Cyclone Biparjoy :‘బిపోర్‌జాయ్‌’ తుపానుకు ఆ పేరెలా వచ్చింది.. ఎవరు పెట్టారంటే?

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’ తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది తీరం దిశగా కదులుతుండటంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ తుపానుకు ఆ పేరెలా వచ్చింది? ఎవరు నిర్ణయించారంటే..?

Published : 12 Jun 2023 13:27 IST

బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) గుజరాత్‌ (Gujarat)లోని కచ్‌, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15వ తేదీన తీరాన్ని దాటనుందని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను.. గంటకు 8 కి.మీల వేగంతో ఈశాన్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 135-150 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కచ్‌, సౌరాష్ట్రలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. అటు గుజరాత్‌ తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో జూన్‌ 15 వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. మరోవైపు, తుపాను ప్రభావంతో ముంబయిలో నేడు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

బిపోర్‌జాయ్‌ పేరు ఎలా వచ్చింది?

ఈ తాజా తుపానుకు బంగ్లాదేశ్‌ బిపోర్‌జాయ్‌ అని పేరు పెట్టింది. బెంగాలీలో బిపోర్‌జాయ్‌ అంటే ‘విపత్తు’ లేదా ‘ఉపద్రవం’ అని అర్థం. ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13దేశాలు ఈ పేర్లను నిర్ణయిస్తాయి. భారత్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాల్దీవులు, మియన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్‌, యూఏఈ, యెమెన్‌ ఆ దేశాలు. వంతుల వారీగా ఈ సారి బంగ్లాదేశ్‌కు పేరు పెట్టే అవకాశం వచ్చింది.

తుపానులకు పేర్లెందుకు?

కొన్ని తుపానుల ప్రభావం వారం కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే సమయంలో మరో తుపాను వస్తే ఎలా అని ఆలోచించి వాటికి పేర్లు పెట్టడం ప్రారంభించారు. ఒక్కో తుపానుకు ఒక్కో పేరు పెడితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు, మీడియాకు, సాధారణ ప్రజలకు ఇది ఫలానా తుపాను అని గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఆ పేరుతో ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. ఈ పేర్లు వీలయినంత చిన్నగా.. సులభంగా పలికే విధంగా ఉండాలనే నిబంధన ఉంది.

ఎవరు నిర్ణయిస్తారంటే..?

ప్రపంచ వ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, నాలుగు ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరిక కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలు తుపానుల గురించి సలహాలు, సమాచారం ఇస్తుంటాయి. అలాగే వాటికి పేర్లు పెడుతుంటాయి. ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాల్లో భారత వాతావరణశాఖ ఒకటిగా పనిచేస్తోంది. ఇది ఉత్తర హిందూ మహా సముద్రంపై గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల ఉపరితల వేగంతో గాలులు వీచే తుపాన్లకు పేర్లు పెడుతుంది. అక్షర క్రమం ఆధారంగా ఒక్కో దేశం ఓ తుపానుకు పేరును సూచిస్తుంది. ప్రతి సారి ఆ పేరు కొత్తగా.. మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలి. పేరు 8 అక్షరాలకు మించరాదు. అది ఏ సభ్య దేశానికీ అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని