ఆ దేశాల జాతీయ గీతాల్లో సాహిత్యమే లేదు

ఒక దేశం ప్రాముఖ్యతను, గుర్తింపును చాటిచెప్పడంలో జాతీయ గీతం కీలక పాత్ర పోషిస్తుంది. ‘జనగణమణ’అంటూ భారతీయులు, ‘ది స్టార్‌-స్పాంగిల్డ్‌ బ్యానర్‌’ అంటూ అమెరికన్లు, ‘హమరా సోనా బంగ్లా’ అంటూ బంగ్లదేశీయులు, ‘అడ్వాన్స్‌డ్ ఆస్ట్రేలియా ఫెయిర్‌’ అంటూ ఆస్ట్రేలియన్లు

Updated : 15 Oct 2020 13:58 IST

ఒక దేశం ప్రాముఖ్యత, గుర్తింపును చాటి చెప్పడంలో జాతీయ గీతం కీలక పాత్ర పోషిస్తుంది. ‘జనగణమన’ అంటూ భారతీయులు, ‘ది స్టార్‌-స్పాంగిల్డ్‌ బ్యానర్‌’ అంటూ అమెరికన్లు, ‘హమరా సోనా బంగ్లా’ అంటూ బంగ్లదేశీయులు, ‘అడ్వాన్స్‌డ్ ఆస్ట్రేలియా ఫెయిర్‌’ అంటూ ఆస్ట్రేలియన్లు ఇలా ప్రతి దేశంలోని పౌరులు జాతీయ గీతాన్ని వివిధ సందర్భాల్లో ఆలపిస్తూ ఉంటారు. జాతీయ గీతం విన్నా.. ఆలపించినా ఆయా దేశాల పౌరుల మనసు దేశభక్తితో ఉప్పొంగుతుంది. ప్రపంచ వేదికలు, అంతర్జాతీయ క్రీడల్లో ఈ జాతీయ గీతాలు ఆయా దేశాలను ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే అందులోని సాహిత్యం ఆ దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తుంది. కానీ, కొన్ని దేశాల జాతీయ గీతాల్లో అసలు సాహిత్యమే లేదు. కేవలం సంగీతాన్నే జాతీయ గీతంగా భావించే ఆ దేశాలేవో చూద్దామా..!

స్పెయిన్‌.. కవాతు సంగీతమే జాతీయ గీతం

స్పెయిన్‌ జాతీయ గీతాన్ని ‘మార్చా రియల్‌’(రాయల్‌ మార్చ్‌) అని పిలుస్తారు. 1761లో మాన్యువల్‌ డి ఎప్సీనోసా అనే సంగీత కళాకారుడు ‘లా మార్చి గ్రానడెరా’(మార్చ్‌ ఆఫ్‌ ది గ్రాండీస్‌) పేరుతో పదాలు లేకుండా ఒక సంగీతాన్ని రూపొందించాడు. ఈ సంగీతాన్ని సైనికులు కవాతు చేస్తున్న సమయంలో ఆలపించేవారు. అయితే దీనిని ప్రసా చక్రవర్తి ఫెడ్రెరిక్‌-II రూపొందించారన్న వాదన ఉంది. ఈ సంగీతాన్ని 1770లో అప్పటి స్పెయిన్‌ రాజు ఛార్లెస్‌-III కవాతుకు అధికారిక సంగీతంగా ప్రకటించారు. ఆ తర్వాత 1833-68మధ్య స్పెయిన్‌ను పాలించిన ఇసబెల్లా-II ఈ సంగీతాన్ని జాతీయగీతంగా మార్చేశారు. గతంలో కొందరు ఈ జాతీయ గీతానికి సాహిత్యం అందించే ప్రయత్నం చేశారు. కానీ, వాటికి అధికారిక గుర్తింపు రాలేదు. 

గతంలో ఉన్న సంగీతాన్ని 1990ల్లో పెరెజ్‌ కాసస్‌ అనే సంగీత కళాకారుడు 52 సెకన్ల నిడివితో పునరుద్ధరించాడు. దీనిపై అతడికి పేటెంట్ హక్కులు ఉండటంతో స్పెయిన్‌ ప్రభుత్వం అతడికి అప్పట్లోనే రూ.6.8కోట్లు ఇచ్చి వినియోగ హక్కులు తీసుకుంది. అయితే దీనిని మూడు వర్షెన్లలో ఆలపిస్తుంటారు. స్పెయిన్‌ రాజును గౌరవించే సమయంలో పూర్తి సంగీతాన్ని, స్పెయిన్‌ అధ్యక్షుడిని.. ప్రముఖులను గౌరవించే సమయంలో నిడివి తక్కువ ఉండే వర్షెన్లను ఆలపిస్తారు. 


బోస్నియా అండ్‌ హెర్జె గొవినా.. అందరినీ సంతృప్తి పర్చాలని

బోస్నియా యుద్ధం తర్వాత 1995లో డేటాన్‌ ఒప్పందం జరిగింది. బోస్నియా అండ్‌ హెర్జెగొవినా జాతీయ చిహ్నాలు, గీతం ఆ దేశంలోని అన్ని జాతుల వారిని ప్రతిబింబించేలా ఉండాలన్నది ఈ ఒప్పందంలోని ఒక నిబంధన. ఆ సమయంలో బోస్నియా జాతీయ గీతం ‘జెడ్నా సి జెడినా’ సాహిత్యంలో అలాంటిది జరగలేదు. అందులో అన్ని జాతులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ గీతాన్ని అక్కడి సెర్బ్‌, క్రోట్‌ సామాజిక వర్గాలు వ్యతిరేకించాయి. దీంతో ఐక్యరాజ్యసమితి ఈ దేశానికి కేవలం సంగీతంతో కూడిన కొత్త జాతీయ గీతాన్ని రూపొందించాలని నిర్ణయించింది. 

అలా 1999 జూన్‌ 25న ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం జాతీయ గీతాన్ని బోస్నియా అండ్‌ హెర్జెగొవినాకు అధికారిక గీతంగా ప్రకటించింది. దీనిని బోస్నియాలోని సెర్బ్‌ వర్గానికి చెందిన సంగీత కళాకారుడు డుసన్‌ సెస్టిక్‌ రూపొందించారు. సాహిత్యం లేని ఈ జాతీయ గీతాన్ని ‘ఇంటర్మెకో’ అని కూడా పిలుస్తారు. కానీ దీనికి అధికారిక గుర్తింపు లేదు. 2007 నుంచి చాలా మంది తమ జాతీయ గీతానికి సాహిత్యం జోడించాలని విఫల యత్నం చేశారు. ఈ జాతీయ గీతం రూపకర్త డుసన్‌ కూడా 2008లో సాహిత్యం అందించారు. అయితే దీనిపై వివాదాలు నెలకొనడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో పలు చోట్ల అనధికారికంగా జాతీయ గీతానికి సాహిత్యం వాడుతున్నారు.


శాన్‌ మారినో.. ఇన్నో నేషనల్‌

యూరప్‌ ఖండంలో ఉన్న శాన్‌ మారినో దేశం జాతీయ గీతంలోనూ సాహిత్యం లేదు. 1894 వరకు ఈ దేశానికి సాహిత్యంతో ‘గిబిలంటీ డీయామోర్‌ ఫ్రాటెర్నొ’అనే జాతీయం గీతం ఉండేది. ఆ తర్వాత ఇటలీకి చెందిన సంగీత కళాకారుడు ఫెడరికో కొన్సొలో సాహిత్యం లేకుండా రూపొందించిన ‘ఇన్నో నేషనల్‌’ను శాన్‌ మారినో ప్రభుత్వం జాతీయ గీతంగా ప్రకటించింది. సాధారణంగా జాతీయ గీతాన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆలపిస్తారు. కానీ, శాన్‌ మారినో నగర వీధుల్లో ప్రతి పర్వదినంలో సైనిక బలగాలు జాతీయ గీతాన్ని ఆలపిస్తాయి.


కొసొవో.. పోటీ పెట్టి మరీ

1877లో కొసొవో ప్రాంతం ఒట్టోమన్‌ రాజ్యంలో కార్యనిర్వాహక ప్రాంతంగా ఉండేది. ఆ తర్వాత 1990 నుంచి 1999 వరకు అనధికార స్వతంత్ర దేశంగా కొసొవో కొనసాగింది. ఆ సమయంలో అల్బానియా జాతీయ గీతాన్నే తమ జాతీయ గీతంగా మలుచుకున్నారు. అల్బానియా జాతీయ చిహ్నాలనే తమ చిహ్నాలుగా కొనసాగించారు. అయితే 2008 ఫిబ్రవరి 17న కొసొవోకు అధికారికంగా స్వతంత్రం లభించింది. దీంతో తమ దేశానికి ఒక నూతన జాతీయ గీతం ఉండాలని భావించి.. బహిరంగ పోటీ నిర్వహించింది. ఎవరి సంగీతమైతే జాతీయ గీతంగా ఎంపికవుతుందో వారికి 10వేల పౌండ్లు నగదు బహుమతి ప్రకటించింది. కాగా అదే ఏడాది జూన్‌ 11న ‘యూరప్‌’ పేరుతో మెండి మెంగ్జికి రూపొందించిన సంగీతం జాతీయ గీతంగా ఎంపికైంది. 2000 సంవత్సరంలో రాఫ్‌ దోమీ అనే సంగీతకళాకారుడు రూపొందించిన ‘కుర్‌ కా రా కుష్‌త్రిమి అండ్ కొసొవో’సంగీతాన్ని అప్పటి దేశాధ్యక్షుడు ఇబ్రహీం రుగొవా ప్రతిపాదించారు. ఈ గీతంలోని సాహిత్యాన్ని అల్బేనియన్‌ భాషలో రచించారు. కానీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు