దేశంలో కరవు సృష్టించేందుకు యత్నం: మమత

వ్యవసాయ సంబంధిత బిల్లుల ద్వారా కేంద్రం దేశంలో కరవు పరిస్థితులను సృష్టించేందుకు యత్నిస్తోందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన ఆ బిల్లులు రైతులకు ఉపయోగకరంగా లేవని ఆమె సోమవారం ఓ మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.

Published : 21 Sep 2020 19:08 IST

కోల్‌కతా: వ్యవసాయ సంబంధిత బిల్లుల ద్వారా కేంద్రం దేశంలో కరవు పరిస్థితులను సృష్టించేందుకు యత్నిస్తోందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన ఆ బిల్లులు రైతులకు ఉపయోగకరంగా లేవని ఆమె సోమవారం ఓ మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. 'కేంద్రం అమలు చేయనున్న రెండు వ్యవసాయ బిల్లులు రైతులను కనీస మద్దతు ధర నుంచి దూరం చేస్తాయి. దీంతో దేశంలో కరవు పరిస్థితులు దాపురిస్తాయి. వీటిపై వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకతాటిపైకి రావల్సిన అవసరం ఉంది. నిత్యవసరాల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం  ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ బిల్లుల ద్వారా రైతులు కనీస మద్దతు ధర కోల్పోగా.. సంక్షోభం తలెత్తుతుంది' అని ఆమె ఆరోపించారు. 

కాగా వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందే సమయంలో కొందరు ఎంపీలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఈ ఘటనపై రాజ్యసభ ఛైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపా ఫిర్యాదు మేరకు 8 మంది సభ్యులను వారం పాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారిలో ఇద్దరు టీఎంసీ ఎంపీలు సైతం ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్‌పై ఇప్పటికే ట్విటర్‌ ద్వారా స్పందించిన మమత కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి స్పష్టమవుతోందని విమర్శించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని