Just stop oil : క్రీడా మైదానాలే వారి ఉద్యమ శిబిరాలు.. శ్రుతి మించుతున్న ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ కార్యకర్తలు!
ఇంగ్లాండ్‌లో (England) తాము చేస్తున్న ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ (Just stop oil) ఉద్యమానికి ఊపు రావడం కోసం కొందరు క్రీడా మైదానాల్లోకి చొరబడుతున్నారు. తాజాగా యాషెస్ రెండో టెస్టులో అలాంటి పరిణామం చోటు చేసుకుంది.
లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా (ENG vs AUS) మధ్య బుధవారం యాషెస్ రెండో టెస్టు ప్రారంభమైన కొద్ది సేపటికే మైదానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిరసనకారులు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చారు. తమ వెంట తెచ్చుకున్న ఆరెంజ్ కలర్ పౌడర్‌ని మైదానంలో చల్లారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో (Jonny Bairstow) నిరసనకారుల్లో ఒకరిని అమాంతం ఎత్తుకెళ్లి బౌండరీ అవతల పడేశాడు. అనంతరం మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. నిరసనకారులను ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అనే గ్రూప్‌నకు చెందిన కార్యకర్తలుగా గుర్తించారు. అసలు ఏంటీ గ్రూప్? క్రీడా మైదానాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుందో తెలుసుకోండి.
పర్యావరణ ఉద్యమం
‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమాన్ని పర్యావరణ కార్యకర్తలు చేస్తున్నారు. చమురు నిక్షేపాల వెలికితీత కారణంగా వాతావరణానికి భారీగా నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తూ ‘ఎక్స్‌టిన్షన్ రెబలియన్’, ‘ఇన్సులేట్ బ్రిటన్’ అనే సంస్థలు గతంలో ఉద్యమాలు చేశాయి. అవే డిమాండ్లతో ప్రస్తుతం ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తోంది. మొదట ఈ కార్యకర్తలు చిన్న చిన్న ఉద్యమాలు చేశారు. వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో పంథా మార్చారు. గతేడాది ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగే మైదానాల్లోకి చొచ్చుకొని పోయి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని సార్లు మైదానంలోకి ప్రవేశించిన వ్యక్తులు గోల్ కొట్టే దుందుడుకు యత్నాలకు సైతం పాల్పడ్డారు. క్రీడలకు ఉన్న ప్రాచుర్యం వల్ల వీరి ఉద్యమం అందరి దృష్టిలో పడింది. అప్పటి నుంచి ఆయిల్ టెర్మినల్స్, రద్దీ రహదారులు, క్రీడా మైదానాలను తమ ఉద్యమ శిబిరాలుగా మలుచుకున్నారు.
కొత్త లైసెన్సులు వద్దని..
యూకేలో చమురు, ఇతర శిలాజ ఇంధనాల అన్వేషణ కోసం ప్రభుత్వం కొత్త లైసెన్సులు ఇవ్వొద్దని ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ బృంద సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ నిర్ణయం ఇందుకు విరుద్ధంగా ఉంది. 2025 నాటికి 100 కొత్త ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులకు లైసెన్సులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఎక్స్‌టిన్షన్ రెబలియన్’ సంస్థ కేవలం వాతావరణ మార్పులపైనే ఆందోళనలు చేయగా.. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ మరిన్ని ప్రాధాన్య అంశాలతో ముందుకెళ్తోంది.
వివాదాస్పద ఘటనలివీ..
- తాజాగా లార్డ్స్ మైదానం వేదికగా యాషెస్ రెండో టెస్టు ప్రారంభమైన కొద్ది సేపటికే మైదానంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు.
- లండన్ రింగ్ రోడ్డు ఎం 25 మోటార్ వేను దిగ్బంధించారు.
- లండన్‌లోని నేషనల్ గ్యాలరీలో సూప్ పారబోశారు.
- శరీరానికి గమ్ పూసుకొని ప్రఖ్యాత పెయింటింగ్‌లను ధ్వంసం చేయడానికి యత్నించారు.
- షెఫీల్డ్‌లో జరిగిన వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలకు అడ్డు తగిలారు.
- బ్రిటిష్ గ్రాండ్ ప్రి రేసుకు అంతరాయం కలిగించారు.
- లండన్‌లో జరిగిన ఆర్‌హెచ్‌ఎస్ చెల్సీ ఫ్లవర్ షోను లక్ష్యంగా చేసుకున్నారు.
నిధులు ఎక్కడివి?
‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమానికి ఎక్కువ శాతం నిధులు క్లైమెట్ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి వచ్చాయి. వాతావరణ మార్పులపై చేసే ఉద్యమాలకు నిధులు సమకూర్చేందుకు 2019లో ఈ యూఎస్ నెట్‌వర్క్ ఏర్పాటైంది. క్లైమెట్ ఎమర్జెన్సీ ఫండ్‌కు యూఎస్‌కు చెందిన ఐలీన్ గెట్టి నిధులు సమకూరుస్తున్నారు. ఆమె తాత పెట్రోలియం టైకూన్ జె పాల్ గెట్టి.
నిలువరించడానికి కొత్త చట్టం
‘జస్ట్ స్టాప్ ఆయిల్’ కార్యకర్తలను పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు. కోర్టు వారిపై చర్యలు తీసుకుంది. అయినా వెనక్కి తగ్గకపోవడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం రహదారులు, రైల్వే మార్గాల్లో నిరసనలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం కలిగితేనే పోలీసులు నిరసనలను అడ్డుకోవాలని ప్రస్తుతం ఉన్న చట్టం చెబుతోంది. అయితే కొత్త చట్టాన్ని ఆమోదించేందుకు బ్రిటన్ చట్ట సభ్యులు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.