ఆ టీవీ కార్యక్రమాలు ప్రసారమవకూడదు

టీవీలలో ప్రతిరోజూ మనం చూస్తున్న అనేక కార్యక్రమాలు ప్రసారమే కాకూడదని సుప్రీం చురకలు వేశారు.

Published : 18 Sep 2020 02:04 IST

ప్రెస్‌ కౌన్సిల్‌కు సుప్రీం చురకలు

దిల్లీ: ప్రజలపై డిజిటల్‌ మీడియా ప్రభావం అమితంగా ఉందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నియంత్రణ ప్రమాణాల నిర్దేశంలో డిజిటల్‌ మీడియాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. డిజిటల్‌ మాధ్యమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. 

డిజిటల్‌ మాధ్యమాలకు ప్రమాణాలు

సుదర్శన్‌ టీవీ అనే ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌కు సంబంధించిన కేసు సందర్భంగా.. డిజిటల్‌ మాధ్యమాలకు ప్రమాణాలను నిర్ణయించే అంశం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం సుప్రీం కోర్టుకు ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ‘‘ ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలను గురించి మార్గదర్శకాలు, తీర్పులు స్పష్టంగానే ఉన్నాయి. కాగా ప్రజలపై డిజిటల్‌ మీడియా ప్రభావం తీవ్రంగా పడుతోంది. వార్తల ప్రచారంలో దానికి గల వేగం, శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానం మొదట డిజిటల్‌ మీడియాపై దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నాము’’ అని దానిలో పేర్కొంది. అంతేకాకుండా డిజిటల్‌ మాధ్యమాల విషయమై అమికస్‌ క్యూరీని నియమించాల్సిందిగా సుప్రీంను కోరింది. 

సుదర్శన్‌ టీవీలో ప్రసారమయ్యే ఓ కార్యక్రమం, ఓ వర్గానికి చెందిన వారిని కించపర్చేదిగా ఉందని, ఆ షోను నిలిపి వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ విచారణలో.. ప్రత్యేకించి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై ముద్ర వేయరాదని కోర్టు వెల్లడించింది.

అవధులు లేని మీడియా తీరు
టీఆర్‌పీ కోసం, సంచలనం సృష్టించటం కోసం టీవీ ఛానెళ్లు పోటీ పడటంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసును కవర్‌ చేయటంలో అవధులు లేని మీడియా తీరుపై  కోర్టు విచారం వ్యక్తం చేసింది. పత్రికా స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదని.. న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇందుకు జవాబుగా ప్రసార మాధ్యమాల్లో విధివిధానాలు సక్రమంగానే అమలవుతున్నాయని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వివరణ ఇచ్చింది. నిబంధనలు అతిక్రమించిన ఏ ఛానల్‌ కైనా రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని సంస్థ తెలిపింది. కాగా, అదే నిజమైతే టీవీలలో రోజూ మనం చూస్తున్న అనేక కార్యక్రమాలు ప్రసారమే కాకూడదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పీసీఐకి చురకలు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని