Herd Immunity: హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కానట్లేనా..?

హెర్డ్‌ ఇమ్యూనిటీని ఎలా సాధించాలని ఆలోచించడం కన్నా వైరస్‌తో కలిసి ఎలా జీవించాలనే అంశంపై దృష్టి పెట్టాల్సిందేనని కొందరు ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Published : 04 Aug 2021 21:30 IST

వైరస్‌తో కలిసి జీవించడంపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి బయటపడేందుకు హెర్డ్‌ ఇమ్యూనిటీ (Herd Immunity) ఒక్కటే పరిష్కారమని నిపుణులు మొదట్లో అంచనా వేశారు. మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్‌ పొందడం వల్ల లేదా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకోవడం వల్ల ఇది సాధించవచ్చని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్‌ రూపాంతరాలు చూస్తుంటే హెర్డ్‌ ఇమ్యూనిటీని పొందడం ఇప్పట్లో సాధ్యం కానట్లే తెలుస్తోంది. దీంతో హెర్డ్‌ ఇమ్యూనిటీని ఎలా సాధించాలని ఆలోచించడం కన్నా వైరస్‌తో కలిసి ఎలా జీవించాలనే అంశంపై దృష్టి పెట్టాల్సిందేనని కొందరు ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

‘ప్రపంచానికి అతి ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ మహమ్మారి వేగంగా మార్పులకు గురవుతోంది. ఇప్పటికే తీవ్రత ఎక్కువగా ఉన్న డెల్టా వంటి కొత్త రకాలతో పలు దేశాలు వణికిపోతున్నాయి. ఇలా అతివేగంగా ఉత్పరివర్తనం చెందుతున్న కరోనా వైరస్‌ను చూస్తుంటే హెర్డ్‌ ఇమ్యూనిటీ ఎప్పటికీ సాధించలేమని తెలుస్తోంది. ముఖ్యంగా సార్స్‌-కోవ్‌-2 విషయంపై హెర్డ్‌ ఇమ్యూనిటీ అనే పదాన్ని కూడా ప్రస్తావించడం మానుకోవాలి’ అని యూనివర్సిటీ ఆఫ్‌ విట్‌వాటర్స్‌రాండ్‌కు చెందిన ప్రజారోగ్య, వ్యాక్సినాలజీ విభాగాధిపతి షబీర్‌ ఏ మధి సూచించారు. అంతేకాకుండా మన జీవితకాలంలో కొవిడ్‌-19 విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చని.. దీని వ్యాప్తి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సవాల్‌గా మారిన కొత్త వేరియంట్లు..

కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాలో కనీసం 67శాతం మందికి వ్యాక్సిన్‌ వేసినప్పటికీ వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంటుందని షబీర్‌ ఏ మధి వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా డెల్టా వంటి శక్తివంతమైన రకాలను ఎదుర్కోవాలంటే 84శాతం మంది ఇమ్యూనిటీని పొందాలి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ సరఫరాలో దేశాల మధ్య అసమానతలు నెలకొనడం కూడా మరో సవాల్‌గా మారింది. కొన్ని పేద దేశాల్లో ఇప్పటివరకు ఒక శాతం ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్‌ లభించగా.. ప్రపంచ సరాసరి 27శాతానికి చేరుకుంది. నిపుణుల అంచనా ప్రకారం, ఇలా కరోనాపై యావత్‌ ప్రపంచం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే ఇప్పట్లో కష్టంగానే కనిపిస్తోంది. అలా అని కొవిడ్‌ నియంత్రణ కోసం దేశాలు సరిహద్దులను మూసివేయడం ఎక్కువ కాలం చేయలేవు. ఒకవేళ వ్యాక్సిన్‌ల నుంచి ఇమ్యూనిటీ పొందినా అవి కొంతకాలం మాత్రమే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యావత్‌ ప్రపంచం కరోనా వైరస్‌పై హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం కష్టమేనని.. అందుచేత, ఆ విషయంపై మాట్లాడడం కంటే వైరస్‌తో కలిసి ఎలా జీవించాలనే అంశాలపై దృష్టి సారించాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.

80-90శాతం మందికి వస్తేనే..

హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే మొత్తం జనాభాలో 60 నుంచి 70శాతం మంది ఇమ్యూనిటీ సాధిస్తే సరిపోతుందని తొలుత నిపుణులు అంచనా వేశారు. కానీ, కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌ దీనిని 80 నుంచి 90శాతానికి పెంచిందని అమెరికాలోని అంటువ్యాధుల సొసైటీ పేర్కొంది. ఇప్పటికే అమెరికాలో 60శాతం మంది కనీసం ఒకడోసు తీసుకోగా.. 50శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ పొందారు. అయినప్పటికీ వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో హెర్డ్‌ ఇమ్యూనిటీపై ఇండోనేసియా కూడా పునరాలోచనలో పడింది. కేవలం వ్యాక్సిన్‌ అందించడం ద్వారా దీన్ని పొందలేమని.. అందరికీ అందించినా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు కొవిడ్ వ్యవహారాలు చూస్తోన్న ఇండోనేసియా మంత్రి పేర్కొన్నారు.

వైరస్‌లతో కలిసి జీవించడమే మార్గం..

కరోనా విషయంలో వ్యాక్సిన్‌ అందించడం ద్వారానే హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం వల్ల ఇమ్యూనిటీ పొందాలనుకుంటే అనవసర కేసులు, మరణాలను చవిచూడాల్సి వస్తుందని ఇదివరకే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రభావశీలత కలిగిన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడం గొప్ప విజయమే అయినప్పటికీ హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుచేత హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం కన్నా వైరస్‌తో ఎలా కలిసి జీవించాలని మాట్లాడుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని