కరోనా ఎఫెక్ట్‌: ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకోండి

ముందుగా మీ ఇంట్లో ఏ ప్రదేశంలో జిమ్‌ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందో నిర్ణయించుకోండి. గ్యారేజీని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ సాధారణంగానే తగినంత స్థలం ఉండి, మీకు కావలసినవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్యారేజీ లేకపోతే అని

Published : 03 Apr 2020 10:13 IST

కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) చాలా వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. దీంతో ప్రజలు హోం క్వారంటైన్‌ అయి ఇళ్ల నుంచి బయటకి రావట్లేదు. అయితే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆరోగ్యం మహాభాగ్యం అన్న విషయం మరిచిపోవద్దు. సాధారణ రోజుల్లో అయితే మన శారీరక ఆరోగ్యం కోసం బయట జిమ్‌లకు వెళ్లి వ్యాయామం చేస్తుంటాం. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా జిమ్‌లు కూడా మూతపడ్డాయి. మరి ఇప్పుడు ఎలా వ్యాయామం చేయడం? ఇప్పుడనే కాదు ఎప్పుడైనా మీ ఇంట్లోనే ఓ జిమ్‌ ఉంటే సౌకర్యంగా ఉంటుంది కదా! అందుకే ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకోవడం ఎలాగో ఓ సారి చదివేయండి.

ఎక్కడ ఏర్పాటు చేయాలి?

ముందుగా మీ ఇంట్లో ఏ ప్రదేశంలో జిమ్‌ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందో నిర్ణయించుకోండి. గ్యారేజీని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ సాధారణంగానే తగినంత స్థలం ఉండి, మీకు కావలసినవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్యారేజీ లేకపోతే అని ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లోనే మీకు అనువైన గదిని ఎంచుకోండి. మీ ఇంట్లో పరిమిత స్థలం ఉండి, నివసించే ప్రదేశంలోనే జిమ్‌ చేసుకోవాలంటే, మీ ఫర్నిచర్‌కు చక్రాలాంటివి అమర్చండి. దాంతో మీరు వ్యాయామం చేసుకున్నంత సేపు మీ వస్తువులను వేరొకచోట సులభంగా జరిపొచ్చు. మీరు ఎంచుకున్న ఫ్లోర్‌ గట్టిగా ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే నేలపై బరువైన పరికరాలు ఉంచినప్పుడు లేదా మీరు జిమ్‌ చేసేటప్పుడు పెద్ద పెద్ద బరువులని ఎత్తి కింద ఉంచేటప్పుడు ఫ్లోర్‌ ధ్వంసమయ్యే అవకాశముంది. 

బడ్జెట్‌ కూడా ముఖ్యమే...

అత్యాధునిక హోమ్‌ జిమ్‌ను ఏర్పాటు చేయాలంటే ఖరీదైన పనే. కానీ, ప్రాథమిక, క్రియాత్మకంగా ఉండే జిమ్‌ ఏర్పాటు చేసుకోవడానికి మీకంతగా ఖర్చవ్వదు. మొదట మీరు ఎంత బడ్జెట్‌లో జిమ్‌ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారో ఓ బడ్జెట్‌ వేసుకోండి. మీ బడ్జెట్‌కి తగినట్టుగా పరికరాలు కొనండి. ఈ పరికరాలు కొనే ముందు రెండు విషయాలు ఆలోచించాలి. మీరు కొత్తవి కొనదలిచారా? లేదా ఉపయోగించనవా? అని. ఏది కొనాలన్నా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలను పరిశీలించి, మీకు అనుకూలమైన ధరలలో కొనవచ్చు.

ఏవి అనువైన పరిస్థితులు

* కొంతమందికి వ్యాయామం చేసేటప్పుడు పాటలు వినే అలవాటు ఉంటుంది. అలా అని పెద్ద పెద్ద శబ్దాలు పెట్టకూడదు. వ్యాయామం చేసేటప్పుడు పెద్ద శబ్దాలు రాకుండా చూసుకోండి. వీలైనంత వరకు హెడ్‌సెట్‌ వాడటం మంచిది. పెద్దగా శబ్దాలు చేయడం వల్ల మీ ఇరుగుపొరుగు వారికి అసౌకర్యంగా అనిపించొచ్చు.

* మీరు వ్యాయామం చేసే ప్రదేశంలో సరైన ఉష్ణోగ్రత కలిగి ఉండటం చాలా ముఖ్యం. జిమ్‌ ఏర్పాటు చేసుకున్న ప్రదేశంపై ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గ్యారేజ్‌.. గది ఉష్ణోగ్రతలను పోల్చుకుంటే గది కన్నా గ్యారేజీ ఎక్కువ వేడిగా ఉండే అవకాశం ఉంది.

* మంచి వెలుతురు ఉండడం కూడా ముఖ్యం. కానీ, తక్కువ ఎత్తులో లైట్లను వేలాడదీయకండి. మీరు ఓవర్‌హెడ్‌ వ్యాయామాలు చేస్తే ఆ లైట్లకి తగిలే అవకాశం ఉంది.

* ఇది మీ జిమ్‌. కాబట్టి మీకు నచ్చినట్లు అలంకరించుకోవచ్చు. ఆకర్షణీయమైన రంగులు, లైట్లని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా జిమ్‌ పరికరాలను అమర్చుకోవడానికి గోడలు అనువైన ప్రదేశాలు.  

ఏమేముంటే బాగుంటుంది?

* ఒక రాక్‌లాంటిది ఏర్పాటు చేసుకుంటే బార్‌బెల్‌ వ్యాయామాలు చేయడానికి వీలుగా ఉంటుంది. మీ దగ్గర రాక్‌ లేనప్పుడు మీ ఇంట్లో స్థిరంగా లేదా తొలగించడానికి వీలుగా ఉండే ఫుల్‌-అప్‌ బార్‌ని అమర్చుకోండి. అలాగే మీరు ఎక్కువ వ్యాయామాలు చేయడానికి ఓ బెంచ్‌ ఉండాల్సిందే. కాబట్టి, తప్పనిసరిగా ఓ బెంచ్‌ని ఏర్పాటు చేసుకోండి.

* మీరు జిమ్‌ కొత్తగా ప్రారంభించడానికి ఒక బార్‌బెల్ సరిపోతుంది. తరువాత మీకు అవసరమైతే వేరే బార్‌బెల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. మీ అవసరాలకు చాలా వరకు సాలిడ్‌ ఒలింపిక్ బార్ సరిపోతుంది. మీరు పౌండ్ల / కిలోల సంఖ్యతో ప్లేట్ కిట్ కొనుగోలు చేయవచ్చు. కాస్ట్ ఐరన్ ప్లేట్లు సాధారణంగా బంపర్ ప్లేట్ల కంటే చౌకగా ఉంటాయి. అయితే వీటిని ఎంచుకునేటప్పుడు మీ ఫ్లోరింగ్‌ సామర్థ్యంపై ఆధారపడి తీసుకోవాలి. ఈ ప్లేట్లని నేలపై పరచడం కన్నా ర్యాక్‌ల్లో పేర్చడం మేలు. ముఖ్యంగా భారీ ప్లేట్లని చదునుగా ఉన్న ప్రదేశాల్లో పెడితే తీయడం కష్టం. అలాగే గోడకి వాలుగా ఉన్నట్లు పెడితే గోడలు దెబ్బతినే అవకాశం ఉంది.

* డంబెల్స్‌ చాలా రకాలుగా ఉపయోగించదగిన పరికరాలు. డంబెల్స్‌ని విడివిడిగా కొనడానికి బదులుగా, ఒక దానికి వేరే సైజులని వేయదగినవి తీసుకోవడం ఉత్తమం. అవి చిన్న బార్‌బెల్స్‌లా పనిచేస్తాయి. 

* కెటిల్‌బెల్స్‌ కూడా ఏర్పాటు చేసుకోవడం మంచి విషయం. వీటి ఆకారాలు అనేక వ్యాయామాలు చేయటానికి వీలుగా ఉంటుంది. ఇవి సాధారణంగా వేర్వేరు బరువు ఎంపికల్లో మాత్రమే సరిపోతాయి. 

* స్థలాన్ని ఆదా చేసేటప్పుడు టిఆర్‌ఎక్స్ శిక్షణ చాలా బాగుంటుంది. ఈ బ్యాండ్‌లను మీ ర్యాక్‌కు జోడించవచ్చు. మీరు రెసిస్టెన్స్ బ్యాండ్లతో అనేక వ్యాయామాలు చేయవచ్చు. ఇవి మీ జిమ్‌లో సులభంగా జోడించగల ఆచరణాత్మక, చౌకైన పరికరాలు.  

* వ్యాయామాలు చేసేటప్పుడు యోగా మ్యాట్‌ని కూడా ఉపయోగించొచ్చు. 

* సరైన శరీరాకృతి పొందాలంటే కార్డియో చాలా ముఖ్యమైన పరికరం. ఇందులో మీకిష్టమైన దానిని ఎంచుకోవచ్చు. 

* పంచింగ్ బ్యాగ్‌ని ఏర్పాటు చేసుకోండి. నిజానికి గొప్ప వ్యాయామం. అదీకాక మీ కోపం, చిరాకులన్నింటినీ దీని ద్వారా తొలగించుకోవచ్చు. 

* ఫోమ్ రోలర్ అనేది వ్యాయామం చేసినప్పుడు అయిన గాయాల నుంచి, నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి సొంతగా మసాజ్‌ చేసుకోవాడానికి వీలుగా ఉంటుంది. లాక్రోస్ బాల్ లాంటి ఇతర స్వీయ-మసాజ్ సాధనాలను కూడా కొనుగోలు చేయవచ్చు. 

* స్విస్‌ బాల్‌తోనూ చాలా వ్యాయామాలను చేయవచ్చు. దీనిని మీరు ఇంట్లో కూర్చునే కుర్చీలా కూడా ఉపయోగించవచ్చు. ఇవి బయట చాలా చవకగానూ దొరుకుతాయి. 

* మీరు కావాలనుకుంటే మీ జిమ్‌ గోడలపై ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది వ్యాయామాలు చేసేటప్పుడు తమను తాము చూసుకోవడానికి ఇష్టపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని