ఖలిస్థానీ బెదిరింపుల వేళ.. దిల్లీ ఎయిర్‌పోర్టులో సందర్శకుల ఎంట్రీపై ఆంక్షలు

ఎయిరిండియా(Air India) విమానాలకు వచ్చిన ఖలిస్థానీ బెదిరింపులను భారత్‌ తీవ్రంగా పరిగణించింది. ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. 

Published : 07 Nov 2023 17:02 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) ప్రయాణికులను హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ చేసిన బెదిరింపులను భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో దిల్లీ, పంజాబ్‌ విమానాశ్రయాల్లో(airports) భద్రతను కట్టుదిట్టం చేసింది. దిల్లీ విమానాశ్రయంలో సందర్శకులకు ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాస్‌ జారీని నిలిపివేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS)ఆదేశించినట్లు సమాచారం.

బీసీఏఎస్‌ సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ రెండు విమానాశ్రయాల నుంచి ఎయిరిండియా విమానాల్లో వెళ్లే ప్రయాణికుల అదనపు తనిఖీలు ఉండనున్నాయి. అలాగే దిల్లీ విమానాశ్రయంలో సందర్శకులకు ఎంట్రీ పాస్‌ల జారీని, ఎంట్రీ టికెట్ల అమ్మకాన్ని నిషేధించనున్నారు. నవంబర్ 30 వరకు ఈ అదనపు భద్రతా ఏర్పాట్లు అమల్లో ఉండనున్నాయి. దర్యాప్తు సంస్థలను నుంచి వస్తోన్న హెచ్చరికల దృష్ట్యా ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు బీసీఏఎస్‌ పేర్కొంది. దిల్లీ విమానాశ్రయ అధికారి దీనిపై స్పందిస్తూ.. బీసీఏఎస్‌ ఉత్తర్వులు అమలవుతున్నాయన్నారు. ఈ పరిణామాల మధ్య ఎయిరిండియా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

‘ఏం చేసినా సరే.. తక్షణమే ఆ పొగ ఆపండి’: వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌

భారత్‌లోని సిక్కు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఖలిస్థాన్‌ వేర్పాటువాది, ‘సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ కొద్దిరోజుల క్రితం ఓ వీడియో విడుదల చేయడం తీవ్ర కలకలం రేపింది. అందులో అతడు ఎయిరిండియా ప్రయాణికులకు తీవ్ర హెచ్చరికలు చేశాడు. నవంబరు 19న ఎయిరిండియా విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని అన్నాడు. భారత్‌లోని సిక్కులెవరూ ఆ రోజున ఎయిరిండియా(Air India) విమానాల్లో ప్రయాణించొద్దని హెచ్చరించాడు. ఇక, దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరునూ మార్చేస్తామని వీడియోలో హెచ్చరించాడు. అదే రోజున అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న విషయాన్ని కూడా పన్నూ ప్రస్తావించాడు.

ఈ బెదిరింపులను తీవ్రంగా తీసుకున్న భారత్.. ఆ విమానాలకు భద్రత కల్పించాలని కెనడాను కోరింది. ఈ విషయమై చర్చలు జరుపుతున్నట్లు కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. దిల్లీ నుంచి టొరంటో, వాంకోవర్‌కు ఎయిరిండియా నేరుగా విమానాలు నడుపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని