Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 26 Sep 2022 21:02 IST

1. అమరావతి రైతుల పాదయాత్రను ఎలా ఆపగలమో చూస్తారా?: బొత్స

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. కన్నెర్రజేస్తే యాత్రలు ఆగిపోతాయని.. తలుచుకుంటే 5 నిమిషాల్లో పాదయాత్రను ఆపుతామన్న మాటలకు తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. మరో ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోవాలా?అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఎయిమ్స్ కోసం వైకాపా ఏం చేసిందో చెప్పగలరా?: చంద్రబాబు

వైద్యరంగంపై సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు మానుకొని.. తొలుత ఎయిమ్స్‌లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీస నీటి సరఫరా చేయలేని ప్రభుత్వాన్ని ఏమనాలని మండిపడ్డారు. అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. అంగన్‌వాడీల నిర్వహణకు ప్రత్యేక నిధి.. సమీక్షలో సీఎం జగన్‌

రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. కమల్‌నాథ్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు..ఎందుకో?

రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. తక్షణమే దిల్లీకి రావాలన్న అధినేత్రి  ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం సోనియాగాంధీతో ఆయన భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకే ఆయన్ను దిల్లీకి పిలిపించి మాట్లాడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభంపై భాజపా సెటైర్లు!

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హైడ్రామాతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని.. ఆ పార్టీ నేతలెవరూ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా ఉండటానికి ఇష్టపడటంలేదని, సీఎం పదవి లేదా రాష్ట్రాల్లో నేతలుగా ఉండటానికే ఇష్టపడుతున్నారంటూ భాజపా నేత సతీశ్‌ పూనియా విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఐ యామ్‌ సారీ..నేనేం చెయ్యలేను’: గహ్లోత్‌

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఒకవేళ గహ్లోత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే ఆ స్థానాన్ని సచిన్‌పైలట్‌కు ఇస్తామనడాన్ని నిరసిస్తూ దాదాపు 90కిపైగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గేతో అన్నట్లు సమాచారం.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. పీవోకే పై అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సింది: రాజ్‌నాథ్‌సింగ్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్పందించారు. 1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలోనే దీనిపై గట్టి నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని నాదౌన్‌లో అమరవీరుల కుటుంబాలను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ..‘‘ 1971 ఇండోపాక్‌ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది’’ అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ దరఖాస్తు ఇక ఆన్‌లైన్‌లో..!

పాస్‌పోర్టు దరఖాస్తు దారులకు ఊరట కలిగించే విషయం. పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ దరఖాస్తును సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఆన్‌లైన్‌ పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లోనూ (POPSKs) ఈ సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. సెప్టెంబర్‌ 28 నుంచే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మరికొన్ని యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం కొరడా

సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేలా కేంద్రం కఠిన చర్యలు చేపడుతోంది. విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తోన్న పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ఇప్పటికే నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 10 ఛానళ్లపై కొరడా ఝళిపించింది. మత విద్వేషాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో నకిలీ వార్తలు, మార్ఫింగ్‌ చేసిన కంటెంట్‌ని ప్రసారం చేస్తోన్న 45 యూట్యూబ్‌ వీడియోలతో పాటు 10 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసినట్టు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. పాక్‌కు అమెరికా ఎఫ్‌16 జెట్లు.. ఎవరిని ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు?

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌కు అమెరికా ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయించడాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తప్పుబట్టారు. ఇస్లామాబాద్‌తో బంధం.. అమెరికాకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చబోదన్నారు. ఈ చర్యతో అమెరికా ఎవర్ని తెలివితక్కువ వారిని చేయాలనుకుంటోందని ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్‌.. వాషింగ్టన్‌లో భారత-అమెరికన్‌ కమ్యూనిటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని