Sorvagsvatn lake : సముద్రంపై సరస్సు.. చూస్తే ఔరా అనాల్సిందే!

సముద్రం (Sea) మీదుగా ప్రవహించే సరస్సు ఫోరే దీవుల్లో ఉంది. దాని విశేషాలు తెలుసుకోండి.

Updated : 04 Jul 2023 12:32 IST

Image : Jet Ski Bandit

నదులు సముద్రంలో కలిసే సంగమ ప్రదేశాలు మీరు ఎక్కడైనా చూసుంటారు. కానీ, సముద్రానికి అల్లంత ఎత్తులో సరస్సు ఉండటం చూశారా? అలా కూడా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఫోరే దీవులకు వెళ్లాల్సిందే. డెన్మార్క్‌ సమీపంలో ఉన్నాయి ఈ దీవులు. ఇక్కడి వాగర్‌ ద్వీపం వద్ద సర్వాగ్‌స్వాటన్‌ సరస్సు ప్రవహిస్తోంది. సర్వాగర్‌, వాగర్‌ మున్సిపాలిటీల మధ్యలో ప్రవహిస్తున్న ఈ సరస్సు 3.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అది వయ్యారాలు పోతూ చివరికి సముద్రంలో కలుస్తుంది. కొన్ని వ్యూ పాయింట్ల నుంచి చూస్తే ఈ సరస్సు సముద్రంపై నుంచి వేరే ఎక్కడికైనా వెళ్తోందా అనే అనుమానం కలుగుతుంది. కానీ, అది ఓ ప్రదేశానికి వచ్చే సరికి చిన్న జలపాతంలా మారి సంద్రంలోకి దూకుతుంది. ఆ అద్భుతమైన దృశ్యాలను చూసి ఆనందించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు.

పేరుపై వివాదం

ఈ సరస్సు పేరు ‘సర్వాగ్‌స్వాటన్‌’ అని కొందరు, ‘లైటిస్వాటన్’ అని మరికొందరు వాదిస్తుంటారు. వారంతా స్థానికులే కావడం గమనార్హం. సరస్సుకు పశ్చిమాన ఉన్న సర్వాగుర్‌ నివాసితులు దీని పేరును ‘సర్వాగ్‌స్వాటన్‌’ అని చెబుతారు. తూర్పున ఉన్న మియోవాగర్‌, శాండ్‌వాగర్‌లో నివసించే స్థానికులు ‘లైటిస్వాటన్’గా పిలుస్తుంటారు. సర్వాగుర్‌ కంటే మియోవాగర్‌ గ్రామం సరస్సుకు చాలా సమీపంలో ఉంటుంది.

భ్రమ కలిగించేలా..

అత్యంత సుందరమైన సరస్సు ‘సర్వాగ్‌స్వాటన్‌’ సముద్రానికి చాలా దగ్గరలో ఉంది. సముద్ర మట్టానికి అది 40 మీటర్ల ఎత్తులోనే ఉన్నా చూసేవారికి ఏ వంద మీటర్ల ఎత్తులో ఉందో అన్న భ్రమ కలిగిస్తుంది. ఈ సరస్సు చుట్టూ ఉన్న కొండ శిఖరాలు ఒకేసారి నీరు సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. సరస్సు నుంచి సముద్రంలోకి దూకే జలపాతాన్ని ‘బోస్‌దలాఫోజర్‌’ అని పిలుస్తున్నారు. ఈ జలపాతం హోరు వింటూ.. దాన్ని చూస్తే మైమరచిపోవాల్సిందేనట. వేసవి కాలం చివరిలో లేదా వర్షాకాలం ఆరంభంలో ఈ ప్రాంతం సందర్శనకు అనువుగా ఉంటుందని స్థానిక పర్యాటక సంస్థలు చెబుతున్నాయి.

యుద్ధ నేపథ్యం

ఫోరే దీవులకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ దీవులను బ్రిటిష్‌ వారు ఆక్రమించారు. జర్మన్‌ యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు వారు ఓ వైమానిక  కేంద్రాన్ని నిర్మించారు. బ్రిటిష్‌ రాయల్‌ ఇంజినీర్లు సరస్సుకు పశ్చిమాన ఆ విమానాశ్రయాన్ని డిజైన్‌ చేశారు. శత్రువుల కంట పడకుండా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. సీ ప్లేన్‌ల కోసం కూడా ఓ స్టేషన్‌ నిర్మించారు. 1941లో రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కోస్టల్‌ కమాండ్‌కు చెందిన విమానం ‘కేటలినా’ ఇక్కడ దిగింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని