America : అమెరికాలో ప్రజలకు డబ్బులు పంచే రాష్ట్రం.. ఒక్కో వ్యక్తికి వెయ్యి డాలర్లు!
1982 నుంచి అలస్కా ప్రజలు ఏటా ‘అలస్కా శాశ్వత నిధి’ నుంచి కొంత మొత్తాన్ని పొందుతున్నారు. ఒక్కో వ్యక్తికి సగటున వెయ్యి డాలర్ల వరకు అందుతోంది.
అలస్కా.. అమెరికాలోని (America) అతిపెద్ద రాష్ట్రం. వెంట్రుకల ఎగుమతి, చేపల పెంపకం, బంగారు నిక్షేపాల తవ్వకం, చమురు వెలికితీత ద్వారా ఈ రాష్ట్రం ఆదాయాన్ని గడిస్తోంది. ప్రధానంగా చమురు ద్వారా ఈ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తోంది. అయితే చమురు విలువ ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. పైగా చమురు పరిమిత వనరు కావడంతో ఎప్పుడో ఒకసారి ఆ నిల్వలు నిండుకోవడం ఖాయం. అందుకు పరిష్కారంగా ఈ రాష్ట్రంలో ఒక నిధి ఏర్పాటు చేశారు. ఏంటా నిధి? అది ప్రజలకు ఎందుకు పంచుతున్నారో తెలుసుకోండి.
సోవియట్ యూనియన్ నుంచి కొని..
అమెరికా 1867లో సోవియట్ యూనియన్ నుంచి అలస్కాను 7.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 1896 వరకు ఇక్కడ వెంట్రుకల ఎగుమతులు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ఆ తరువాత క్లోన్‌డైక్ నది సమీపంలో బంగారు నిక్షేపాలు వెలుగు చూశాయి. 1960 నాటికి ఈ రాష్ట్రం ఆదాయం మత్స్య సంపదపై ఆధారపడింది. అప్పట్లో వార్షిక బడ్జెట్ 100 మిలియన్ డాలర్లుగా ఉండేది.
వెలుగులోకి భారీ చమురు క్షేత్రం
1962 నాటికి పరిస్థితి మారిపోయింది. ఈ రాష్ట్రంలో భారీ చమురు క్షేత్రం బయటపడింది. ప్రూధో బేలో సుమారు 13 బిలియన్ బ్యారెళ్లను తోడుకోవచ్చనే అంచనాకు వచ్చారు. వెంటనే చమురు కంపెనీలకు ఆ భూములను లీజుకివ్వగా 1969లో ఏకంగా 900 మిలియన్ల డాలర్ల ఆదాయం వచ్చింది.
ఆ గవర్నర్ రాకతో..
ప్రూధ్ బే చమురు నిక్షేపాలు, ట్రాన్స్ అలస్కా పైప్‌లైన్ వల్ల అలస్కా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. 1974లో జే హామండ్ గవర్నర్‌గా ఎన్నికయ్యాడు. చమురు నిల్వలు ఏనాటికైనా తరిగిపోవచ్చనే ఆలోచనతో భవిష్యత్ తరాల కోసం ఆయన 1976లో చమురు ద్వారా వచ్చే ఆదాయంతో ‘అలస్కా శాశ్వత నిధి’ని ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం ఆయిల్‌పై వచ్చే రాయల్టీలో 25శాతం ప్రజా పొదుపు నిధిలోకి వెళ్లాలి. అలా ఆ నిధిలోకి వెళ్లిన మొత్తం 2018 నాటికి 65 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఆరేళ్ల తరువాత ప్రజా పొదుపు నిధిలో నుంచి కొంత భాగాన్ని అలస్కా ప్రజలకు పంచే ఏర్పాటు చేశారు. ఎవరైతే ఏడాది కాలంగా అలస్కాలో ఉంటున్నారో వారికి మాత్రమే ఈ సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలే ఈ నిధికి రక్షకుల్లా మారుతారని ఈ పథకాన్ని ప్రతిపాదించిన నేతల అభిప్రాయం. పైగా, ఈ ప్రయోజనం అందరికీ సమానంగా అందడం వల్ల తక్కువ ఆదాయం పొందే అలస్కా ప్రజలకు ఒక ఆర్థిక భద్రత ఉంటుందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ వెయ్యి డాలర్లు
1982లో అర్హత కలిగిన ప్రతి స్థానికుడు వెయ్యి డాలర్ల చెక్కు పొందాడు. ఆ తరువాత నుంచి చివరి ఐదు సంవత్సరాల శ్వాశ్వత నిధి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి డివిడెండ్‌ను చెల్లిస్తున్నారు. 1984లో ‘ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఐఎస్‌ఈఆర్) ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం ఈ పథకం పట్ల 60 శాతం అలస్కా ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తేలింది. 29 శాతం మంది నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 10 శాతం మంది ప్రజలు దీనిని వ్యతిరేకించారు.
ప్రభుత్వం పంచిన డబ్బుతో ప్రజలు ఏం చేశారనే విషయంపై కూడా ఈ సంస్థ సర్వే చేసింది. దాని ప్రకారం వచ్చిన నగదులో 45 శాతం ఆహారం, దుస్తులు, వసతిపై ఖర్చు చేశారు. 20 శాతం దాచుకొని, 20 శాతం ఫెడరల్ ట్యాక్సులు చెల్లించారు. 5 శాతం అప్పులు చెల్లించడానికి, 10 శాతం విమాన టికెట్లు కొనుగోలు చేయడానికి వెచ్చించారు.
తగ్గిన పేదరికం
అలస్కా రాష్ట్రంలో ఏటా అక్టోబరు, నవంబరు మాసాల్లో డబ్బు పంపిణీ జరుగుతుంది. ‘ఆలస్కా శాశ్వత నిధి’ పంపకం కారణంగా ఇక్కడ పేదరికం తగ్గుముఖం పట్టింది. ఈ పథకం వల్ల ఏటా 15 వేల నుంచి 25 వేల అలస్కాన్లు పేదరికం నుంచి బయటపడుతున్నట్లు వెల్లడైంది.
పథకానికి కొన్ని అర్హతలు
- ఇతర రాష్ట్రం లేదా దేశానికి చెందిన వారు కాకూడదు.
- అలస్కాలోనే శాశ్వతంగా నివాసం ఉండాలి.
- ఏదైనా కేసులో దోషిగా ఉండరాదు.
- ఏడాదిలో కనీసం 180 రోజులు అలస్కాలోనే నివసించాలి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: లోడ్.. ఎయిమ్.. షూట్... ప్రపంచకప్ ముంగిట సమసిపోతున్న భారత్ సమస్యలు
-
Elon Musk: మస్క్ పేరు మార్చుకుంటున్నారా..?చర్చకు దారితీసిన తాజా పోస్టు
-
Sept 30 Deadline: పాన్, ఆధార్ సమర్పించారా? లేదంటే ఆ ఖాతాలు స్తంభించిపోతాయ్!
-
ACB Court: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
-
Chandramukhi 2: రజనీకాంత్‌ను కలిసిన లారెన్స్.. ఆనందంగా ఉందంటూ పోస్ట్
-
Canada: ఆధారాలు లేకుండా ట్రూడో ఆరోపణలా..? భారత్‌కు మద్దతుగా శ్రీలంక మంత్రి