌, పేరు, ఊరు, దేశం తదితర వివరాలన్నీ సమర్పించాలి. ప్రొఫైల్‌ గ్యాలరీలో మరో ఐదు రకాల ఫొటోలను అదనంగా జత చేయాల్సి ఉంటుంది.

ఎలా వెతికి పెడుతుంది?

ఈ వివరాలు నమోదు చేసిన తరువాత వెబ్‌సైట్‌లో కృత్రిమ మేధ సహాయంతో మన పోలికలు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. తరువాత మన ప్రొఫైల్‌ ఆధారంగా అప్పటికే రిజస్టర్‌ అయిన వారి ముఖాలను పోలుస్తూ.. అందులో మీలాగే ఉన్నవారి ఫొటోలను గుర్తించి ఒక ఫోల్డర్లో పంపిస్తుంది. మీకు తగ్గ వ్యక్తి దొరికితే వారిని మై ట్విన్స్‌ ఫోల్డర్‌లోకి పంపించాలి. అప్పుడు అవతలి వ్యక్తి కూడా మీతో పరిచయం పెంచుకోవడానికి వీలుంటుంది. విభిన్న రకాల ఫొటోలు జత చేసే కొద్దీ మీ పోలికలు ఉన్న మరింత మంది వ్యక్తులను ఈ వెబ్‌సైట్‌లోని సాంకేతికత వెతికిపెడుతుంది. 

నోట్‌ : వినూత్న సాంకేతికత అంతర్జాలంలో అందుబాటులో ఉందని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. అలాంటి వెబ్‌సైట్స్‌, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలో.. వద్దో నిర్ణయించుకోవాల్సింది మీరే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు