Phailin to Amphan: దశాబ్ది కాలంలో.. విధ్వంసం సృష్టించిన తుపాన్లు..!

గడిచిన దశాబ్దంలో భారత్‌లో సంభవించిన కొన్ని తుపానులు భారీ విధ్వంసం (Deadliest Cyclones) సృష్టించాయి. ప్రాణనష్టంతోపాటు భారీ స్థాయిలో ఆస్తినష్టం కూడా వాటిల్లింది.

Published : 15 Jun 2023 18:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిఏడాది భారత్‌లో దాదాపు 5 నుంచి 6 తుపాన్లు సంభవిస్తుండగా అందులో రెండు, మూడు మాత్రం చాలా తీవ్రంగా ఉంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో అనేక తుపాన్లు భారత్‌ తీరాన్ని తాకినప్పటికీ.. అందులో కొన్ని మాత్రం చాలా బీభత్సం (Deadliest Cyclones) సృష్టించి ఎంతో నష్టాన్ని కలిగించాయి. తాజాగా బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) అత్యంత నష్టం కలిగించే సామర్థ్యం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో తుపాను ముప్పు ఉన్న తీర ప్రాంతాల నుంచి 74వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తరుణంలో గడిచిన దశాబ్దంలో భారీ విధ్వంసం సృష్టించిన తుపాన్లను ఓసారి గుర్తుచేసుకుంటే..

తౌక్తే తుపాను (2021): భారత్‌లో కొవిడ్‌ రెండోదశ విజృంభిస్తున్న సమయంలో వచ్చిన తౌక్తే తుపాను (Cyclone Tauktae).. గుజరాత్‌లోని దక్షిణ కోస్తా తీరాన్ని 2021, మే 21న తాకి అతలాకుతలం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయి. భారత్‌ పశ్చిమ కోస్తా తీరంలో గడిచిన రెండు దశాబ్దాల్లో వచ్చిన తుపాన్లలో ఇదే బలమైనదిగా నిలిచింది. దీని ప్రభావానికి గుజరాత్‌లో 100 మంది ప్రాణాలు కోల్పోగా.. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలకు తీవ్రనష్టాన్ని కలిగించింది.

ఆంపన్‌ తుపాన్‌ (2020): బంగాళాఖాతంలో 1999 తర్వాత (1999 Odisha cyclone) ఏర్పడిన తొలి సూపర్‌ సైక్లోన్‌ (Cyclone Amphan) ఇదే. 2020 మే 20న పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లో తీరాన్ని తాకింది. సుమారు 120-190 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లూ నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కోల్‌కతాలో తీవ్ర నష్టం జరిగింది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం.. అత్యంత వినాశకర తుపాన్లలో ఒకటి అని. భారత్‌కు సుమారు 14 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. భారత్‌, బంగ్లాదేశ్‌లలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫని తుపాను (2019): తూర్పు కోస్తా ప్రాంతంలోని పూరీ వైపు 2019 మే 3న ఫణి తుపాను (Cyclone Fani) దూసుకొచ్చింది. తీరం దాటే సమయంలో గంటకు 175కి.మీ వేగంతో గాలులు వీచాయి. తుపాను దాటికి 64 మంది ప్రాణాలు కోల్పోగా, భారీ ఆస్తి నష్టం సంభవించింది. వ్యవసాయంతోపాటు కమ్యూనికేషన్‌, కరెంటు, తాగునీటి వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

వార్దా తుపాను (2016): వార్దా తుపాను (Cyclone Vardah) 2016 డిసెంబర్‌ 12న చెన్నై దగ్గర్లో తీరం దాటింది. ఇది అతి తీవ్ర తుపానుగా రికార్డయ్యింది. దీని ప్రభావంతో తమిళనాడులో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చెన్నైతోపాటు సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. అయితే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంతో ముప్పు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యమైంది.

హుద్‌హుద్‌ తుపాను (2014): ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా రాష్ట్రాలను వణికించిన హుద్‌హుద్‌ తుపాను (Cyclone Hudhud) 2014 అక్టోబర్‌ 12న తీరాన్ని తాకింది. తుపాను కారణంగా 124 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు, పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం, వరదల కారణంగా విశాఖ నగరం నాశనమయ్యింది.

ఫైలిన్‌ తుపాను (2013): ఒడిశాలోని గోపాల్‌పుర్‌లో తీరాన్ని తాకిన ఫైలిన్‌ తుపాను (Cyclone Phailin) లక్షల మందిపై ప్రభావం చూపింది. 2013 అక్టోబర్‌ 12న తీరాన్ని తాకింది. ఆ సమయంలో రికార్డు స్థాయిలో గంటకు 200కి.మీ వేగంతో భీకర గాలులు వీచాయి. ఆ సమయంలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్రంలోని 18 జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే, భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగారు. అయినప్పటికీ వ్యవసాయంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసింది.

ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా సంభవించే తుపానుల్లో 8శాతం భారత్‌లోనే చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. 9 రాష్ట్రాల్లో 7516 కి.మీ మేర ఉన్న ఈ తీరప్రాంతంలో సుమారు 32 కోట్ల జనాభా నివసిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌తోపాటు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఈ తుపాన్లకు ప్రభావితమవుతున్నాయి. అయితే, ఈ తుపాన్లు అధికంగా బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయి. అయినప్పటికీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా అరేబియా సముద్రంలోనూ తరచూ సంభవిస్తున్న తుపాన్లు అధిక తీవ్రతను కలిగి ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని