Constitution of india : భారత రాజ్యాంగ అక్షరశిల్పి ఎవరో తెలుసా!
భారత రాజ్యాంగం అసలు ఆంగ్ల ప్రతి అందమైన చేతిరాతతో ఉంటుంది. దిల్లీకి చెందిన కాలిగ్రాఫర్ ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజద తన దస్తూరితో రాజ్యాంగం మొత్తాన్ని రాశారు. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి.
(Image : twitter)
జనవరి 26న యావత్ భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని(republic day) ఘనంగా నిర్వహించుకొంటోంది. స్వరాజ్యం సిద్ధించిన తరువాత మనకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆ నాటి నేతలు భావించారు. ఆ దిశగా అడుగులు వేసి మనది సర్వసత్తాక, సామ్యవాద, గణతంత్ర దేశంగా ప్రకటిస్తూ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ప్రక్రియలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటి రాజ్యాంగం మొత్తం ఒకరే లిఖించడం. ఆ కథేంటో తెలుసుకోండి.
నాడు స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించిన నాయకులు భారత(India) రాజ్యాంగాన్ని రచించేందుకు అనేక మల్లగుల్లాలు పడ్డారు. కొంత మంది సభ్యులతో కలిసి రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసి.. రాజ్యాంగ రచన చేయాలని నిర్ణయించారు. వారంతా పలుదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. వాటిల్లోని ముఖ్యాంశాలను భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. మార్పులు, చేర్పులు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ ముసాయిదా ప్రతులను ప్రింట్ తీయించేవారు. చివరికి భారత రాజ్యాంగం ఓ కొలిక్కి వచ్చింది. ఇక దానిని సరిగ్గా కూర్పు చేసి ప్రింట్ చేయడమే తరువాయి.
అప్పుడే నెహ్రూ(Jawaharlal Nehru)కి ఓ ఆలోచన వచ్చింది. భారత రాజ్యాంగానికి ఏదైనా ప్రత్యేకత ఉండాలని భావించారు. చేతిరాతతో రాజ్యాంగాన్ని లిఖించాలని నిశ్చయించుకున్నారు. అందమైన ఇటాలిక్ చేతిరాతలో నిపుణులు తమను సంప్రదించాలంటూ రేడియోలో ప్రకటన జారీ చేశారు. అప్పుడు తెరపైకి వచ్చారు కాలిగ్రఫీలో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజద(Prem Behari Narain Raizada).
ఎవరీ ప్రేమ్ బెహరీ?
ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజద 1901 డిసెంబరు 16న జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో తాత రామ్ ప్రసాద్ సక్సేనా వద్ద పెరిగారు. ఆయన పర్షియన్, ఇంగ్లిషు భాషల స్కాలర్. కాలిగ్రఫీ(calligraphy) టీచర్‌గానూ పనిచేశారు. వీరి కుటుంబమంతా కాలిగ్రఫీ రంగంలో స్థిరపడింది. ప్రేమ్‌కు చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉండేది. దానిని గమనించిన రామ్ ప్రసాద్.. అతడికి కాలిగ్రఫీలో శిక్షణ ఇచ్చారు. అనంతరం దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ప్రేమ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత నుంచి పూర్తి స్థాయి కాలిగ్రఫీ సాధకుడిగా మారిపోయారు. అక్షరాలను అందంగా మలిచి ఆ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
పైసా వద్దు.. పేరు కావాలి..
రేడియోలో ప్రకటన వెలువడిన సమయంలో గోవన్ బ్రదర్స్ లిమిటెడ్ అనే సంస్థలో ప్రేమ్ బెహరీ నారాయణ్ పనిచేస్తున్నారు. అతడి గురించి తెలుసుకున్న నెహ్రూ ఆయనను పిలిపించి మాట్లాడారు. రాజ్యాంగం మొత్తం రాయడానికి ఎంత సొమ్ము తీసుకుంటారని నెహ్రూ అడగ్గా.. ‘ఒక్క పైసా కూడా అవసరం లేదు. దేవుని దయ వల్ల నా వద్ద అన్నీ ఉన్నాయి. నా జీవితం పట్ల నేను సంతృప్తిగా ఉన్నానని’ ప్రేమ్ బదులిచ్చారు. అయితే, తన మనసులో ఉన్న ఒక్క కోరికను మాత్రం నెహ్రూకు చెప్పారు. అదేంటంటే.. ప్రతి పేజీలో చివరన తన పేరు, రాజ్యాంగం చివరలో తన తాత రామ్ ప్రసాద్ సక్సేనా పేరు ఉండాలని కోరారు. అందుకు అంగీకరించిన నెహ్రూ.. రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను అప్పగించారు.
ఆరు నెలల పాటు సాగిన అక్షర యజ్ఞం
తన సొంత దస్తూరితో రాజ్యాంగాన్ని రచించడానికి సిద్ధమైన ప్రేమ్ రాజ్యాంగ సభ తనకు కేటాయించిన గదిలో కూర్చున్నారు. అప్పటికే రచనకు కావాల్సిన పార్చ్‌మెంట్ షీట్లు, పాళీలను బర్మింగ్‌హామ్, చెకొస్లొవేకియా నుంచి తెప్పించి ఉంచారు. వెయ్యేళ్లు మన్నికగా ఉండే ఆ పార్చ్‌మెంట్ షీట్లపై రాజ్యాంగాన్ని ప్రేమ్ రాస్తూ ఉంటే.. మరో వైపు శాంతినికేతన్‌కు చెందిన నందలాల్ బోస్ తన శిష్యులతో కలిసి ఆ పేజీలను వివిధ చిత్రాలతో అందంగా తీర్చిదిద్దేవారు. వాటిలో మొహంజోదారో, రామాయణం, మహాభారతం, గౌతమ బుద్ధుడు, అశోకుడు, అక్బర్, తదితరుల కాలం నాటి దృశ్యాలను చిత్రీకరించారు. అలా రాజ్యంగ రచన మొత్తాన్ని దాదాపు 6 నెలల్లో పూర్తి చేశారు. ఇందు కోసం మొత్తం 432 పాళీలను ప్రేమ్ బెహరీ వాడారు. ఈయన రచించిన రాజ్యాంగం అసలు కాపీని ప్రస్తుతం పార్లమెంటులో భద్రపరిచారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shaakuntalam: ‘కేన్స్’లో శాకుంతలం మెరుపులు.. స్పందించిన సమంత
-
Health News
అశ్లీల చిత్రాలు తరచూ చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి!
-
Movies News
NTR Centenary Celebrations: ఎన్టీఆర్ స్మరణలో సినీ తారలు.. సోషల్‌మీడియాలో పోస్టులు
-
World News
viral news: లైవ్‌లో అతిగా మద్యం తాగి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతి..!
-
Sports News
IPL 2023: ఈసారి మా గేమ్ ప్లాన్ మాత్రం అలా ఉండదు: చెన్నై సూపర్ కింగ్స్ కోచ్
-
India News
New Parliament building: ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారు: రాహుల్ గాంధీ