China Apartment : అపార్ట్‌మెంట్‌ అవతారం ఎత్తిన లగ్జరీ హోటల్.. అందులో 20వేల మంది నివాసం!

తక్కువ స్థలంలో ఎక్కువ మంది నివాసం ఉండేందుకు అపార్ట్‌మెంట్‌లు అనువుగా ఉంటాయి. అయితే చైనాలోని (China) ఓ అపార్ట్‌మెంట్‌లో (Apartment) సుమారు 20 వేల మంది నివాసం ఉంటున్నారు. అదెలా సాధ్యమైందో తెలుసుకోండి.  

Updated : 18 Jun 2023 11:18 IST

Image : World Of History

చైనాలోని (China) హాంగ్జౌ నగరంలో ‘ది రీజెంట్‌ ఇంటర్నేషనల్‌ అపార్ట్‌మెంట్‌’ భవనం (Regent International apartment) ఉంది. చూసేందుకు ‘ఎస్‌’ ఆకారంలో ఉన్న ఈ భవనాన్ని తొలుత ఓ లగ్జరీ హోటల్‌ నడిపేందుకు కట్టారు. ఆ తరువాత వివిధ కారణాల వల్ల దానిని అపార్ట్‌మెంట్‌గా మార్చారు. దాదాపు 39 అంతస్తులున్న ఈ భవనం ఎత్తు 206 మీటర్లు. ఇందులో నివాసం ఉండే వారు అడుగు బయట పెట్టకుండా పెద్ద ఫుడ్‌ కోర్టు, స్విమ్మింగ్‌ ఫూల్, సెలూన్లు, సూపర్‌ మార్కెట్లు, ఇంటర్నెట్‌ కేఫ్‌ ఇలా కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. దాంతో ఎవరూ బయటకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. 

ప్రఖ్యాత ‘సింగపూర్ శాండ్స్‌ హోటల్‌’ డిజైనర్‌ అలీసియా లూ ఈ భవనాన్ని డిజైన్‌ చేశారు. 2013లో ‘ది రీజెంట్‌ ఇంటర్నేషనల్‌ భవనం’ ప్రారంభమైంది. అప్పట్లో ఇదో ప్రముఖ కట్టడంగా వార్తల్లో నిలిచింది. దీనిని చూసేందుకు వందలాది మంది తరలివచ్చేవారు. ప్రస్తుతం ‘ది రీజెంట్‌ ఇంటర్నేషనల్‌ అపార్ట్‌మెంట్‌’లో వ్యాపారవేత్తలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వివిధ రంగాల్లో నిపుణులైన చాలా మంది నివసిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు.

ఇందులో చిన్న గదులకు నెలకు 220 డాలర్లు, బాల్కనీ సదుపాయంతో విశాలంగా ఉన్న గదులకు నెలకు 550 డాలర్లు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఫొటోలు, వీడియోలను బట్టి చూస్తే రీజెంట్‌ ఇంటర్నేషనల్‌ అపార్ట్‌మెంట్‌ అద్దెదారులతో కిటకిటలాడుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 11వేల నుంచి 22వేల మంది ఇక్కడ నివాసం ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అపార్ట్‌మెంట్‌ మెత్తం విస్తీర్ణం 2.6లక్షల చదరపు మీటర్లు కావడంతో చైనాలోని అతి పెద్ద కట్టడాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. గత నెలలో ఈ అపార్ట్‌మెంట్‌ ఫొటోలు, వీడియోలు పాశ్చాత్య దేశాల్లోని సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని