Deep sea mining : సముద్ర గర్భంలో అపార ఖనిజ సంపద.. ‘డీప్‌ సీ మైనింగ్‌’తో వెలికితీయొచ్చు!

సముద్రాల్లో మత్స్య సంపద మాత్రమే కాదు అరుదైన ఖనిజ సంపద దాగి ఉంది. అందుకే ఇటీవల కొన్ని దేశాలు ‘డీప్‌ సీ మైనింగ్‌’పై (Deep sea mining) దృష్టి సారించాయి. 

Updated : 06 Jul 2023 14:36 IST

ఖనిజాలు, లోహాల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. కానీ, భూమిలో అవి లభించే శాతం తక్కువగా ఉంటుంది. అందుకే పరిశోధకులు సముద్ర గర్భంపై దృష్టి సారించారు. అందులోని విలువైన సంపదను వెలికి తీసే ఉద్దేశంతో ‘డీప్‌ సీ మైనింగ్‌’ను (Deep sea mining) తెరపైకి తీసుకొచ్చారు. దాని విశేషాలు తెలుసుకోండి.

ఏంటీ ‘డీప్‌ సీ మైనింగ్‌’?

సముద్ర గర్భంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు, లోహాలు ఉన్నాయి. ఖనిజాలు అత్యధిక శాతం ఉన్న పాలిమెటాలిక్‌ నోడ్యూల్‌ వెలికితీత, సల్ఫైడ్ నిక్షేపాలను తవ్వడం, రాతి నుంచి కోబాల్ట్‌ క్రస్ట్‌ను తొలగించడం వంటి మైనింగ్‌ పద్ధతుల ద్వారా వాటిని వెలికితీయొచ్చు. ఇలా మైనింగ్‌ చేయడం వల్ల నికెల్‌, కోబాల్ట్‌, మాంగనీస్‌ వంటి అరుదైన లోహాలు లభిస్తాయి. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో వాటిని పలు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో వాడుతున్నారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, పునరుత్పాదక ఇంధనాలు, బ్యాటరీలు రూపొందించాలంటే ఈ లోహాలు అవసరం.

అనేక రకాలుగా అన్వేషణ

సముద్రం సహజంగానే కొన్ని వేల అడుగుల లోతు ఉంటుంది. అంత లోతులో దాగున్న ఖనిజాలు, లోహాలు ఎలా బయటకు తీసుకురావాలనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు వాక్యూమ్‌ క్లీనర్‌ తరహాలో భారీ పంపులను సముద్రం అడుగు భాగానికి పంపించి వాటి ద్వారా నిక్షేపాలను వెలికితీయాలని చూస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు కృత్రిమ మేధను అభివృద్ధి చేస్తున్నాయి. అంటే, సముద్రంలోకి రోబోలను పంపిస్తే అవి నోడ్యూల్స్‌ను మాత్రమే పట్టుకొని బయటకు తీసుకొస్తాయి. మరికొన్ని కంపెనీలు సముద్రం అట్టడుగు భాగం వరకు వెళ్లి తవ్వగలిగే యంత్రాలను రూపొందిస్తున్నాయి. ఈ పద్ధతులు విజయవంతం అయితే కొన్ని దేశాలు భారీగా లాభపడతాయి. అందుకే పరిశోధనల కోసం అపరిమితంగా ఖర్చు చేసేందుకు అవి వెనుకాడటం లేదు.

పర్యావరణవేత్తల ఆందోళన

ఇప్పటికే భూమిపై జరుపుతున్న తవ్వకాలతో పర్యావరణానికి చాలా నష్టం వాటిల్లుతోంది. సముద్రంలో కూడా తవ్వకాలు సాగిస్తే మానవులతో సహా అనేక జీవజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడలిలో మైనింగ్‌ వల్ల వెలువడే శబ్దాలు, ప్రకంపనలు, కాంతి మత్స సంపదకు ఇబ్బందులు సృష్టిస్తాయని చెబుతున్నారు. మైనింగ్‌ వల్ల కొన్ని రకాల ఇంధనాలు, రసాయనాలు కూడా నీటిలో కలిసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా వెలువడిన వ్యర్థాలను తిరిగి సముద్రంలోకి విడుదల చేయడం వల్ల పగడపు దీవులు, స్పాంజెస్‌ ఇతర జీవులను ప్రమాదంలోకి నెట్టినట్లవుతుంది.

వ్యతిరేకిస్తున్న దేశాలు.. కంపెనీలు

సముద్రంలో 200 మీటర్ల లోతుకు వెళ్లగానే చీకటి కన్పిస్తుంది. ఇలా చీకటిగా ఉండే భాగం దాదాపు అన్ని సముద్రాల్లో అధికంగా ఉంటుంది. ఆ భాగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిపే పూర్తి శాస్త్రీయ సమాచారం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. అక్కడ ఉండే జీవులకు హాని కలిగిస్తే.. మానవులకు కూడా ఇబ్బందులు ఎదరయ్యే ప్రమాదముంది. అందుకే డీప్‌ సీ మైనింగ్‌కు తాము వ్యతిరేకమని ఇప్పటికే చాలా దేశాలు ప్రకటించాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, న్యూజిలాండ్‌, కోస్టారికా దేశాలు డీప్‌ సీ మైనింగ్‌ను బలంగా వ్యతిరేకిస్తూ తమ చట్టసభల్లో తీర్మానాలు చేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌, రెనాల్ట్, శామ్‌సంగ్‌, టెస్లా వంటి మల్టీ నేషనల్‌ కంపెనీలు సైతం డీప్‌ సీ మైనింగ్‌ ద్వారా వెలికి తీసిన ఖనిజాలు, లోహాలను తమ ఉత్పత్తుల్లో వాడబోమని గతంలోనే ప్రకటించాయి.

సై అంటున్న నార్వే

డీప్‌ సీ మైనింగ్‌కు నార్వే ఉవ్విళ్లూరుతోంది. దాదాపు 4 వేల మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టడానికి ఆ దేశం ప్రణాళికలు రచిస్తోంది. సముద్రంలో 2.81లక్షల చదరపు కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టాలని నార్వేజియన్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌ నిల్వలపై ఆధారపడకుండా తాము కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నామని నార్వే తన చర్యను సమర్థించుకుంటోంది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెబుతోంది.

మన దేశంలోనూ ‘బ్లూ ఎకానమీ’

సముద్ర గర్భంలో దాగిన అపరిమిత సహజ వనరులను ఒడిసి పట్టుకొని ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా వినియోగించుకొనేందుకు భారత ప్రభుత్వం 2021లోనే ప్రణాళిక రచించింది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వనరుల అన్వేషణ కోసం రూ.4,077 కోట్ల వ్యయంతో ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’ చేపట్టింది. 7,517 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, 1,382 ద్వీపాలున్న మన దేశం సాగర గర్భంలోని వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’కు శ్రీకారం చుట్టింది. డీప్‌ సీ మైనింగ్‌ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, సముద్ర వాతావరణ మార్పులపై అధ్యయనం, జీవ వైవిధ్య రక్షణకు చర్యలు, సముద్ర లోతుల్లో సర్వే, ఇంధనాలు- తాగునీటి సేకరణ, ప్రత్యేక మెరైన్‌ కేంద్రాలు వంటి ఆరు అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని