Anand Mahindra: ఆనంద్‌ మహీంద్రా ప్రేమ కథ ఇదీ..

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా టీనేజ్‌లోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌ హీరో స్టైల్‌లో ప్రపోజ్‌ చేసి ఆమె మనసు గెలుచుకున్నారు.

Updated : 26 Mar 2024 17:04 IST

ఈటీవీ భారత్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా టీనేజ్‌లోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌ హీరో స్టైల్‌లో ప్రపోజ్‌ చేసి ఆమె మనసు గెలుచుకున్నారు. ఆయన హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతుండేవారు. ఒకసారి ఆయన కళాశాల ఎసైన్‌మెంట్‌ కోసం ఒక ఫిల్మ్‌ షూట్‌ చేయడానికి ఇందౌర్‌ వచ్చారు. అక్కడే ఆయన మొదటిసారి ఓ 17 ఏళ్ల అందమైన యువతిని చూశారు. చూసీచూడగానే ప్రేమలో పడిపోయారు. ఆమే అనురాధ మహీంద్రా. ఆమెను చూసిన తరువాత ఆనంద్‌ తిరిగి హార్వర్డ్‌కు వెళ్లలేకపోయారు. ఆమెతోనే గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఏకంగా ఒక సెమిస్టర్‌ పరీక్ష రాయకుండా ఉండిపోయారు. అప్పట్లో ఇది ఎంత పెద్ద నిర్ణయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనురాధతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఆనంద్‌ మహీంద్రా ఇక ఆగలేదు. బాలీవుడ్‌ హీరో స్టైల్‌లో, తన అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో ఆమెకు ప్రపోజ్‌ చేశారు. అంతే వీరిద్దరి పెళ్లి 1985 జూన్‌ 17న పెద్దల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగిపోయింది. అనురాధ ఆనంద్‌ మహీంద్రా భార్య మాత్రమే కాదు. ఆమె ప్రసిద్ధ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ మ్యాగజీన్‌ వెర్వ్‌ వ్యవస్థాపకురాలు. మ్యాన్స్‌ వరల్డ్‌ మ్యాగజీన్‌కు సహ వ్యవస్థాపకురాలు. ముంబయిలో జన్మించిన అనురాధ ప్రతిష్ఠాత్మక సోఫియా కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పెళ్లి తర్వాత ఈ దంపతులు బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. అనురాధ మహీంద్రా బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్‌ ప్రోగ్రామింగ్‌ చేశారు. అనంతరం జర్నలిజం, పబ్లిషింగ్‌లో తన కెరియర్‌ను ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని